సామాజిక జీవితంలో నయా ఫాసిస్టులు ప్రత్యేకించి, అదే పనిగా పెట్టుకుని విద్యను నాశనం చేస్తున్నారు. ఏమాత్రమూ సిగ్గూ శరమూ లేకుండా వాళ్లు ఇందుకు పాల్పడుతున్నారు. వాళ్లు చేస్తున్నది విద్యను నిర్లక్ష్యం చేయడం లేదా ప్రైవేటీకరించడం, అందుకు నిధులను కేటాయిం చకపోవడం వంటివి మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువగా పనిగట్టుకుని, బరితెగించి విద్యను నాశనం చేస్తున్నారు.
విద్య విషయంలో వామపక్షాల వైఖరి, అందునా కమ్యూనిస్టుల వైఖరి. నయా ఫాసిస్టుల వైఖరికి పూర్తి వ్యతిరేక దిశలో ఉంటుంది. దేశంలో కమ్యూనిస్టు నేతలు చొరవ తీసుకుని ప్రారంభించిన విద్యా సంస్థలు పలు చోట్ల ఉన్నా యి. ప్రజానీకాన్ని గనుక విద్యావంతుల్ని చేయగలిగితే వాళ్లు అత్యంత సహజంగా కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితు లౌతారన్నది కమ్యూనిస్టు ఉద్యమ వైతాళికుల బలమైన నమ్మకం. ఎందుకంటే కమ్యూనిస్టు భావజాలం అన్నది సామాజిక చైతన్యపు అత్యున్నత స్థాయి వ్యక్తీకరణ. ఇదేదో తమ స్వంత భావజాలాన్ని మాత్రమే ప్రచారం చేసుకోవాలనే సంకుచిత దృష్టి కానే కాదు. కమ్యూనిజాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే వాళ్లు ఈ బూర్జువా సమాజాన్ని, బూర్జువా సిద్ధాంతాన్ని కూడా అర్ధం చేసుకోగలగాలి. అందుకోసమే మొత్తంగా విద్య పట్ల కమ్యూనిస్టుల్లో అంత బలమైన ఆకాంక్ష కనిపిస్తూ వుంటుంది. వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన కాలంలో కూడా ఈ విషయంలో తక్కినవారికి భిన్నంగా కమ్యూనిస్టులు ప్రత్యేక పాత్ర పోషించారు.
ఈ వైఖరికి పూర్తి భిన్నంగా ఫాసిస్టులు, నయా ఫాసిస్టులు వ్యవహరిస్తారు. తక్కిన మితవాద ఉద్యమాలకు భిన్నంగా వీళ్ళకి తమదైన స్వంత ‘సిద్ధాంతం’ ఉంది. ఈ ‘సిద్ధాంతం’ ప్రాతిపదికనే వాళ్లు కొంతమంది నిస్సహాయులైన మైనారిటీలను ‘పరాయివారి’గా చిత్రించి వారిమీద విద్వేషాన్ని రెచ్చగొడతారు. ఫాసిజానికి ఆద్యులైన కొందరు ముందుకు తెచ్చిన వాదనలే ఈ సిద్ధాంతానికి ఆధారం. అయితే, ఈ వాదనలకు వేటికీ ఎటువంటి రుజువులూ ఉండవు. వాస్తవానికి ఫాసిస్టులకు, నయా ఫాసిస్టులకు అసలు రుజువులు అంటేనే పడదు. అన్ని రకాల రుజువులనూ తోసిరాజంటారు. తమ బుర్రల్లో ఎటువంటి సాధికార శాస్త్రీయ పరిశోధనకూ చోటు లేకుండా చేసుకుంటారు. రుజువుల కోసం, ఆధారాల కోసం అన్వేషించడం, వాటిని విశ్లేషించడం అన్నది వాళ్లకి పడదు. మరి విద్యా సంస్థలు అంటేనే శాస్త్రీయ పరిశోధనలకు నిలయాలుగా ఉంటాయి. జ్ఞానాన్వేషణ వాటి ప్రధాన లక్షణం. అందుచేత అటువంటి విద్యా రంగం ఫాసిస్టులు చెప్పే ‘సిద్ధాంతానికి’ అత్యంత ప్రమాదకరంగా నిలుస్తాయి. అందువల్లనే ఫాసిస్టులు, నయా ఫాసిస్టులు విద్యాసంస్థల పట్ల పూర్తి శతృపూరిత ధోరణినే అనుసరిస్తారు.
