Magazines

రాజ్యాంగ రక్షణే...ప్రజాస్వామ్య పరిరక్షణ

25 నిమిషాల క్రితం

democracy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

భారత రాజ్యాంగం ఏర్పడి రేపటికి 77 సంవత్సరాలు. 1949 నవంబర్ 26న బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన రోజు. ప్రజలందరికీ శిరోధార్యమైన ఈ లిఖిత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ రూపొందించింది. అంబేద్కర్ అధ్యక్షుడిగా ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడింది. ఇద్దరు సభ్యులు రచనా కాలంలోనే మరణించగా, ఒకరు విదేశాలకు వెళ్లారు, మరొకరు అనారోగ్యంతో ఉండటంతో రాజ్యాంగ రచన బాధ్యత ప్రధానంగా అంబేద్కర్ భుజస్కంధాలపై పడింది. ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల నిరంతర కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఈస్టిండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి 1947 ఆగస్టు 15 వరకు సాగిన అనేక ప్రజాస్వామిక పోరాటాలు బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి స్ఫూర్తినిచ్చాయి. కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆలిండియా కిసాన్ సభ వంటి విద్యార్థి, కార్మిక, కర్షక సంఘాలు 1930వ దశకంలోనే ఏర్పడ్డాయి.

కేరళలో పున్నప్ర వాయలార్, మహారాష్ట్రలో వర్లి ఆదివాసుల తిరుగుబాటు, బొంబాయిలో నూలు మిల్లు కార్మికుల పోరాటం, బెంగాల్లో తెభాగా రైతుల ఉద్యమం, వీటన్నింటికీ తలమానికంగా 1946 నుంచి 1951 వరకు సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో కీలక మార్పులు తెచ్చాయి. అనేకమంది వీరుల త్యాగాలు, లాఠీ దెబ్బలు, తూటాలు, చెరసాలలు, కేసులు ఈ పోరాట చరిత్రలో భాగమయ్యాయి. స్వాతంత్ర్యానంతరం దేశ భవిష్యత్తు, పాలనా విధానం ఎలా ఉండాలనే ఆలోచనతో రాజ్యాంగ రచన చేపట్టబడింది. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ మేధస్సు, దూరదృష్టి కీలక పాత్ర పోషించాయి. ఆయన రూపొందించిన రాజ్యాంగంలోని మూడో, నాలుగో భాగాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. మూడో భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను, నాలుగో భాగంలో ప్రభుత్వాలు సాధించాల్సిన లక్ష్యాలను వివరించారు. ఈ రెండు భాగాలు రాజ్యాంగానికి గుండెకాయలాంటివి.


ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో ప్రధానమైనవి. ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం వంటిది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా రూపొందించడంతోపాటు ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కల్పించాలన్న రాజ్యాంగ ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 19 వరకు సమానత్వం, వివక్ష నిషేధం వంటి హక్కులను పేర్కొంటున్నాయి. అంటరానితనం పాటించడం నేరమని, చట్టం ముందు అందరూ సమానమని రాజ్యాంగం స్పష్టం చేసింది. అయినప్పటికీ 77 ఏళ్ల రాజ్యాంగ అమలులో నేటికీ కుల వివక్ష కొనసాగుతోంది. దళితులు అనేక రూపాల్లో వివక్షకు గురవుతున్నారు. గుడిలోకి రానివ్వకపోవడం, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, బతుకమ్మ ఆడనివ్వకపోవడం, బోనాల పండుగల్లో వివక్ష, దళితులు వండిన మధ్యాహ్న భోజనం తినకపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిని ప్రశ్నించిన విద్యార్థులు, యువకులు దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు గురవుతున్నారు.

ఉద్యోగాల్లోనూ ఎస్సీల పట్ల వివక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో 2014 నుంచి 2026 వరకు 154 కుల దురహంకార హత్యలు జరిగాయి. మంథని మధుకర్, అంబోజి నరేష్, పెరుమాండ్ల ప్రణయ్ హత్యలు రాష్ట్రాన్ని కదిలించాయి. రాజ్యాంగం మతంతో సంబంధం లేని లౌకిక రాజ్యాన్ని వాగ్దానం చేసింది. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతపరమైన చిచ్చులు పెట్టి రాజ్యాధికారంలోకి వచ్చింది. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావడం మతోన్మాద హింసను రెచ్చగొట్టడమే. ఆరెస్సెస్ ఆధిపత్యంలో సాగుతున్న పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలు, భగవద్గీతను పవిత్ర గ్రంథంగా ప్రకటించాలనే ప్రయత్నాలు, మూడు రంగుల జెండా స్థానంలో కాషాయ జెండాను ఎగురవేయాలనే ఆలోచనలు దేశ సమైక్యతకు, సమానత్వానికి నష్టం కలిగిస్తున్నాయి. దేశభక్తిని మతభక్తిగా మార్చడం, దళితులు, ముస్లింలపై దాడులు, ప్రశ్నించే వారిపై దేశద్రోహ కేసులు, ప్రజాస్వామ్య హక్కుల హరణం, మతోన్మాదాన్ని ప్రేరేపించడం జరుగుతోంది. వాస్తవ చరిత్రను వక్రీకరించి, లేని చరిత్రను ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు సాగుతున్నాయి.


విద్య, వైద్యం వంటి మౌలిక అంశాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని రాజ్యాంగం ఆశించినప్పటికీ నేడు అవి ప్రైవేటు రంగంలో సరుకులుగా మారాయి. కొనగలిగిన వారికే విద్య, వైద్యం అందుతున్నాయి. సగటు మనిషి తన జీవితంలో డెబ్భయి శాతం ఖర్చును వీటికే వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజ్యాంగ ముసాయిదా రచన సమయంలో అంబేద్కర్ మాట్లాడుతూ, తాను రాసిన రాజ్యాంగం ద్వారా రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే సాధ్యమవుతుందని, సామాజిక, ఆర్థిక స్వేచ్ఛను అమలు చేసే పాలకులు సాధించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే పాలకులు చెడ్డవారైతే చెడు ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే సూత్రం రాజకీయ సమానత్వాన్ని కల్పిస్తుంది. సామాజిక, ఆర్థిక సమానత్వం కూడా ప్రజలందరికీ అందినప్పుడే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకుండా కాపాడాలి. ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను ప్రతిఘటించాలి. కుల, మత ద్వేషాలకు తావివ్వకుండా భారతీయులందరూ ఒకే తల్లి పిల్లలుగా ఐక్యంగా ఉండాలి. అప్పుడే రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని కాపాడుకోగలం.


టి.స్కైలాబ్ బాబు, 9177549646

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్