Thursday, April 16, 2026
E-PAPER
Homeవరంగల్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు

- Advertisement -

– ధన్వాడలో సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం
నవతెలంగాణ – కాటారం

ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ధన్వాడలో విస్తృత ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాసంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను వివరించారు. ముఖ్యమంత్రి ముందుగా మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తరువాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటన జిల్లాకు ఎంతో ప్రాధాన్యత కలిగినదని, ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని, రవాణా సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే హెలిప్యాడ్ ఏర్పాటు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంటారని చెప్పారు.
ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మహాదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -