Magazines

యువతరం మేల్కొంటేనే.. ప్రజాస్వామ్యానికి భవితవ్యం

58 నిమిషాల క్రితం

democracy ..!!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 4 నిమిషాల చదవడం

సామ్రాజ్యవాద వ్యతిరేక, ప్రజాతంత్ర, సామ్యవాద భావాలతో, భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) 1980లో పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో నవంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగిన మొదటి మహాసభలో ఏర్పాటైంది. స్వాతంత్ర్య పోరాటం మిగిల్చిన లక్ష్యాలు, యువత సాధించాల్సిన ఆశయాల కోసం ఒక ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో డివైఎఫ్ఐ స్థాపించబడింది. నాడు స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సమానత్వం, సామాజిక న్యాయం, లౌకిక ప్రజాస్వామ్యం, దోపిడీ లేని సమాజం ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాకారం కాలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా ఆ లక్ష్యాలు నెరవేరని పరిస్థితుల్లో, వాటిని సాధించేందుకు యువతరం తన చారిత్రక బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. స్వాతంత్ర్య ఉద్యమం కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం సాగిన పోరాటం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికీ విద్య, ఉపాధి, ఆహారం, గౌరవప్రదమైన జీవితం, సమాన అవకాశాలు కల్పించే దేశ నిర్మాణం దాని అంతిమ లక్ష్యం. భగత్ సింగ్ వంటి విప్లవకారులు కలలుగన్న దోపిడీ రహిత సమాజం, ప్రజల చేతుల్లో అధికారం, శాస్త్రీయ దృక్పథం, మతసామరస్యం నేటికీ యువత ముందున్న ప్రధాన ఆశయాలు. కానీ ప్రస్తుత పాలక విధానాలు ఆ లక్ష్యాలకు భిన్నమైన దిశలో సాగుతున్నాయి. దేశ సంపద పెరుగుతున్నా దాని ఫలాలు కొద్దిమంది కార్పొరేట్లు, పెట్టుబడి దారులు, సంపన్నులకే పరిమితమవుతున్నాయి. మరోవైపు పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ఈ వైరుధ్యాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో పౌరుల బాధ్యత.

యువతకు మిగిలింది నిరాశే

2014 ఎన్నికల సందర్భంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైంది. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి నినాదాలు యువతకు ఆశలు కల్పించినా, ఆశించిన స్థాయిలో ఉద్యోగాల సృష్టి జరగలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ఉపాధి అవకాశాలను మరింత సంక్షోభంలోకి నెట్టింది. ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీపడుతున్నా ఖాళీల భర్తీకి తగిన చర్యలు కనిపించడం లేదు. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉపాధేనని చెప్పడం పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. పదమూడేండ్ల బీజేపీ పాలనలో అభివృద్ధి ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యం యువత భవిష్యత్తుకు ఇవ్వడం లేదు. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 నివేదిక దేశంలో చదువుకున్న యువత నిరుద్యోగ తీవ్రతను వెల్లడించింది. 15 నుంచి 25 ఏండ్ల మధ్య వయసున్న యువ గ్రాడ్యుయేట్లలో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, 25 నుంచి 29 ఏండ్ల మధ్య వయసు వారిలో నిరుద్యోగం 20 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో 6.3 కోట్ల మంది గ్రాడ్యుయేట్లలో సుమారు 1.1 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారన్న అంచనా ఆందోళన కలిగిస్తోంది. స్థిరమైన ఉద్యోగాలు దొరకక చాలామంది యువత తక్కువ వేతనాలతో కూడిన తాత్కాలిక పనులు, గిగ్ ఎకానమీ, డెలివరీ, క్యాబ్ సేవల వైపు వెళ్లాల్సి వస్తోంది. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఉన్నత విద్యకు అడ్డంకిగా మారుతున్నాయి. చదువు పూర్తిచేసిన తరువాత కూడా భవిష్యత్తుపై భరోసా లేని పరిస్థితి యువతలో నిరాశను పెంచుతోంది.