ప్రస్తుతం విద్యపై జరుగుతున్న దాడి రెండు వైపుల నుండి సాగుతోంది. మొదటిది ఇప్పటికే మనందరికీ బాగా తెలిసిన నయా ఉదారవాద దాడి. విద్యారంగం మీద ప్రభుత్వం చేయవలసిన ఖర్చుకు కోతలు పెట్టడం, ప్రైవేటీకరణను బల వంతంగా అమలు చేయించడం, తద్వారా విద్యను వ్యాపారంగా దిగజార్చడం, శోధించడం అనే ధోరణి స్థానే కేవలం కొన్ని నైపుణ్యాలను అలవర్చుకోవడమే విద్య అన్నట్టు విద్యను దిగజార్చడం -ఇదంతా నయా ఉదారవాద విధానాల దాడి ప్రభావం. ఇక నయా ఫాసిస్టుల వైపు నుంచి దాడిని చూస్తే వాళ్లు ఎటువంటి విమర్శనాత్మక పరిశోధననైనా ప్రమాదకరం అనే పరిగణిస్తారు. జనాభాలో అత్యధిక భాగానికి విద్య అందకుండా చేస్తారు. మహా అయితే కొన్ని రకాల నైపుణ్యాలను నేర్పడానికి మాత్రమే పరిమితం చేస్తారు. ఆ విధంగా విద్య అనేది కొన్ని ఉన్నత తరగతుల కుటుంబాలలోని పిల్లలకు కొన్ని రకాల నైపుణ్యాలను నేర్పే వ్యవస్థగా దిగజారిపోతుంది. బీజేపీ నాయకత్వం లోని ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానం సారాంశం ఇదే.
దీనితోబాటు మన దేశంలో నయా ఫాసిస్టులు విద్యారంగం విషయంలో అనుసరించే వినాశకర వైఖరి వెనుక ఇంకొక కుట్రపూరిత ధోరణి కూడా అంతర్లీనంగా ఉంది. నయా ఫాసిస్టులు కేవలం కొన్ని అభిప్రాయాలకి మాత్రమే కట్టుబడి వుండే రకం కాదు. హానికరమైన పర్యవసానాలకు దారి తీసే ఒక అవివేక సిద్ధాంతాన్ని పట్టుకుని వేళ్లాడుతుండే మూర్ఖ వ్యక్తులు. ఇక్కడ విశేషం ఏమంటే ఆ నయా ఫాసిస్టు నేతలకు తమ సిద్ధాంతం ఎంత అవివేకమైనదో తెలుసు. అయినప్పటికీ దానినే ముందుకు తోస్తుంటారు. ఆ క్రమంలో సాధారణ ప్రజానీకాన్ని మాత్రమే కాక, తమ అనుయాయులను సైతం వాళ్లు బోల్తా కొట్టిస్తుంటారు. నయా ఫాసిజం అనేది అసత్యాల మీద ఆధారపడిన ఒక దురుద్దేశపూరిత చర్చను నడపడమే కాక, అందరినీ మోసగిస్తూ వుంటుంది. తాము ప్రజలను నమ్మించేందుకు వారిలో ప్రచారం చేస్తున్నదంతా అసత్యం, అవాస్తవం అని తెలిసికూడా నిరంతరమూ ఆ పనిమీదే ఉంటుంది.
ప్రజానీకంలో విద్యావంతులైన భాగం ఈ మోసానికి అంత తేలికగా పడిపోరు. వారిలో చాలామంది వత్తిళ్ళకు లోనౌతున్నందువల్ల, మరికొంతమంది ప్రలోభాలకు లొంగిపోయి, ఇంకా మరికొంతమంది వారి వర్గదృష్టి వలన, చేపట్టే వర్గ వైఖరి వలన నయా ఫాసిస్టులకు అనుకూలంగా నడుచుకుంటూ వుంటారు. అయితే వారిలో కూడా నయా ఫాసిస్టుల ‘సిద్ధాంతం’ పట్ల ఎట్టి విశ్వాసమూ ఉండదు. కొందరైతే పూర్తిగా వ్యతిరేకిస్తారు కూడా. అంతేకాదు, నయా ఫాసిస్టులు తాము నమ్మని తమ ‘సిద్ధాంతాన్ని’ ఏ విధంగా కుట్రపూరితంగా ప్రజానీకంలో చొప్పించ డానికి పూనుకుంటున్నారో అది కూడా చాలామంది విద్యావంతులకు తెలుసు. విద్యావంతులలో పెరుగుతున్న ఈ విముఖత గురించి నయా ఫాసిస్టులకు కూడా తెలుసు.
తమ లోగుట్టు విద్యావంతులకు బాగా తెలుసునని నయా ఫాసిస్టులకు తెలుసు. అదే విధంగా తమ చుట్టూ అబద్ధాలతో, నయా ఫాసిస్టులు నిర్మిస్తున్న భావాల కంచెల గురించి విద్యావంతులకూ తెలుసు. అందుచేత నయా ఫాసి స్టులకు విద్యావంతులైన ప్రజానీకం అంటేనే ఒక పక్కబెదురు ఉంటుంది. మేధావులతో తలపడేటప్పుడు నయా ఫాసిస్టు నాయకులలో ఒకవిధమైన వ్యక్తిగత అభద్రత వ్యక్తమవుతుంది. ఇది భారతదేశంలో మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ వుంటుంది. ఒకవైపు అమాయకులైన జనం తమకు నీరాజనాలు ఇస్తున్నప్పటికీ, మరోపక్క వారిని ఈ అభద్రత వెన్నాడుతూ వుంటుంది. అందుకే వాళ్లు ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్’ అని, ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ అని రకరకాల పదాలను విద్యావంతుల విషయంలో ఉపయోగిస్తారు.
