దేశ అభివృద్ధిని కొలవడానికి ఆకాశహర్మ్యాల ఎత్తునో, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలనో మాత్రమే ప్రామాణికంగా తీసుకోలేం. దేశానికి అన్నం పెట్టే రైతు బతుకు ఎంత భద్రంగా ఉంది? అతని శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతోందా? అప్పుల ఊబి నుంచి బయటపడి గౌరవంగా జీవించగలుగుతు న్నాడా? ఇవే నిజమైన అభివృద్ధికి గీటురాళ్లు కావాలి. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతున్నా రైతు ఆదాయం మాత్రం పెరగడం లేదు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. పంటకు గిట్టుబాటు ధర దొరకడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ అనిశ్చితి రైతు జీవితాన్ని మరింత సంక్షోభంలోకి నెడు తున్నాయి. ఇది రైతు వ్యక్తిగత సమస్య కాదు... దేశ ఆర్థిక వ్యవస్థను, ఆహార భద్రతను ప్రభావితం చేస్తున్న సామాజిక సమస్య. ఈ నేపథ్యంలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలకు నల్లగొండ వేదిక కావడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. రైతాంగ హక్కుల కోసం తొమ్మిది దశాబ్దాలుగా సాగుతున్న పోరాట వారసత్వాన్ని సమీక్షించుకోవడంతోపాటు, నేటి వ్యవసాయ సంక్షోభానికి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సందర్భమిది.
తొమ్మిది దశాబ్దాల పోరాట వారసత్వం
1936 ఏప్రిల్ 11న లక్నోలో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ దేశంలోని వివిధ ప్రాంతాల రైతాంగ పోరాటాలకు జాతీయ ఐక్య వేదికగా నిలిచింది. భూస్వామ్య దోపిడీ, అధిక కౌళ్లు, పన్నులు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాలను సంఘటితం చేసింది. భూమి, భుక్తి, విముక్తి కోసం రైతాంగం సాగించిన పోరాటాలకు దిశానిర్దేశం చేసింది. ఈ తొమ్మిది దశాబ్దాల ప్రయాణం ఒక రైతు సంఘ చరిత్ర మాత్రమే కాదు, దేశ సామాజిక, రాజకీయ పరిణామాల్లో రైతాంగం పోషించిన కీలక పాత్రకు సాక్ష్యం. నేటి వ్యవసాయ సంక్షోభం రూపం మారినా, దాని మూలాల్లో ఉత్పత్తిదారుడి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కని దోపిడీ సంబంధాలే ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను రైతు నిర్ణయించలేడు. పండించిన పంటకు ధర నిర్ణయించే శక్తి కూడా అతని చేతుల్లో లేదు. పెట్టుబడి పెట్టేది, ఉత్పత్తిలో కష్టనష్టాలు భరించేది రైతే అయినా, సరఫరా, కొనుగోలు, ధరల నిర్ణయంలో ఆధిపత్యం మాత్రం కార్పొరేట్ సంస్థలు, మధ్యవర్తుల చేతుల్లో కేంద్రీకృతమవుతోంది. సాగునీటి కొరత, నేల సారం తగ్గడం, వాతావరణ మార్పుల ప్రభావం ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
కార్పొరేట్ ఆధిపత్యం - ప్రభుత్వ బాధ్యత
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు, బాధ్యత తగ్గుతున్న కొద్దీ ప్రైవేటు పెట్టుబడి ఆధిపత్యం పెరుగుతోంది. చిన్న, సన్నకారు రైతులు బలహీనులుగా మిగిలిపోతుంటే, భారీ సంస్థలు తమ ఆర్థిక బలంతో మార్కెట్‌ను శాసిస్తున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, సమగ్ర ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ లేకపోవడం ఈ అసమానతను మరింత పెంచుతోంది. 2020-21లో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగించిన చారిత్రాత్మక ఉద్యమం కార్పొరేట్ అనుకూల విధానాల ప్రమాదాన్ని దేశం ముందుంచింది. ఆ పోరాటం చట్టాల ఉపసంహరణతో ముగిసినా, రైతుల ఆదాయ భద్రత, రుణ విముక్తి, పంటల బీమా, పెట్టుబడి ఖర్చుల నియంత్రణ వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో వ్యవసాయ దిగుమతులు పెరిగితే దేశీయ రైతు మరింత తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహార ఉత్పత్తి, నిల్వ, పంపిణీపై కార్పొరేట్ ఆధిపత్యం పెరగడం దేశ ఆహార సార్వభౌమత్వానికే ముప్ప్పు. వ్యవసాయం కేవలం లాభనష్టాల వ్యాపారం కాదు. అది కోట్లాది ప్రజల జీవనాధారం, దేశ ఆహార భద్రతకు పునాది. అందువల్ల వ్యవసాయ రంగంలో ప్రభుత్వ బాధ్యతను తగ్గించడం కాదు, మరింత బలోపేతం చేయాలి.
రైతు అంటే భూమి యజమాని మాత్రమే కాదు
వ్యవసాయ సంక్షోభాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే రైతు అనే భావనను విస్తృతంగా చూడాలి. భూమి ఉన్న రైతుతో పాటు కౌలు రైతు, వ్యవసాయ కార్మికుడు, మహిళా రైతు, ఆదివాసీ సాగుదారుడు కూడా వ్యవసాయ వ్యవస్థలో అంతర్భాగమే. భూమి పట్టా లేని కౌలు రైతుకు పంట రుణం, బీమా, నష్టపరిహారం అందడం లేదు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు, హక్కులు దక్కడం లేదు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి భద్రత, కనీస వేతనాలు, సామాజిక రక్షణ కొరవడుతున్నాయి. వీరి సమస్యలను విడివిడిగా చూడటం వల్ల వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం సాధ్యం కాదు. భూమిని సాగు చేసేవారికి హక్కులు, శ్రమ చేసేవారికి గౌరవం, ఉత్పత్తి చేసేవారికి ఆదాయ భద్రత కల్పించే విధానమే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టగలదు. రైతాంగ ఉద్యమం ఈ వర్గాలన్నింటినీ ఐక్యపరిచినప్ప్పుడే దాని సామాజిక బలం పెరుగుతుంది.
ప్రజానుకూల వ్యవసాయ విధానమే ప్రత్యామ్నాయం
వ్యవసాయాన్ని కార్పొరేట్ లాభాల దృష్టితో కాకుండా ప్రజల ఆహార అవసరాలు, రైతుల జీవన భద్రత ప్రాతిపదికగా చూడాలి. సాగునీరు, పరిశోధన, విస్తరణ సేవలు, నాణ్యమైన విత్తనాలు, నిల్వ సదుపాయాలు, రవాణా, మార్కెటింగ్ వ్యవస్థలపై ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. నకిలీ విత్తనాలు, కల్తీ పురుగుమందుల నుంచి రైతులను రక్షించాలి. చౌకగా సంస్థాగత రుణాలు అందించడంతోపాటు అప్ప్పుల నుంచి ఉపశమనం కల్పించాలి. పంటల బీమా, ప్రకఅతి వైపరీత్యాల నష్టపరిహారం సకాలంలో అందాలి. సమగ్ర పెట్టుబడి వ్యయానికి తగిన మద్దతు ధరను ప్రకటించి, దానికి చట్టబద్ధమైన హామీ కల్పించాలి. ఆ ధరకు ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను విస్తరించాలి. వరి, గోధుమలకే పరిమితం కాకుండా పప్పు ధాన్యాలు, నూనెగింజలు తదితర పంటలకూ కొనుగోలు భరోసా కల్పించాలి. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ నేల ఆరోగ్యం, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయాన్ని లాభదాయకంగా, పర్యావరణహితంగా మార్చే దీర్ఘకాలిక విధానం అవసరం.
నల్లగొండ చరిత్ర నుంచి నేటి పోరాటాలకు స్ఫూర్తి
ఈ మహాసభలకు నల్లగొండ వేదిక కావడం మరో చారిత్రక సందర్భం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమై ఎనభైయేండ్లు పూర్తవుతున్న వేళ ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన ఆ పోరాటం భారత రైతాంగ చరిత్రలో చెరగని అధ్యాయం. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పేద రైతులు, కూలీలు, మహిళలు సంఘటితమై సాగించిన పోరాటం సామాజిక మార్పుకు, ఈ దేశంలో భూసంస్కరణలకూ మార్గం చూపింది. కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజల సమిష్టి శక్తి ఎంతటి చారిత్రక పరిణామాలకు దారితీయగలదో నిరూపించింది. నాటి పోరాట పరిస్థితులు, నేటి వ్యవసాయ సంక్షోభం ఒకేలా ఉండకపోవచ్చు. దోపిడీ రూపాలు మారాయి. భూస్వామ్య ఆధిపత్యం స్థానంలో మార్కెట్ శక్తులు, కార్పొరేట్ సంస్థల పెత్తనం బలపడుతోంది. అయినా శ్రమను దోచుకోవడం, ఉత్పత్తిదారుడికి తగిన ప్రతిఫలం దక్కకుండా చేయడం కొనసాగుతూనే ఉంది. అందువల్ల నల్లగొండ చరిత్రను గత వైభవంగా స్మరించుకోవడమే కాకుండా, ఆ పోరాట స్ఫూర్తిని నేటి సమస్యల పరిష్కారానికి అన్వయించుకోవాలి.
