రక్ష (?)-బంధనం

దేశంలో మళ్ళీ రాఖీ పండుగ జరుపుకోబోతున్నారు. అత్యధికులు ఈ రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ళ బంధానికి, లేదా అక్క తమ్ముళ్ళ బంధానికి ఒక ప్రతీకగా పరిగణిస్తున్నారు. అందులో అభ్యంతరం పెట్టవలసినదేమీ లేదు. అయితే ”భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సోదరీసోదరులు….” అంటూ సాగే మన స్కూలు విద్యార్ధుల ప్రతిజ్ఞ (ఇది ప్రతి రోజూ స్కూళ్ళలో జరుపుతారు) కులాలకు, మతాలకు అతీతంగా ఉన్న ప్రతిజ్ఞ. అయితే చాలా అరుదుగా మాత్రమే భిన్న మతాలకు చెందిన వారితో కలిసి రాఖీ పండుగ జరుపుతారు. ఇటీవల మణిపూర్‌లో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటనలు, ఇంకా కొనసాగుతున్న దాడులు ఒక ప్రత్యేకతను కలిగివున్నాయి. ఈ దాడులను మణిపూర్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం జమిలిగా దగ్గరుండి ప్రోత్సహించిన దాడులు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర రిజర్వు ఆర్మీ దగ్గరుండి దాడులను పర్యవేక్షించాయి. కాని సుప్రీం కోర్టు గట్టిగా మందలించిన తర్వాత మాత్రమే మోడీ నామమాత్రంగా తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఐతే, ఇప్పటికీ మణిపూర్‌ వెళ్ళడానికి ఆయనగారికి తీరుబాటు దొరకలేదు. పార్లమెంట్‌లో ఆ దుర్ఘటనలను ప్రస్తావించడానికి ఆయనకు నోరు రాలేదు.
ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా ఇంకా బీజేపీ శ్రేణులు, ఆరెస్సెస్‌ గణాలు, బజరంగ్‌దళ్‌ బంధాలు, గోరక్షకులు, ఇంకా ఇంకా చాలా దళాలు రాఖీ పండుగను మాత్రం పెద్ద ఎత్తున జరుపుకోవడం ఖాయం. ముస్లిం పురుషుల ”దుర్మార్గాల” నుంచి హిందూ స్త్రీలను కాపాడుకోవడం కోసమే ఈ పండుగ వచ్చిందని ఒక ప్రచారం కూడా చేస్తూంటారు. 2002లో గుజరాత్‌లో 3000 మంది ముస్లింలు నరమేథానికి బలైపోయిన సంగతి అందరికీ తెలుసు. అలా బలైనవారిలో అత్యధికులు మహిళలే. వారిని బలి తీసుకున్నది, అత్యాచారాలకు పాల్పడినది ఎవరు? హిందూత్వ దుండగులు కాదా? హిందూ మహిళలకు అవసరమైన రక్షణ తక్కిన మతాల మహిళలకు అక్కరలేదా? గత దశాబ్ద కాలంలో, ముఖ్యంగా మోడీ, యోగిల డబుల్‌ ఇంజన్‌ సర్కారు హయాంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలపై సాగిం చిన అత్యాచారాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అత్యాచారాలకు బలైనవారిలో అత్యధికులు హిందూ మహిళలే (ముఖ్యంగా దళత, బి.సి., గిరిజన తరగతులకు చెందినవారు). మరి ఈ మహిళలందరూ గతంలో తమ సోదరులకు రాఖీలు కట్టివుంటారు. అయినా వారికి రక్షణ ఎందుకు కరువైంది?
వెనకటికి ఒక అమాయకురాలైన మహిళ (పెద్ద కులానికి చెందిన మహిళ) తన ఇంటి పెరట్లో కొబ్బరి చెట్టుకు కాసిన బొండాలను ఎవరో దొంగలు ఎత్తుకుపోతున్నారని గమనించింది. తాను ధరించే మడిబట్టను ఎవరూ తాకరాదు గనుక అటువంటి ఒక మడిబట్టనే ఆ కొబ్బరి చెట్టుకు గనుక కడితే మడిబట్టను తాకకూడదు గనుక దొంగ వెనక్కిపోతాడని, తన చెట్టు కాపు భద్రంగా ఉంటుందని అనుకుందామె. ఆ విధంగానే ఒక మడిబట్టను కొబ్బరి చెట్టుకు కట్టింది. ఆ రాత్రి దొంగ రానే వచ్చాడు. కొబ్బరి బొండాలను జాగ్రత్తగా చప్పుడు చేయకుండా దింపాడు. ఆ మడిబట్టలోనే వాటినన్నింటినీ మూటగట్టాడు. చల్లగా జారుకున్నాడు. రాఖీ కట్టినంత మాత్రాన ఈ అగ్రవర్ణ, పురుషాధిక్య సమాజంలో, ముఖ్యంగా మనువాదాన్ని ప్రచారం చేసుకునే హిందూత్వ శక్తుల పాలనలో మహిళలకు రక్షణ దొరుకుతుందని నమ్మితే, మనదీ కొబ్బరి చెట్టుకు మడిబట్ట కట్టిన అమాయకురాలి గతే అవుతుంది. స్త్రీ చిన్నతనంలో తండ్రి రక్షణలో, వయస్సులో ఉన్నప్పుడు భర్త రక్షణలో, వద్ధాప్యంలో కొడుకు రక్షణలో ఉండాలని మనువాదం చెప్పింది. స్త్రీకి స్వాతంత్య్రం ఉండకూడదని నొక్కి చెప్పింది. ఎక్కడా స్త్రీలు తమను తాము కాపాడుకునేవిధంగా బల వంతులుగా తయారుకావాలని చెప్పలేదు. ఆరెస్సెస్‌ శాఖలు హిందూ స్త్రీలకు ఇతర మతాల వారి నుండి ప్రమాదం ఉందని పదే పదే చెప్తూనే వుంటాయి. కాని ఎక్కడా, ఎప్పుడూ ఆ స్త్రీలు తమ ఆత్మరక్షణ కోసం బలంగా ప్రతిఘటించే శక్తియుక్తులు సంపాదించుకోవాలని చెప్పవు. అటువంటి శిక్షణనూ ఇవ్వవు.
పురుషాధిక్యత, హిందూత్వ విద్వేష ప్రచారం, మహిళను ఒక సరుకుగా పరిగణించే నయ ఉదారవాద వినిమయతత్వం నేటి భారతీయ స్త్రీపై ముప్పేట దాడిని చేస్తున్నాయి. ఈ మూడు వైపుల దాడినీ మొత్తం సమాజం యావత్తూ ఐక్యంగా ప్రతిఘటిస్తే తప్ప మగువకు రక్షణ ఉండదు. అటువంటి ఐక్యతకు, ప్రజలు తమ విముక్తి కోసం సాగించే పోరాటాలకు విడదీయలేని బంధం ఉంది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటపు అనుభవాలు ఆ విషయాన్ని మనకు స్పష్టం చేస్తాయి. వెట్టి నుండి విముక్తి సాధించడానికి చేసిన పోరాటమే తెలంగాణ రైతు మహిళలను భూస్వాముల అత్యాచారాల నుండి విముక్తి చేసింది. ఆ పోరాటంలో మహిళలు ఎంత వీరోచితంగా పోరాడారో కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం అనుభవాలు మనకు తెలియజెప్తాయి. మహారాష్ట్ర ఆదివాసీల తిరుగుబాటు (గోదావరి లోయ ఆదివాసుల పోరాటం) వీర వనిత గోదావరి పెరులేకర్‌ నాయకత్వంలో నడిచింది. ఈ తరహా ఉద్యమాలు స్త్రీలలో ఆత్మస్థైర్యాన్ని నింపాయి. మరొకవైపు పురుషులలో మహిళల పట్ల గౌరవాభిమానాలను, మర్యాదను పెంచాయి. అటువంటి ఉద్యమాలను ఐక్యంగా నిర్వహించడానికి సంకేతంగా ఏదైనా పండుగ జరుపుకుంటే అర్ధం చేసుకోవచ్చు. రాఖీ పండుగ నాడు కూడా అభ్యుదయ శక్తులు…కులాలతో, మతాలతో నిమిత్తం లేకుండా అందరూ దోపిడీ నుండి, పురుషాధిక్యత నుండి విముక్తికి ప్రతిన పూనుతూ రాఖీ కార్యక్రమం నిర్వహించవచ్చు. గతంలో యువ జన, మహిళా సంఘాలు సంయుక్తంగా ఈ తరహా కార్యక్రమాలు దేశ సమైక్యతకు ప్రమాదం వాటిల్లిన సందర్భాలలో నిర్వహించాయి. హిందూత్వ శక్తులు పురుషాధిక్యతను, విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ఈ పండుగను వాడుకుంటాయి. దానికి భిన్నంగా మహిళా విముక్తి లక్ష్యంగా, లౌకిక సమైక్యతతో, పోరాట స్ఫూర్తితో అభ్యుదయ ఉద్యమాలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి.

– ఎం.వి.ఎస్‌. శర్మ

Spread the love