దారులన్నీ పెద్దగట్టువైపు పోటెత్తిన సందర్శకులు

– సోమవారం స్వామివారిని దర్శించుకున్న ఐదు లక్షల మంది
– నేడు చంద్రపట్నం
నవతెలంగాణ- చివ్వెంల
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు సందర్శకులతో పోటెత్తింది. రెండోరోజు సోమవారం సుమారు ఐదు లక్షల మందికి పైగా స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా. ఆదివారం అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభం కాగా, సోమ వారం ఆలయ పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. ఆదివారం అర్ధరాత్రి పెద్దగట్టుకు దేవరపెట్టె చేరుకున్న తర్వాత సోమ వారం ఉదయం సమయంలో సౌడమ్మ, యలమంచమ్మ, ఆకు మంచమ్మ దేవతలకు బోనాలు సమర్పించారు. సాయంత్రం మద్దెలపోలు పోశారు. యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి కొలుపు చెప్పారు. దురాజ్‌పల్లి చుట్టుపక్కల ఐదు కిలో మీటర్ల మేర ట్రాక్టర్లు, గుడారాలు వేసుకొని వంటలు వండు కున్నారు. దురాజ్‌పల్లి, కాశీంపేట, కలెక్టరేట్‌ వరకు జనసందడి కనిపించింది. పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు నిర్వహించారు. జాతర మంగళ వారం చంద్రపట్నం వేస్తారు. ఉదయం యాచకులతో కలిసి రాజులు, పూజారులు గుడి ప్రాంగణంలో చంద్రపట్నం వేసి భైరవుడికి పోలుపోస్తారు.
స్వామి వారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు
లింగమంతుల స్వామిని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ రేషన్‌ చైర్మెన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, స్వామి వారిని దర్శించు కున్నారు.
తాగునీటికి కటకట
గుట్టపైన సందర్శకుల స్నానాల కోసం షవర్లు ఏర్పాటు చేశారు. అయితే, తాగు నీటి సమస్య ఏర్పడింది. నీటి కోసం సందర్శకులేగాక పోలీసు, ఇతర శాఖల అధికారులు సైతం అల్లాడారు. కొత్తగా నిర్మించిన కోనేటి మధ్యలో శివుడి విగ్రహం ఆకర్షణీయంగా నిలిచింది.
ఏరులై పారిన మద్యం
జాతరలో మద్యం ఏరులై పారింది. జాతర సమీపంలో దురాజ్‌పల్లి, రాంకోటితండా, మున్యా నాయక్‌ తండా, ఖాశీంపేట, వల్లభాపురం గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దురాజ్‌పల్లి లోని కిరాణా, కూల్‌డ్రింక్స్‌ దుకాణాలు, పలు హోటళ్లలో సైతం మద్యం విక్రయాలు సాగాయి. అంతేకాక మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు.

Spread the love