రైతాంగ ఉద్యమం వ్యవసాయ సమస్యలపై జరిగే పోరాటానికే పరిమితం కాకూడదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, చేతివృత్తులవారు, చిన్న వ్యాపారులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలతో అనుసంధానం కావాలి. వ్యవసాయ సంక్షోభం గ్రామీణ కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది. దాని ప్రభావం పరిశ్రమలు, వ్యాపారాలు, ఉపాధి రంగాలపైనా పడుతుంది. కాబట్టి రైతాంగ సమస్యలు సమాజంలోని విస్తృత ప్రజానీకం సమస్యలేనన్న అవగాహనను బలంగా తీసుకెళ్లాలి. రైతు సంఘాలు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య నిరంతరం పనిచేస్తూ వారి దైనందిన సమస్యలపై పోరాడాలి. వివిధ శ్రామికవర్గాల ఉద్యమాలతో ఐక్యతను బలోపేతం చేయాలి. ఢిల్లీలో సాగిన రైతాంగ ఉద్యమం ఐక్య పోరాటాల శక్తిని చాటిచెప్పింది. ఆ అనుభవాన్ని స్థానిక సమస్యల పరిష్కారానికి, దేశవ్యాప్త ఉద్యమ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి.
భవిష్యత్తుకు బాటలు వేయాలి
అఖిలభారత కిసాన్ సభ పోరాట చరిత్రలో తొంభై సంవత్సరాలు ఆ సంస్థ వయసును మాత్రమే సూచించవు. తరతరాల రైతుల అనుభవాలను, త్యాగాలను, పోరాటాల ద్వారా సాధించిన హక్కులను, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలను గుర్తుచేస్తాయి. కాలం మారినప్పుడల్లా పోరాట రూపాలు మారాలి. సమస్యల విశ్లేషణ మరింత శాస్త్రీయంగా మారాలి. ప్రజలతో సంబంధాలు మరింత విస్తరించాలి. మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్యమ కార్యాచరణ రూపొందిం చాలి. అదే సమయంలో రైతాంగ ఉద్యమం తన ప్రాథమిక లక్ష్యాన్ని విస్మరించకూడదు. వ్యవసాయాన్ని కార్పొరేట్ లాభాల వేటకు అప్పగించకుండా, రైతుల జీవన భద్రతకు ప్రాధాన్యతనిచ్చే విధానాల కోసం పోరాడాలి. ఉత్పత్తి సాధనాలపై రైతుల హక్కులను, శ్రమకు తగిన ప్రతిఫలాన్ని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను కాపాడాలి. వ్యవసాయాన్ని ప్రజల అవసరాలకు, దేశ ఆహార భద్రతకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న ప్రత్యామ్నాయ దృక్పథాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలి.
తొమ్మిది దశాబ్దాల పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న అఖిల భారత కిసాన్ సభ నల్లగొండ మహాసభల్లో ఈ దిశగా కొత్త ఉత్సాహాన్ని, స్పష్టమైన కార్యాచరణను అందించాలి. తొంభైయేండ్ల పోరాట వారసత్వం కొత్త తరాలకు అందాలి. రైతు సంఘాల నిర్మాణం మరింత విస్తరించాలి. దేశవ్యాప్తంగా రైతాంగ ఐక్యత బలపడాలి. రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రమజీవుల ఉమ్మడి పోరాటాలకు నూతన ఉత్తేజం కలగాలి. రైతు బతుకు బాగుంటేనే గ్రామీణ భారతం బాగుంటుంది. గ్రామీణ భారతం బలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన పునాది ఉంటుంది. రైతు శ్రమకు గౌరవం, పంటకు గిట్టుబాటు, సాగుకు భరోసా, గ్రామీణ ప్రజలకు సామాజిక భద్రత కల్పించే వ్యవస్థ నిర్మాణమే నేటి రైతాంగ ఉద్యమం ముందున్న చారిత్రక కర్తవ్యం.
రమేష్ రాంపల్లి







కామెంట్లు (0)