ఇక్కడొక అంశాన్ని పేర్కొనాలి. విద్యాసంస్థ ఎంత ప్రసిద్ధి చెందినది అయితే, ఎంతగా ఆ సంస్థ నుంచి తయారైన మేధావులు పేరు, గుర్తింపు పొందితే, అంత ఎక్కువగా ఈ నయా ఫాసిస్టుల బండారాన్ని వాళ్లు పసి కట్టగలుగుతారు. అందువల్లే హిందూత్వ శక్తులు ఇటువంటి సంస్థల పట్ల ప్రత్యేకంగా కక్ష గట్టి దాడులకు పూనుకుంటారు. అటువంటి సంస్థలు తమ ఆధిపత్యానికి ఆటంకం అని భావిస్తారు. అందువల్లే మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలుగా పేరు పొందిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, విశ్వభారతి, జామియా మిలియా ఇస్లామియా వంటివి నయా ఫాసిస్టుల దాడులకు లక్ష్యాలుగా మారాయి. ఏ సంస్థలైతే దేశానికే గర్వకారణమైన స్థాయిలో ఉన్నాయో వాటినే హిందూత్వ శక్తులు తమ దాడులకు లక్ష్యంగా చేసుకున్నాయి. హిందూత్వ శక్తుల దాడులు వీటికి మాత్రమే పరిమితం కాలేదు. పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్, సత్యజిత్‌రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ వంటి సృజనాత్మక సాంస్కృతిక సంస్థల మీద కూడా వీరి దాడి సాగుతోంది. సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్ లోకి అమాంతం చొరబడి ఆ క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులపై విచక్షణారహితంగా భౌతిక దాడులకు ఆరెస్సెస్ గూండాలు పాల్పడడం నిజంగా దిగ్భ్రమ కలిగించే విషయం!
ఈ హిందూత్వ ప్రభుత్వం ఆధునిక విద్యా సంస్థలపై దాడులకు పూనుకున్నది వాస్తవమే అయినా, మరోపక్క అది ‘సాంప్రదాయ భారతీయ విద్యా సంస్థలను’ ప్రోత్సహిస్తోందని, అందుచేత ఈ ప్రభుత్వాన్ని ‘విద్యా వ్యతిరేక’ ప్రభుత్వంగా చిత్రించడం అన్యాయమని అనుకునేవారున్నారు. అయితే, ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత పన్నెండేండ్ల కాలంలో ఆధునిక విద్యా సంస్థలు ఒకపక్క నిరంతర దాడులకు గురవుతూ వుంటే, మరోవైపు ‘సాంప్రదాయ భారతీయ విజ్ఞానాన్ని గరిపే’ ఉన్నత ప్రమాణాలుగల ఒక్క సంస్థ కూడా స్థాపించబడలేదు. ఒక విద్యా సంస్థ ఉన్నత ప్రమాణాలు సాధించడానికి ఎక్కువ కాలం పట్టదు. ఏర్పడిన దశాబ్ద కాలంలోపే జెఎన్‌యు అంతర్జాతీయ స్థాయి సాధించింది. ఒకవేళ ‘సాంప్రదాయ భారతీయ విజ్ఞానానికి’ సంబంధించిన విద్యాసంస్థను స్థాపించి వుంటే దాని ప్రతిష్ఠ ఈ పాటికే నలు దిక్కులా వ్యాపించి వుండాలి. అలా ఏదీ జరగలేదు. ఎందుకంటే అటువంటి ఏ ఒక్క సంస్థనూ ఈ హిందూత్వ ప్రభుత్వం ఇంతవరకూ స్థాపించలేదు.
ఈ హిందూత్వ ప్రభుత్వం అధికారంలో ఇంకా కొనసాగిన ప్రతీ ఒక్క రోజూ అది విద్యా వ్యవస్థను అంతం చేయడానికి ప్రయత్నిస్తూనే వుంటుంది. ‘‘ఈ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తే అది విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఎంతో కొంత ప్రయత్నిస్తుంది’’ అన్న అభిప్రాయానికి తావే లేదు. ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు కొనసాగితే విద్యా వ్యవస్థకు అంత పెద్ద ముప్పు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కూటమి నిర్వహించిన పుస్తకశాలల మీద విరుచుకుపడి విధ్వంసం సృష్టించిన గూండాలను అభినందిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించడం చూస్తే హిందూత్వ ప్రభుత్వం నుండి విద్యా వ్యవస్థకు వాటిల్లనున్న ముప్పు తీవ్రత బాగా అర్థం అవుతుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్







కామెంట్లు (0)