జనాభా నియంత్రణ వివాదం – బీజేపీ రాజకీయం

గత డిసెంబరు పార్లమెంటు సమావేశాల్లో ఇద్దరు బీజేపీ ఎం.పి.లు – రవి కిషన్‌, నిశికాంత్‌ దూబే – లోక్‌సభలో జనాభా నియంత్రణపై ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలు అయివుండి ప్రయివేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టడం, అందునా, అదేదో ఒక ప్రత్యేక ప్రాంతానికో, ప్రత్యేక పరిమిత తరగతికో చెందిన అంశం మీద కాకుండా యావత్‌ దేశానికీ సంబంధించిన విషయం మీద ప్రయివేటు మెంబర్‌ బిల్లు పెట్టడం అంటే దాని వెనుక దాగి ఉన్న బీజేపీ ఎజెండా ఏమిటో ఊహించుకోవచ్చు. వివాదా స్పద అంశం మీద ముందు వ్యక్తులుగా చిచ్చు రేపడం, ఆ తర్వాత దాని పర్యవసానాలు తమకు లాభదాయకంగా ఉంటాయన్నది ధృవపడితే అప్పుడు అధికారికంగా ఆ ఎజెండాను ముందుకు తేవడం బీజేపీకి పరిపాటి అయిపోయింది. ఒకవేళ వివాదం బెడిసికొడితే, మాకేమీ సంబంధం లేదు, అది ఆ సభ్యుడి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి తప్పించుకోవడం కూడా బీజేపీ ఎత్తుగడలో భాగమే.
సదరు బిల్లులో తక్షణమే జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందంటూ ఆ ఇద్దరు ఎంపీలూ ప్రతిపాదించారు. ఈ బిల్లు లోక్‌సభలో పెట్టక ముందు ఇంకో ఆరు నెలల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయనగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ”ఉత్తరప్రదేశ్‌ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు, 2021ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అందులో ఉన్న ప్రతిపాదనల్లో ఆచరణాత్మకమైనవి తక్కువగా, రాజకీయంగా వివాదాస్పదం అయ్యేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత జనాభా నియంత్రణ పక్షోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, యోగి ఆదిత్యనాథ్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలు మరింత స్పష్టంగా హిందూత్వ ఎజెండా ఏమిటో సూచిస్తున్నాయి. ”ఏదో ఒకానొక మతానికి చెందిన ప్రజల జనాభా తక్కిన తరగతుల ప్రజానీకం కన్నా ఎక్కువగా పెరిగిపోయి, ఇక్కడి మూలవాసుల (అంటే హిందువులు అని అనుకోవాలి) జనాభాను మాత్రమే స్థిరీకరించడం అనేది ఏ విధంగానూ అనుమతించబోము” అని ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఇప్పటికే ఉత్తర భారతంలో హిందీ ప్రాంతంలో ముస్లింల జనాభా హిందువులతో పోల్చితే ఎక్కువగా పెరిగిపోతోందన్న పొరపాటు భావన బలంగా ప్రచారంలో ఉంది. దానిని మరింత రెచ్చగొట్టి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ వ్యూహం. యూపీ ఎన్నికలముందు అక్కడ అసెంబ్లీలో రేపిన వివాదాన్ని ఇప్పుడు తాజాగా లోక్‌సభలో రేపుతున్నారు.
ఇంతకూ జాతీయ సర్వే వెల్లడిస్తున్నది ఏమిటి?
1992-93 నాటికి ముస్లింలకు, హిందువులకు మధ్య సంతానోత్పత్తి రేటు (దీనినే ఫెర్టిలిటీ రేటు అంటారు)లో తేడా 1.1 ఉండేది. అంటే ఆనాటికి ముస్లిం జనాభా హిందువుల జనాభా కన్నా 1.1శాతం చొప్పున అధికంగా పెరుగుతూ ఉండేది. తాజాగా 2019-21లో చేసిన జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే ప్రకారం ఈ తేడా 0.35కి తగ్గిపోయింది. అంటే గడిచిన ముప్ఫై సంవత్సరాల కాలంలో ముస్లింలలోనే జనాభా నియంత్రణ పథకాల ఫలితాలు ఎక్కువ ఫలితాలను ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో చూస్తే అక్కడ ముస్లిం జనాభా 20శాతం ఉంది. ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1981 నాటికి 5.8శాతంగా ఉండేది కాస్తా 2011 నాటికి 2.7కి తగ్గిపోయింది. అదే అస్సాంలో ముస్లిం జనాభా 33శాతం. అక్కడ ఇప్పుడు సంతానోత్పత్తి రేటు 1.9శాతం ఉంది. జమ్ము-కాశ్మీర్‌లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. అక్కడ1981లో 4.5శాతంగా ఉండిన సంతానోత్పత్తి రేటు 2011 నాటికి 1.4శాతానికి పడిపోయింది. ఇది దేశం మొత్తం మీద సగటున ఉన్న సంతానోత్పత్తి రేటు 2శాతం కన్నా తక్కువగానే ఉంది. ఈ వివరాలను బట్టి హిందువులకన్నా ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులను మెరుగ్గా పాటిస్తున్నారు అని స్పష్టంగా చెప్పవచ్చు. జాతీయ సర్వే ఫలితాలను చూస్తే జనాభా నియంత్రణ మనదేశంలో సరైన దిశలోనే కొనసాగుతోందని చెప్పవచ్చు. 1951 నాటికి 5.9శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు రెండు శాతానికి పరిమితం అవడం బట్టి ఈ విషయం బోధపడుతోంది. అటువంటప్పుడు ఇవే విధానాలను కొనసాగిస్తే సరిపోతుంది. కాని అదేదో తీవ్రమైన తక్షణ సమస్య అయినట్టు బీజేపీ చిత్రీకరించడం చూస్తే ఆ పార్టీ అసలు ఎజెండా జనాభా నియంత్రణ ఎంతమాత్రమూ కానేకాదని కనపడుతోంది. ముస్లింలకు, హిందువులకు మధ్య సంతానోత్పత్తి రేటులో తేడా తగ్గడం, ముస్లింలలో జనాభా నియంత్రణ పద్ధతులను మెరుగ్గా పాటించడం, ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలలో సంతానోత్పత్తి పెరుగుదల రేటు తక్కిన రాష్ట్రాలకన్నా సాపేక్షంగా తక్కువగా ఉండడం వాస్తవాలు అయినప్పుడు వాటన్నింటినీ కప్పిపుచ్చి హిందువుల జనాభా తగ్గిపోతోం దంటూ విద్వేషాలను రెచ్చగొట్టడం హిందూత్వ మతోన్మాద రాజకీయ ఎజెండాలో భాగమే.
నిజానికి జరగాల్సినది ఏమిటి?
ఐక్యరాజ్యసమితి గణాంకాలు చూస్తే చాలా దేశాల్లో వయో వృద్ధుల శాతం జనాభాలో పెరుగుతూ, యువత శాతం తగ్గుతూ ఉంది. ఈ ధోరణి రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగనుందని ఐరాస అంచనా. ఈ ధోరణి తొలుత జపాన్‌, స్కాండినేవియన్‌ దేశాలు, తదితర సంపన్న దేశాల్లో మొదలైంది. ఇప్పుడు అది అభివృద్ధి చెందుతున్న దక్షిణాసియా దేశాల్లో సైతం కనిపిస్తోంది. అందులో ఇండియా కూడా ఉంది. అటువంటప్పుడు బలవంతంగా జనాభా నియంత్రణ చర్యలు ప్రవేశపెట్టడం ప్రతికూల ఫలితాలనిస్తుంది. యూపీ ప్రభుత్వం ఇద్దరు కన్నా సంతానం ఎక్కువ ఉంటే ఆ దంపతులలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అర్హత ఉండదని తన ప్రతిపాదిత చట్టంలో పేర్కొంది. ఇది బలవంతంగా జనాభా నియంత్రణ అమలు చేయడం కిందే వస్తుంది. ఇటువంటి అనాలోచిత చర్యలు ఎంతమాత్రమూ పనికిరావు. ప్రపంచంలో అధికంగా ప్రసూతి మరణాలు, నవజాత శిశువుల మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. వివిధ రకాల అంగవైకల్యాలతో జన్మిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉన్న దేశాలలో కూడా భారతదేశం ఉంది. ఇక ఆకలి సూచికలో కూడా మన దేశం స్థానం దిగజారుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్య, కుటుంబ సంక్షేమ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం తక్షణ ప్రాధాన్యతగా ఉండాలి. ఆ పని చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకు రాదు. పైగా వైద్యాన్ని మురింత ప్రయివేటుపరం చేస్తోంది. దాని పలితంగా పేద ప్రజానీకం సరైన వైద్యం పొందలేకపోతున్నారు. లేదా చేయించుకున్న వైద్యానికి ఫలితంగా అప్పులపాలవుతున్నారు. దేశంలో జరుగుతున్న రైతాంగ ఆత్మహత్యల్లో గణనీయ భాగం వైద్యానికి చేసిన అప్పులను తీర్చలేకపోయినందు వలన జరిగినవే. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, ప్రజల్లో రగిలే అసంతృప్తిని విద్వేష రాజకీయాల వైపు మళ్ళించడమే బీజేపీ వ్యూహం. ఇది మోడీ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంలో మరో అంకం.

ఎమ్వీయస్‌

Spread the love