నేటి నుంచి ఇంటింటికి టీడీపీ

–  చంద్రబాబు రాక
నవతెలంగాణ -హైదరాబాద్‌
తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైభవం సాధించేందుకు యువత, మహిళలు, విద్యావంతులకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. రాష్ట్రంలో ఆదివారం నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉదయం 10 గంటలకు తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లోని తన నివాసంలో మీడియాతో కాసాని చిట్‌చాట్‌ నిర్వహించారు. రాష్ట్రంలో పదిరోజులపాటు మండలం యూనిట్‌గా ప్రతిబూత్‌స్థాయిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్లవారీగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతామని ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా నాడు ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కిలో రూ. 2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్‌ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిహక్కు, బీసీ తరగతులకు పెద్దపీట తదిత అంశాలు వివరించడంతోపాటు టీడీపీకి పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.

Spread the love