నేడు జగిత్యా‌ల‌కు సీఎం కేసీఆర్‌


కరీంనగర్‌:
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు కేసీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ పూర్తిచేశారు. సాయంత్రం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 2 లక్షల మందిని సీఎం సభకు సమీకరించేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల సభలో సీఎం కేసీఆర్‌ చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు, నోటీసులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 11న కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై నాయకులు, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం కూడా నిజామాబాద్‌ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో వస్తుండటంతో సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఎమ్మెల్సీ కవిత కూడా తలమునకలయ్యారు.

Spread the love