విద్యా హక్కును దూరం చేస్తున్న విధానాలు

విద్యారంగంలో ప్రభుత్వ బాధ్యత తగ్గిపోవడం మరో తీవ్రమైన సమస్య. 2017లో 38 శాతంగా ఉన్న విద్యార్థుల చదువుకునే శాతం 2024 చివరినాటికి 34 శాతానికి పడిపోయినట్లు వ్యాసంలో పేర్కొన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసే వారి సంఖ్య 2017లో 58 శాతం ఉండగా, 2023 నాటికి 72 శాతానికి పెరిగింది. నాణ్యమైన ప్రభుత్వ విద్య అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల భారం పేద, మధ్యతరగతి కుటుంబాలను కుంగదీస్తున్నాయి. మరోవైపు నూతన విద్యావిధానం పేరుతో విద్యారంగంలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ వంటి జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు, విద్యార్థుల ఆత్మహత్యలు వ్యవస్థలోని వైఫల్యాలను బయటపెడుతున్నాయి. విద్యను హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చే ధోరణిని అడ్డుకోవాలి. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు వివిధ రూపాల్లో నిరసన గళం వినిపిస్తున్నారు. ఆన్‌లైన్ వేదికల నుంచి వీధుల వరకు విస్తరిస్తున్న యువత ఆందోళనలు పాలకుల విధానాలపై పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఖాళీ ఉద్యోగాల భర్తీ, నాణ్యమైన విద్య కోసం జరుగుతున్న పోరాటాలు ప్రభుత్వాలను సమాధానం చెప్పే స్థితికి తీసుకు వస్తున్నాయి. యువత ప్రశ్నలను దేశద్రోహంగా చిత్రించడం, విమర్శకులకు ముద్రలు వేయడం, నిరసనకారులపై నిర్బంధాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. విద్యార్థినులు సైతం ఆంక్షలు, ముళ్ల కంచెలను లెక్కచేయకుండా తమ హక్కుల కోసం ముందుకు రావడం యువతలో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి నిదర్శనం.

ఓటు హక్కుపై దాడి.. ప్రజాస్వామ్యానికే ప్రమాదం

నేటి యువత ముందున్న మరో కీలకమైన బాధ్యత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడం. ఓటు అనేది కేవలం ప్రభుత్వాలను ఎన్నుకునే సాధనం మాత్రమే కాదు, ప్రజల రాజకీయ అధికారానికి పునాది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ, ఓటర్ల పేర్ల తొలగింపుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ప్రశ్నలు ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ప్రజల నిరసన తెలిపే హక్కును కాలరాయడం, జంతర్ మంతర్ వంటి నిరసన ప్రదేశాలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తాయి. ఓటు హక్కు నుంచి నిరసన హక్కు వరకు ప్రతి రాజ్యాంగ హక్కు కోసం యువత ఉద్యమించాలి. నిరుద్యోగం, విద్యా సంక్షోభం, ఆర్థిక అసమానతల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మతం, కులం పేరుతో విద్వేష రాజకీయాలను ప్రోత్స హించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యువతను కుల, మత విభజనల్లోకి నెట్టడం ద్వారా వారి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనలకు బదులుగా మూఢనమ్మకాలను, సామాజిక ఐక్యతకు బదులుగా మతోన్మాదాన్ని ప్రోత్సహించే ధోరణులను ప్రతిఘటించాలి. కులవివక్ష, అంటరానితనం, కులోన్మాద హత్యలకు వ్యతిరేకంగా నిలబడాలి. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయాలని, కార్పొరేట్ విద్యా, వైద్య దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేయాలి. మత్తుపదార్థాలు, గంజాయి వంటి వ్యసనాల నుంచి యువతను కాపాడుతూ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలి. డివైఎఫ్‌ఐ ఏర్పడి 47 ఏండ్లవుతున్న సందర్భంగా ప్రజాస్వామ్య రక్షణకు యువత ఈ కర్తవ్యాల అమలు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కోట రమేష్, 9618339490

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్