తెల్లగా ఉంటేనే అందమా? నల్లగా ఉంటే అందం తక్కువా? మనిషి అందాన్ని చర్మం రంగుతో ఎందుకు కొలుస్తున్నాం? కాలం మారుతున్నా మన సమాజంలో తెల్లటి చర్మం పట్ల మోజు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా యువతీ యువకుల్లో తెల్లగా కనిపించాలనే కోరిక పెరుగుతోంది. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా తమ చర్మం రంగు గురించి ఆందోళన చెందుతున్నారు. తెల్లగా మారాలనే కోరికతో రకరకాల క్రీములు, సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నారు. ఈ కోరికను ఆసరాగా చేసుకొని సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం విస్తరిస్తోంది. అందం పేరుతో అమ్ముతున్న కొన్ని ఉత్పత్తులు ఆరోగ్యానికే ముప్పుగా మారడం ఆందోళన కలిగించే విషయం. ఇటీవల ‘ది హిందూ’ పత్రికలో వచ్చిన ఒక వార్త ఈ ప్రమాదాన్ని మరోసారి గుర్తుచేసింది. కేరళలో ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉపయోగించిన ఒక టీనేజర్ మూత్రపిండాల సమస్యకు గురైనట్లు ఆ వార్త వెల్లడించింది. ఆమె ఉపయోగించిన క్రీమ్‌ను పరీక్షించగా అందులో 1.25 శాతం పాదరసం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. పాదరసం మన శరీరానికి హాని కలిగించే విషపూరితమైన లోహం. ఇది శరీరంలోకి చేరితే మూత్రపిండాలు, నాడీవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందంగా కనిపించాలనే కోరికతో వాడిన ఒక క్రీమ్ ఆరోగ్యానికే ముప్పుగా మారడం మనందరం ఆలోచించాల్సిన విషయం.
తెల్లటి చర్మమే అందమా?
మన చర్మం రంగును ప్రధానంగా మెలనిన్ అనే వర్ణద్రవ్యం నిర్ణయిస్తుంది. ఇది చర్మంలో సహజంగా తయారవుతుంది. మెలనిన్ ఎక్కువగా ఉంటే చర్మం ముదురు రంగులో, తక్కువగా ఉంటే లేత రంగులో ఉంటుంది. మన జన్యువులు కూడా చర్మం రంగును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, సూర్యరశ్మిలోని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని కొంతవరకు రక్షించడంలో మెలనిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ముదురు రంగు చర్మం ఉండటం లోపం కాదు. తెల్లటి చర్మం ఉండటం గొప్పతనం కాదు. అయినా మన సమాజంలో చర్మం రంగుకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెండ్లి సంబంధాల్లో అమ్మాయి రంగు గురించి అడగడం ఇప్పటికీ కనిపిస్తుంది. అబ్బాయిల విషయంలో కూడా తెల్లగా, అందంగా ఉండాలనే అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాలు, టెలివిజన్, ప్రకటనలు ఈ భావనను మరింత పెంచుతున్నాయి. తెల్లగా ఉంటేనే ఉద్యోగంలో, ప్రేమలో, పెళ్లిలో మంచి అవకాశాలు వస్తాయనే తప్పుడు అభిప్రాయం యువతలో ఏర్పడుతోంది. చిన్నప్పటి నుంచే తెల్లగా ఉంటే బాగుంటావనే మాటలు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ వినిపిస్తుంటాయి. దీంతో తమ సహజమైన చర్మరంగం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. ఇతరులతో పోల్చుకోవడం, తమ రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడం మొదలవుతోంది. ఇది కేవలం సౌందర్యానికి సంబంధించిన సమస్య కాదు. మన సమాజంలో పాతుకుపోయిన రంగు వివక్షకు సంబంధించిన సమస్య కూడా.
అందం పేరుతో ప్రమాదకరమైన రసాయనాలు
శరీరాన్ని తెల్లగా మారుస్తామని ప్రచారం చేసే కొన్ని నాణ్యతలేని, నకిలీ క్రీముల్లో పాదరసం వంటి ప్రమాద కరమైన పదార్థాలు ఉండవచ్చు. పాదరసం చర్మం ద్వారా శరీరంలోకి చేరగలదు. దీర్ఘకాలం ఉపయోగించినప్పుడు మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. కొందరిలో మూత్రం ద్వారా ప్రొటీన్లు ఎక్కువగా పోవడం, శరీరంలో వాపులు రావడం వంటి సమస్యలు కనిపించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతినవచ్చు. నాడీవ్యవస్థపై కూడా ప్రభావంపడే అవకాశం ఉంది. మరి కొన్ని క్రీముల్లో స్టెరాయిడ్లు, హైడ్రోక్వినోన్ వంటి పదార్థాలు ఉంటాయి. వీటిలో కొన్ని చర్మ సమస్యల చికిత్సకు వైద్యులు సూచించే మందులే. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకుండా, అవసరానికిమించి, ఎక్కువకాలం ఉపయోగిస్తే చర్మానికి హాని కలగవచ్చు. చర్మం పలుచబడటం, మొటిమలు రావడం, మంట, రంగులో మార్పులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. మార్కెట్లో దొరికే ప్రతి క్రీమ్ ప్రమాదకరమైనది కాదు. కానీ ఏ క్రీమ్‌లో ఏముందో తెలియకుండా, ప్రకటనలు చూసి కొనుగోలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా వెంటనే తెల్లగా మారుస్తామని చెప్పే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్త అవసరం.
సామాజిక మాధ్యమాల ప్రభావం
ఒకప్పుడు టెలివిజన్, పత్రికల్లో వచ్చే ప్రకటనల ద్వారా సౌందర్య ఉత్పత్తుల గురించి తెలుసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మొబైల్ ఫోన్ తెరిస్తేచాలు, రకరకాల క్రీముల ప్రకటనలు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కొందరు తమ అనుభవాలను చెబుతూ ఒక క్రీమ్ వాడితే వారం రోజుల్లోనే చర్మం రంగు మారిందని ప్రచారం చేస్తున్నారు. వాటిని చూసి చాలామంది యువతీ యువకులు ఆకర్షితులవుతున్నారు. ఉత్పత్తి తయారు చేసిన సంస్థ ఏది? అందులో ఏ పదార్థాలు ఉన్నాయి? నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే విషయాలు తెలుసుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. అందమైన ప్యాకింగ్, విదేశీ పేర్లు, ఎక్కువ ధర ఉన్నంత మాత్రాన ఆ ఉత్పత్తి సురక్షితమైనదని చెప్పలేం.యుక్తవయసులో పిల్లలు తమ రూపం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులతో పోల్చుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఫొటోలు, వీడియోల్లో చాలావరకు ఫిల్టర్లు, ఎడిటింగ్ ఉపయోగిస్తారనే విషయాన్ని గుర్తించాలి. సహజంగా లేని అందాన్ని నిజమని నమ్మి, తమ రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగించే విషయం.
బాధ్యతెవరిది?
ఈ సమస్యను కేవలం క్రీములు వాడేవారి వ్యక్తిగత సమస్యగా చూడకూడదు. తెల్లటి చర్మమే అందమనే భావనను పెంచుతున్న సమాజం కూడా బాధ్యత వహించాలి. ముందుగా తల్లిదండ్రులు తమ ఆలోచనలను మార్చుకోవాలి. పిల్లల రంగును ఇతరులతో పోల్చకూడదు. నల్లగా ఉన్నావు, ఎండలో తిరిగితే ఇంకా నల్లబడతావు వంటి మాటలతో వారిలో ఆత్మన్యూనతాభావం పెంచకూడదు. ప్రతి ఒక్కరి చర్మం రంగు సహజమైనదని, అందులో తక్కువ ఎక్కువలు లేవని చిన్నప్పటి నుంచే చెప్పాలి. పాఠశాలలు, కళాశాలల్లో కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలి. చర్మం రంగు ఎలా ఏర్పడుతుంది? చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించేటప్పు డు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను పిల్లలకు తెలియజేయాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలి. నాణ్యత లేని, నకిలీ సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలను అరికట్టాలి. ముఖ్యంగా ఆన్లైన్లో విక్రయించే ఉత్పత్తులపై నిఘా పెట్టాలి. నిషేధిత రసాయనాలు ఉన్న ఉత్పత్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను నియంత్రించాలి.
రంగు కాదు.. ఆరోగ్యం ముఖ్యం!
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. కానీ చర్మం రంగును మార్చుకోవాల్సిన అవసరం లేదు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఎండ నుంచి తగిన రక్షణ తీసుకోవడం, చర్మ సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించడం ముఖ్యం. ముఖ్యంగా ప్రకటనలు చూసి సొంతంగా మందులు కలిపిన క్రీములు వాడకూడదు. మన సమాజంలో మారాల్సింది అమ్మాయిల, అబ్బాయిల చర్మం రంగు కాదు. చర్మం రంగును బట్టి మనుషులను అంచనా వేసే మన ఆలోచనా విధానం. తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారనే భావన నుంచి బయటపడాలి. పిల్లల్లో తమ సహజమైన రూపం పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. అందం అనేది చర్మం రంగులో లేదు. ఆరోగ్యంగా ఉండటంలో, ఆత్మవిశ్వాసంతో జీవించడంలో ఉంది. మనిషి విలువను నిర్ణయించేది రంగు కాదు. వ్యక్తిత్వం, ఆలోచనలు, ప్రవర్తన. తెల్లగా మారాలనే కోరికతో ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టుకోవడం ఎందుకు? చర్మం రంగును మార్చుకోవడం కాదు, మన ఆలోచనలను మార్చుకోవడం ముఖ్యం. అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టే పరిస్థితి ఇకనైనా మారాలి.
డా. రమాదేవి, 9490300863







కామెంట్లు (0)