నవతెలంగాణ షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. గాలింపు బృందాల సంఖ్యను 10 నుంచి 12కు పెంచారు. నిందితుడి కదలికలను గుర్తించేందుకు అతడు ఉపయోగించిన సిమ్ కార్డులతో పాటు బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక, ఇతర ప్రాంతాలకు వెళ్లే హైవేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 44వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న హోటళ్లు, దాబాలు, లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో తొలుత బాలిక తల్లి, నానమ్మలను రాజ్‌కుమార్ కత్తిపోట్లతో కడతేర్చాడు. తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికను గొంతుకోసి చంపేశాడు. అనంతరం ఇంటికెళ్లి అతని భార్య, నిద్రిస్తున్న కన్న బిడ్డలను కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. మొత్తం అరగంట వ్యవధిలో మూడు ప్రాంతాల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక, ఇద్దరు చిన్నారుల్ని కిరాతకంగా హత్యచేశాడు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిస్తే.. రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే షాబాద్ ఎస్సై రమేశ్‌ను సస్పెండ్ చేశారు.



