పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట, మధ్యప్రదేశ్‌లో జన సమూహంపైకి ట్రక్కు దూసుకెళ్లిన వైనం, హైదరాబాద్‌లోని దాండియాలో సంభవించిన ఘోర ప్రమాదంలో విద్యార్థిని బలికావడం వంటి ఘటనలు కేవలం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన యాదృచ్ఛిక దుర్ఘటనలు కావు. ఇవన్నీ దేశంలో ప్రజాభద్రతా వ్యవస్థలు ఎంతలా కుప్పకూలిపోయాయో చాటిచెప్పే ఉదాహరణలు. వేడుకలు, పండుగలు, సాధారణ ప్రజా సమూహాలు జరిగే చోట కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలో అధికార యంత్రాంగం, నిర్వాహకులు చూపుతున్న అమితమైన అలసత్వానికి ఇది స్పష్టమైన రుజువులు. ఈ వరుస దుర్ఘటనల వెనుక వ్యవస్థీకృత నిర్లక్ష్యం, నిఘా వైఫల్యమే కాదు... లాభాపేక్ష తప్ప ప్రజల ప్రాణాల పట్ల స్పందన లేని ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే వాటిని "యాదృచ్ఛిక ప్రమా దాలు" అని తోసిపుచ్చి పాలకులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ ప్రమాదాలు మన దేశంలో కొరవడిన వ్యవస్థాగత నిర్వహణను, అధికార యంత్రాంగ నిర్లక్ష్యాన్ని మరొకసారి సమాజం ముందు నగ్నంగా నిలబెట్టాయి.
బెంగాల్ తొక్కిసలాట సంఘటనను పరిశీలిస్తే, సరైన వెలుతురు కూడా లేని ఇరుకైన ప్రదేశం, దానికి తోడు కుండపోత వర్షం... తలదాచుకు నేందుకు, దైవదర్శనం కోసం భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. క్షణాల వ్యవధిలోనే పందొమ్మిది విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.
ప్రజా ఈవెంట్లను వ్యాపారాత్మక దృక్పథంతో నిర్వహిస్తున్నప్పుడు పరిమితికి మించి పాస్‌లు, టిక్కెట్లు విక్రయించడం, అందుకు తగ్గ పోలీస్ భద్రత, అంబులెన్స్ సదుపాయాలు కల్పించకపోవడం యథేచ్ఛగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో భద్రతా తనిఖీలు లేకుండా కేవలం కాగితాలపైనే అనుమతులివ్వడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఓ ప్రయివేట్ కళాశాల దాండియా వేడుకలో విద్యుత్, వేదిక భద్రతా ఆడిటింగ్ సరిగా లేకపోవడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో విద్యార్థిని బలికావాల్సి వచ్చింది.
మరోవైపు మధ్యప్రదేశ్‌లో విచక్షణారహితంగా జనం మీదికి ట్రక్కు దూసుకెళ్లడం అనేది రవాణా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను, రహదారి భద్రతపై అధికారుల అలసత్వాన్ని బహిర్గతం చేస్తోంది. పరిమితికి మించిన వేగం, తాగి వాహనాలు నడపడం, సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం ఇటువంటి ఘోరాలకు దారితీస్తోంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వాల ఉదాసీనత వల్ల దేశంలో ఏదో ఒక మూల నిత్యం రోడ్లు రక్తసిక్తం అవుతూనే ఉన్నాయి. ఈ రకమైన నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నప్పుడు దర్యాప్తుల పేరుతో కాలయాపన చేయడం, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది.
అయితే, ఇలాంటి మానవ నిర్మిత విపత్తులు దేశంలో కొత్తవేమీ కావు. గతంలో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో నవరాత్రుల వేళ సంభవించిన తొక్కిసలాటలో రెండు వందల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ మాతా ఆలయం వద్ద వంతెన కూలిపోతోందన్న చిన్న వదంతుతో భయభ్రాంతులైన భక్తులు తీసిన పరుగులో వందలాది ప్రాణాలు వారి పాదాల కింద నలిగిపోయాయి. ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరిగినప్పుడు విచారణ కమిటీలను వేయడం, ప్రకటనలు గుప్పించడం తరవాత విస్మరించడం పాలకులకు అలవాటుగా మారింది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలోనూ, సరైన రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం విఫలమవుతుండటం వల్లే ఇలాంటి దుర్ఘటనలు పరిపాటిగా మారుతున్నాయి.
ఈ వరుస ప్రమాదాల వెనుక ప్రజాక్షేమం కంటే లాభాలకు, ప్రచారానికే ప్రాధాన్యమిచ్చే పెట్టుబడిదారీ ధోరణి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి, ప్రయివేట్ నిర్వాహకులకు విచ్చలవిడిగా రాయితీలు ఇస్తూ నియంత్రణ చర్యలను నీరుగారు స్తున్నాయి. విఐపి సంస్కృతికి రాచబాటలు పరిచే ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం, గంటల తరబడి ఎండలో, ఇరుకు సందుల్లో నలిగిపోయే సామాన్యుల ఉసురు తీస్తున్నది. అదొక నేరపూరిత ఉదాసీనత.
అధికారంలో ఎవరు ఉన్నా, పెట్టుబడిదారీ ప్రచార మోజులో నలిగిపోయేది ఎప్పుడూ పేదవాడి ప్రాణాలే అనడానికి ఈ వరుస ఘటనలే సజీవ నిదర్శనం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి, అన్ని రంగాల్లోనూ కఠినమైన భద్రతా చట్టాలను అమలు చేయాలి. సామాన్యుల ప్రాణాలకు నిజమైన భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి.
మనిషి ప్రాణం పోయాక ఇచ్చే నష్టపరిహారాలు ఆయా కుటుంబాలకు ఏర్పడిన లోటును ఏమాత్రం పూడ్చలేవు; అవన్నీ ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పుకోవడానికి వాడుకునే కాగితపు ముసుగు మాత్రమే. ఇప్పడు కావలసింది కంటితుడుపు చర్యలు కావు, ప్రజా భద్రతను ప్రాథమిక హక్కుగా గుర్తించే పాలనా వ్యవస్థ. భద్రతను గాలికి వదిలేసిన నిర్వాహకులను చట్టం ముందు నిలబెట్టినప్పుడే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. పండుగల సీజన్లో ఆలయాలు, మార్కెట్లలో పెరిగే రద్దీని యంత్రాంగం ముందస్తుగానే అంచనా వేయాలి. అత్యవసర మార్గాలు, తగినంత వెలుతురు, డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు భక్తుల భద్రతను దేవుడి దయకే వదిలేయకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తేనే ఇలాంటి విషాదాలను అరికట్టగలం.
వ్యవస్థీకృత నిర్లక్ష్యం
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్లు (0)