మహిళలకు అందని జీరో వడ్డీ రుణం..

– మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల మంజూరు.
– జిల్లాలో 2.31లక్షల మంది మహిళలకు చేకూరాలని లబ్ది..
– కొత్త ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళా సంఘాలు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మహిళా సంఘాల్లోని సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వంద శాతం వడ్డీ రాయితీ రుణాల పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసినా వడ్డీని మహిళలకు అందించడంలో విఫలమైంది. ఉమ్మడి రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు పావలా వడ్డీకి బ్యాంకు లింకేజీ రుణాలను అందించేవారు. బ్యాంకులు నిర్ధేశించిన లెక్క ప్రకారం మహిళలు వడ్డీ, అసలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం వడ్డీని రీఎంబెర్స్‌మెంట్‌ రూపంలో తిరిగి ఇచ్చేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత వడ్డీలేని రుణాలు అందిస్తామని ప్రకటించింది.తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేవలం రెండుసార్లు మాత్రమే వడ్డీ బకాయిలు చెల్లించారు.వడ్డీ బకాయిలు కుప్పలుగా పేరుకుపోయినా మహిళలకు నామమాత్రంగానే రాయితీ డబ్బు చేతికి అందింది.కాగా  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి జీరో వడ్డీ రుణాలను పక్కాగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జీరో వడ్డీ రుణాల పంపిణీతో మహిళా సంఘాలపై ఆర్థికభారం తగ్గనుంది.ఏది ఏమైనా మహిళా సంఘాల సభ్యులకు జీరో వడ్డీ రుణాల అంశం మరోసారి తెరపైకి రావడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 23,124 మహిళా సంఘాలు..
జిల్లాలోని 23 మండలాల పరిధిలో 17,735 మహిళా సంఘాలు, 5 మున్సిపాలిటీలలో 5,389 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 2.31లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.  కాగా స్వయం సహాయక సంఘాల బలోపేతనమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుం బిగిస్తోంది.ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వ పనుల్లోనూ మహిళా సంఘాల సభ్యులను భాగస్వా ములను చేయటానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులను కుట్టే పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. ప్రభుత్వ రుణాలతో చిన్నతరహా మిల్లులు, చిరుధాన్యాలతో తినుబండారాల తయారీ వంటి పరిశ్రమలు ఏర్పాటుచేసి మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి రంగంలోకి రాణిస్తున్నారు. వారిని మరింత ప్రోత్సహించే విధంగా వడ్డీ లేని రుణాలు అందజేస్తే ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.గత ప్రభుత్వాలు సైతం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించాయి. సభ్యులు రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆయా సంఘాలకు వడ్డీ తిరిగి చెల్లించేవి. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో వడ్డీ రాయితీ చెల్లింపులు ఆగిపోయాయి. అందుకే మళ్లీ వడ్డీ లేని రుణాలందించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.5లక్షల భీమాతో ధీమా..
గతంలో మహిళా సంఘాల సభ్యులకు అభయహస్తం, జనశ్రీ లాంటి పథకాలతో బీమా వచ్చేది.ఎలాంటి కారణాలతోనైనా సభ్యురాలు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.30వేలు అందజేసేవరు.ఆతర్వాత పథకాలు రద్దయ్యాయి. రైతు బీమా మాదిరిగా స్వయం సహాయక సంఘాల సభ్యులకూ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అలాగె ప్రీమియంనీ కూడా సొమ్మునూ చెల్లించనుంది. జిల్లాలో 60 సంవత్సరాల వయస్సు లోబడిన సంఘాల సభ్యులకు లబ్దిజరుగనునున్నది.కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్‌ మాసం నుంచి మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు.కాగా విధివిధానాలు వెలువడాల్సి ఉంది.గతంలో తీసుకున్న రుణాలను వడ్డీతో సహా నెలవారీగా సభ్యులు చెల్లించేవారు. ఆరు నెలలకోసారి ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ సొమ్ము అందించేది. మహిళా సంఘాల నుంచి వసూలైన వడ్డీని తిరిగి ఆయా సంఘాల ఖాతాల్లో బ్యాంకులు జమచేసేవి. ఇప్పుడు కూడా ఇలాంటి విధానాన్నే అనుసరిస్తారా? కొత్త పద్ధతి ప్రవేశపెడతారా అనేది చూడాలి.
Spread the love