Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంలోపాలను ప్రశ్నించడం యువత హక్కు

లోపాలను ప్రశ్నించడం యువత హక్కు

- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసిన వారికి నా సెల్యూట్
అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి
మంత్రులు, అధికారులు, పోలీసులు దేవుళ్లు కాదు..
ప్రజాసేవకులు : బుకర్ విజేత గీతాంజలి శ్రీ


న్యూఢిల్లీ : దేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసులు దేవుళ్లు కాదని, ప్రజలకు జవాబుదారీగా పనిచేసే ప్రజాసేవకులని ప్రముఖ రచయిత్రి, 2022 ఇంటర్నేషనల్ బుకర్ అవార్డు గ్రహీత గీతాంజలి శ్రీ స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, యువతపై పోలీసు బలప్రయోగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువత స్వరాన్ని అణచివేయకుండా వారి ఆందోళనలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన సీజేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా యువత అసంతృప్తికి ప్రతీకగా మారిందని గీతాంజలి శ్రీ అభిప్రాయపడ్డారు.‘ది వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… “ఈ యువత భారతీయులు. ఇది వారి దేశం… వారి ఇల్లు. ఇంట్లో పగుళ్లు, లీకేజీలు కనిపిస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. ఇల్లు కూలిపోతుందేమోనని భయపడతారు. ఇప్పుడు యువత కూడా అదే చేస్తోంది. దేశంలోని లోపాలను చూపిస్తూ వాటిని సరిచేయాలని, తమ భవిష్యత్తును కాపాడాలని కోరుతోంది” అని అన్నారు. జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు, ఇతర భద్రతా బలగాలు వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులపై లాఠీచార్జ్, పెలెట్‌లాంటి గాయాలు, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువడుతున్నప్పటికీ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని చెప్పారు. యువత ప్రజాస్వామ్య విలువలను దేశానికి మరోసారి గుర్తుచేసిందని ఆమె ప్రశంసించారు. “ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మనకు మళ్లీ గుర్తు చేసిన యువతకు నా సెల్యూట్. అధికారంలో ఉన్నవారు తమ బాధ్యతను వివేకంతో నిర్వర్తించాలని కోరుతున్నాను” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -