Saturday, July 11, 2026
E-PAPER
HomeNewsకవితను అడ్డుకున్న జేవీఆర్-ఓసీ సెక్యూరిటీ, పోలీసులు 

కవితను అడ్డుకున్న జేవీఆర్-ఓసీ సెక్యూరిటీ, పోలీసులు 

- Advertisement -

– గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం- ఇరువర్గాల గేటు తోపులాట 
– గేటు తోసుకొని ఓసీలోకి వెళ్లిన కల్వకుంట్ల కవిత
– మీడియాకు ‘నో’ ఎంట్రీ చెప్పిన సింగరేణి సెక్యూరిటీ 
నవతెలంగాణ-సత్తుపల్లి

బొగ్గు గనుల ‘బావి బాట’ కార్యక్రమం సందర్భంగా శనివారం సత్తుపల్లి జేవీఆర్-ఓసీ సందర్శనకు వచ్చిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను సింగరేణి సెక్యూరిటీ, స్థానిక పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. కవితను, కవిత బృందాన్ని లోపలికి వెళ్లకుండా గేట్లు వేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొద్దిసేపు ఇరువు వర్గాల మధ్య గేటు  తోపులాట జరిగింది. ఎట్టకేలకు కవిత సైన్యం గేట్లను నెట్టుకొని మరీ కవితను ఓసీలోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన కవిత అక్కడి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తూ తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, మద్దతుగా నిలుస్తున్న ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాలకు రోజులు దగ్గర పడ్డట్లేనని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికులను కలవకుండా ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులతో పెట్టుకున్న వాళ్లెవరూ చరిత్రలో బాగుపడలేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది కేవలం వెయ్యి రోజులు మాత్రమేనని విమర్శించారు.

– కార్మికులను కలవకుండా ప్రభుత్వం ‘చీప్ ట్రిక్స్’ పై కవిత ఫైర్
కార్మికుల సాధకబాధకాలు తెలుసుకోవడానికి తాను సత్తుపల్లి వస్తే, అన్ని మైన్ల దగ్గర అడ్డుకోవడమే కాకుండా, తాము వచ్చేసరికే కార్మికులను బలవంతంగా గనుల్లోకి పంపించారని కవిత మండిపడ్డారు. మమ్మల్ని  కార్మికులను కలవకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని మండిపడ్డారు.  కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

– ​డిపెండెంట్ ఉద్యోగాలపై ఆందోళన.. మెడికల్ బోర్డు ఎక్కడ..?
గత నెల రోజులుగా తాను సింగరేణి ఏరియాల్లో పర్యటిస్తున్నానని, ప్రతిచోటా కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాలు, అలియాస్ పేర్ల అంశాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని కవిత పేర్కొన్నారు. ముఖ్యంగా కొద్ది రోజుల్లో రిటైర్డ్ కాబోతున్న కార్మికులు తమ పిల్లల భవిష్యత్తుపై నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డిపెండెంట్ ఉద్యోగాల తోపాటు, మెడికల్ బోర్డు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

– ​గాంధేయ మార్గంలో ప్రభుత్వం మెడలు వంచుతాం.. 20 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతాం
ప్రభుత్వ మొండివైఖరిపై కవిత అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయకపోతే, అదే రోజు (20వ తేదీన) తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో పోరాడి, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మెడికల్ బోర్డు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

​అధికార పక్షానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది…ఆ తర్వాత కార్మికుల రాజ్యమే
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిపోతోందని కవిత జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఇంకా కేవలం వెయ్యి రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఆ తర్వాత వచ్చేది కార్మికుల రోజులే అంటూ కార్మికులకు భరోసా ఇచ్చారు. యాజమాన్యాలు, పాలకులు ఎన్ని కుట్రలు చేసినా కార్మికుల పక్షాన పోరాటం ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు. హెచ్ఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్ధన్,హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సారన్న, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ గుట్టు కరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం నాగేందర్, కిషన్ నాయక్, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ వన్నెంరెడ్డి సాగర్ (జాగృతి),  సత్తుపల్లి హెచ్ఎంఎస్ నాయకులు ఆంజనేయులు, అజ్గర్ ఖాన్, వరికూటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, రాము పాల్గొన్నారు. 

మీడియాకు నో ఎంట్రీ చెప్పిన సింగరేణి సెక్యూరిటీ 
కవిత చేపట్టిన ‘బావి బాట’ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు జేవీఆర్-ఓసీకి వెళ్లిన మీడియా బృందాన్ని సింగరేణి సెక్యూరిటీ నో ఎంట్రీ చెప్పింది. దీంతో చేసేది ఏమీ లేక మీడియా బృందం గేటు బయట పడిగాపులు పడాల్సి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -