దాడులు చేసే సంస్కృతి మంచిదికాదు

–  బీఆర్‌ఎస్‌కు సీఎల్పీ నేత భట్టి హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దాడులు చేసే సంస్కృతి మంచిదికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ నేతలను హెచ్చరించారు. భూపాలపల్లిలో రేవంత్‌రెడ్డి బహిరంగసభపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం శోచనీయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడి జరగడం శోచనీయమని పేర్కొన్నారు. అధికార పార్టీకి పోలీసులు కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గ్రహించాలని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడం సమాజానికి మంచిది అని సూచించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు చేయడం, సభలను అడ్డుకోవడం చట్టవ్యతిరేకమైన చర్య అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ అని పేర్కొన్నారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ చేసిన ప్రజావ్యతిరేక విధానాలపై మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఇతర రాష్ట్రాల్లో సమావేశం పెడితే ఇలాగే కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేస్తే కేసీఆర్‌ ఒప్పుకుంటారా? అని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రశ్నించారు. కార్పొరేట్‌ విద్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love