Magazines

ఏది నైతికత!

4 రోజుల క్రితం

morality
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 3 నిమిషాల చదవడం

ఒక పుస్తకం, ఒక సందర్భం, ఒక ఆవిష్కరణ, మరో చర్చ, మన సాంస్కృతిక జీవనం. ఇవి ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతున్న విషయాలు. ఒక రకంగా చూస్తే ఈ చర్చ రావడం, ఎవరు ఎలాంటి అభిప్రాయాలు, సంస్కారాలు కలిగి ఉన్నారో తేటతెల్లపరిచేందుకు దోహదం చేస్తాయి. అది ఇప్పుడు స్పష్టంగానే జరుగుతోంది. ఈ మధ్య సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని తీసుకొచ్చారు. సోనియా గాంధీ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆమె మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ భార్యగా, ఇందిరాగాంధీ కోడలుగా, రెండుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలిగా అందరికీ తెలుసు. ఆ పుస్తకాన్ని తెచ్చేముందే కొంత చర్చ జరిగింది. చివరికి పెంగ్విన్ వాళ్లు తప్పుకుని, హార్పర్ కాలిన్స్ వాళ్లు ప్రచురించారు. నిజంగానే సోనియా గాంధీ తన జ్ఞాపకాలను రాశారు అంటే ఎవరైనా ఆసక్తిగానే చదువుతారు. అనుకున్నట్లుగానే విడుదలైన కొన్ని రోజుల్లోనే లక్ష కాపీలు అమ్ముడు పోయాయని చెబుతున్నారు. ​

ఇప్పుడు ఆ పుస్తకంలో ఏముందో చెప్పడం కాదు గానీ, పుస్తకాన్ని విడుదల చేస్తూ ఢిల్లీలో ఒక సభ పెట్టారు. అందులో ప్రియాంక, రాహుల్ గాంధీలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఆ సందర్భంగా మాట్లాడుతూ చెప్పిన విషయాలపై పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. ఆ పుస్తకంలో రాజకీయ అంశాలకంటే ఆమెకూ కుటుంబానికీ, దానితో సంబంధమున్న సంఘటనలు, పర్యవసానాల మీద ఎక్కువ కథనం ఉంది. ఆ సభలో రాహుల్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతల గురించి చెబుతూ ‘మా నాన్న భోజనం చేసే సమయంలో అమ్మను తన ఒడిలో కూర్చోబెట్టుకోవటం, ఒడిలో కూర్చుని అమ్మ తినటం చూశాము. ఇతర ఇండ్లలో ఇలా కనపడలేదని చెబుతూ వారి అన్యోన్యాన్ని వివరించాడు. అదీ చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుని, కుటుంబ సంబంధాలను వివరించాడు. అంతే! ఇక భారతీయ సంస్కృతి, నైతిక విలువలు అంటూ బీజేపీ, ఆరెస్సెస్‌ శ్రేణులు విమర్శల వెల్లువ మొదలైంది.

అందులో ఏమి అశ్లీలత చూశారు వీ‌ళ్లు! భారతీయ సంస్కృతికి ఏమి అపచారం కలిగిందో అర్థం కాదు. ప్రేమ కంటే ద్వేషాన్ని, విభేదాన్ని నింపే గణానికి ఇవేవీ నచ్చని అంశాలు. భారతీయ సంస్కృతిలో భార్యాభర్తలు ప్రేమగా ఉండడం, ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతలు పంచడం నిషేధనీతా! దీనికి సమాధానంగా రాహుల్ గాంధీ పార్వతీపరమేశ్వరుల శిల్పాన్ని పోస్టుచేశారు. నిజమే కదా! శివుడి ఒడిలో పార్వతి కూర్చున్న ప్రతిమ ప్రసిద్ధమైనది. తరతరాలుగా మనం చూస్తున్నదే. శిల్పాల్లో, బొమ్మల్లో, మాటల్లో తప్ప నేడు వాస్తవంగా భార్యాభర్తలను సమానంగా చూడటమూ, ప్రేమతో చూడటమూ ఈ మనువాదులకు గిట్టని అంశమే. భార్యలను వదిలేసి, తల్లులను పట్టించుకోని నీతివంతుల గురించి ఎవరూ ఒక్కమాట అనరు. బహుశ రాముని కథ నుండీ అదే ఆదర్శమనుకుంటా. ఇంకా ఘోరమైన విషయమేమంటే, రేప్ చేసి, హత్యలు చేసి, జైలుకెళ్లివచ్చిన నేరస్తులకు సత్కారాలు, అభినందనలు చెప్పే ఈ సంస్కారవంతులు ఇంతకన్నా ఏం విమర్శలు చేస్తారు!

బిల్కిస్ బానో ఉదంతంలో తన కండ్ల ఎదుటే బిడ్డను చంపి, ఏడుగురు కుటుంబ సభ్యులను హత్యచేసి, గర్భిణిపై లైంగికదాడికి పాల్పడిన దుర్మార్గులకు శిక్ష పడితే, వారిని విడుదల చేయించి, సన్మానం చేసిన సన్నాసులు సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు. ఎప్‌‌స్టీన్ ఫైళ్లలో తమ నాయకుల పేర్లు ఉన్నాయని తెలిసినా, వీళ్లు సగర్వంగానే తిరుగుతుంటారు. పెళ్లిండ్ల మీద పెళ్లిండ్లు చేసుకుని, విడాకులు తీసుకోవటం సనాతన ధర్మక్రియలో భాగమనీ నమ్ముతారు. పెళ్లిండ్లు, ఇష్టాయిష్టాలు, వ్యక్తిగతాలు సరే, మతం కూడా వ్యక్తిగత విశ్వాసము కాదా! ఎందుకు రాజకీయాల్లోకి, పాలనలోకి తెస్తున్నారు. మన సంస్కృతిగా చెప్పబడుతున్నదంతా ఆధిపత్య సంస్కృతే, అందులో వివక్షతలు, అధికారం, పీడన మొదలైనవన్నీ ఉంటాయి. పురుషాధిక్యతా కనపడుతుంది. ప్రేమను ప్రకటించడమూ, ప్రశంస, అభినందనలు తెలపడం, క్షమాపణలు కోరడం ఇలాంటివేవీ లేకపోవడం విచారకరం.

మన సమాజంలో కులాలు, మతాలు, వాటి తాలూకు ఆచార వ్యవహారాలు అవే సంస్కృతిగా సంప్రదాయంగా చలామణి అవుతున్నాయి. కానీ ఆధునిక, ప్రజాస్వామిక యుగంలో సమాజాలలో అనేక ఉన్నత విలువలు, సంస్కారాలు ముందుకు వచ్చాయి. పరస్పర గౌరవాలతో, ప్రేమానుబంధాలతో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు కొనసాగించడం అవసరం. మతాల ఆధారంగా, కులాల ఆధారంగా ద్వేషాలను రగిలించడం, మనుషులను చంపడం, అవమానించడం ఏ సాంస్కృతిక విలువా కాదు. నైతికత గురించి మాట్లాడే వాళ్ల నైతికతలను ప్రశ్నించడం మొదలుపెడితే, పెద్ద గ్రంథమే అవుతుంది. మానవీయంగా ఎదగడమే మంచి సంస్కృతి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్