టీ కన్సల్ట్‌ సదస్సులో 117 ఒప్పందాలు

– ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీ కన్సల్ట్‌ ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో వివిధ కంపెనీలు, స్టార్టప్‌ల మధ్య 117 ఒప్పందాలు కుదిరాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ”ఆవిష్కర్తలతో పెట్టుబడుదారులను కలిపే సహకార సదస్సు-2024” పేరిట గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సెమినార్‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలసీ మేకర్లు, ఆవిష్కర్తలు, పరిశ్రమ నేతలు ఒకే వేదికపైకి రావడం పరస్పర అవగాహనకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ప్రతిభావంతులను 63 దేశాల్లోని సంస్థలతో అనుసంధానం చేయడం గొప్ప కార్యక్రమమని మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనా చారి, ఎమ్యెల్సీ బండ ప్రకాశ్‌, మద్యప్రదేశ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి, పరిశమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సంగా, టీ కన్సల్ట్‌ సంస్థ వ్యవస్థాపకులు సందీప్‌ మక్తాల తదితరులు పాల్గొన్నారు.

Spread the love