టీడీపీ తెలుగు రాష్ట్రాలకు చారిత్రక అవసరం

– ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి
– మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని
– ఘనంగా నిర్వహించాలి : చంద్రబాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌
తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ మనుగడ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక అవసరమన్నారు. తెలుగుదేశం తెలంగాణ కార్యాలయం ఎన్టీఆర్‌భవన్‌లో టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ అధ్యక్షతన జరిగిన ”ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. తెలుగువారిలో ఎన్టీఆర్‌ ఆత్మాభిమానం పెంచారనీ, దానికి ఆత్మవిశ్వాసం తోడైతే ప్రపంచాన్నే తెలుగువారు జయించవచ్చని మనమంతా ముందుకెళ్లామని అన్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రారంభించిన పార్టీ టీడీపీయేనన్నారు. హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ లకు ధీటుగా మూడో నగరం సైబరాబాద్‌ నిర్మించాం, హైటెక్‌ సిటీ అభివద్ధి చేశాం. నాలెడ్జ్‌ హబ్‌ గా రాష్ట్రాన్ని మార్చాం.. 20ఏండ్ల క్రితం మనం వేసిన పునాదులపైనే తెలంగాణ ఈనాడు అభివద్ధి పథంలో నడుస్తున్నది. సంస్కరణలకు నాంది పలికాం, ఎన్నో విధాలుగా ప్రోత్సాహకాలిచ్చాం.అప్పట్లో బయోటెక్నాలజీ అంటే అర్ధం కాలేదు, ఈ రోజు అదే కరోనా వ్యాక్సిన్‌ తయారీకి వేదికైంది.. హైదరాబాద్‌లో హజ్‌ హౌజ్‌ కట్టాం, మైనార్టీ కార్పోరేషన్‌ పెట్టాం, వక్ఫ్‌ భూములు కాపాడాం, మత కలహాలు లేకుండా చేశాం, శాంతిభద్రతలు కాపాడాం.. అని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇక విమర్శలు అనవసరం.. 40 ఏండ్లుగా అభివద్ధి చేసుకున్నాం. ఇంకా అభివద్ధి ఎలా చేయాలా అనే ఆలోచించాలి. అంతే తప్ప పరస్పర విమర్శలతో కాలం వధా చేయడం అనవసరమని అభిప్రాయపడ్డారు. కాసాని జ్ఞానేశ్వర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా అయ్యాక పార్టీ పరుగులు తీస్తున్నది. చిన్నచిన్న విభేదాలున్నా విమర్శించుకోవడం మంచిది కాదనీ, కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలను అధినేత చంద్రబాబు ఆదేశించారు. మొన్న నాయీ బ్రాహ్మణులకు తొలిసీటని ప్రకటించిన కాసాని నేడు రెండో సీటు ఇప్పుడు ప్రకటిస్తున్నాం, అది రజకులకే అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడమే ఆ మహనీయుడు ఎన్టీఆర్‌కు మనం అందించే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వడం భారతదేశానికే గర్వకారణం అంటూ, ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న తెలుగువారి డిమాండ్‌ నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను ఇక్కడే ఘనంగా నిర్వహిస్తున్నామనీ, పరేడ్‌ గ్రౌండ్లో కాసాని జ్ఞానేశ్వర్‌ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారనీ, దానిని పెద్దఎత్తున విజయవంతం చేయాలని చంద్రబాబు పార్టీ నాయకులను కోరారు.

Spread the love