సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌

– రంజీ ట్రోఫీ 2023
ముంబయి : డిఫెండింగ్‌ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన మధ్యప్రదేశ్‌ సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి నాల్గో రోజులోనే మధ్యప్రదేశ్‌ ఛేదించింది. ఉత్తరాఖాండ్‌పై కర్ణాటక ఇన్నింగ్స్‌ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్తరాఖాండ్‌ వరుసగా 116, 209 పరుగులకు కుప్పకూలగా.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లోనే 606 పరుగుల భారీ స్కోరు సాధించింది. జార్ఖండ్‌పై బెంగాల్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. జార్ఖండ్‌ వరుసగా 173, 221 పరుగులు చేయగా బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. 67 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఓ వికెట్‌ కోల్పోయి ఛేదించింది. మరో క్వార్టర్‌ఫైనల్లో సౌరాష్ట్ర, పంజాబ్‌ గట్టిగా పోటీపడుతున్నాయి. 252 పరుగుల ఛేదనలో పంజాబ్‌ ప్రస్తుతం 52/2తో కొనసాగుతుంది. నేడు పంజాబ్‌కు 200 పరుగులు అవసరం కాగా, సౌరాష్ట్ర 8 వికెట్ల కోసం వేచిచూస్తుంది.

Spread the love