Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమరశీల పోరాటాల ద్వారానే రైతులకు న్యాయం

సమరశీల పోరాటాల ద్వారానే రైతులకు న్యాయం

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ఉపాధ్యక్షులు పోతినేని, జూలకంటి
23, 24, 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు సంఘం రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ-పాల్వంచ

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దఎత్తున రైతులను కదిలించి, బలమైన సమరశీల పోరాటాలు చేయడం ద్వారానే న్యాయం జరుగుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, జూలకంటి రంగారెడ్డి అన్నారు. సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభ పాల్వంచలో శుక్రవారం జరిగింది. మహాసభలో పాల్గొన్న అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభ ఈనెల 23 నుంచి 25 వరకు కొత్తగూడెంలో జరగనుందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలపై మహాసభలో చర్చ జరుగు తుందని చెప్పారు. వ్యవసాయ రంగానికి, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఎంతవరకు అమలు చేసింది.. తదితర విషయాల పై చర్చిస్తామని చెప్పారు. మహాసభలో 600 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. గత మహాసభ నుంచి సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని చెప్పారు. వీటన్నింటిపై చర్చించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

కౌలు రైతులు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని, కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తీసుకు రావడం కోసం పోరాటం చేశామని చెప్పారు. పోడు రైతులందరూ పేదలు అని, రాళ్లు, రప్పలను తొలగించి ఎంతో కష్టపడి భూములను చదును చేసుకుని సాగు చేసుకుంటున్నారని చెప్పారు. వారికి హక్కుపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పత్తి, మిర్చి, పామాయిల్‌ రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.

పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్కువ డబ్బులతో తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనం కలిగే ప్రాజెక్టులు అనేకం ఉన్నాయని చెప్పారు. వాటిని పక్కనపెట్టి కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు తెరపైకి తేవడం సరికాదన్నారు. కల్తీ లేని విత్తనాలు సరఫరా చేయాలని, సకాలంలో ఎరువులు అందించాలని గ్రామ, రాష్ట్ర స్థాయి వరకూ అనేక ఉద్యమాలు చేశామన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మరిన్ని కష్టాలకు గురి చేసే విధానాలు అమలు చేస్తున్నాయని చెప్పారు.

రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం, పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడం, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు దెబ్బతిన్నా నష్టపరిహారం ఏమాత్రం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. బడా కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ వారికే లాభాలు, రాయితీలు ఇస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో రైతులను కదిలించి బలమైన సమరశీల పోరాటాలు నడిపించాలని, తద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
రైతు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా ఒక సెమినార్‌ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో అమలు చేయబోయే పంటల ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై చర్చ నిర్వహిస్తామని, మేధావులు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు శివరాం ప్రసాద్‌, ఎలమంచిలి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -