బీజేపీ చేతిలో ఐటీ, సీబీఐ, ఈడీ కీలుబొమ్మలు : కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. వాట్‌ నెక్ట్స్‌ అంటూ కేటీఆర్‌.. తదుపరి హిండెన్‌ బర్గ్‌పై ఈడీ దాడులు ఉంటాయా అని ఎద్దేవా చేశారు. బీబీసీ కార్యాలయంపై ఐటీశాఖ దాడుల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఐటీ దాడులు జరిగాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోడీపై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాన్ని రాజేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఇది కేవలం సర్వే అని.. సోదాలు కాదని వెల్లడించారు. పన్నుల అవకత వకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు సిస్టమ్స్‌ వాడొద్దనీ, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పినట్టు సమాచారం. పాత్రికేయుల ఫోన్లను, ల్యాప్‌టాప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. అవకతవకలకు సంబంధించి ఏవైనా ఆధారాలు గుర్తిస్తే.. ఈ సర్వేను కాస్తా సోదాలుగా మార్చే అవకాశముందని సంబంధిత అధికారులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది.

Spread the love