ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీ లాభాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 35 శాతం వృద్ధితో రూ.16,175 కోట్ల నికర లాభాలు సాధించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం పెరగడంతో పాటుగా మొండి బాకీలకు కేటాయింపులు తగ్గడంతో అధిక లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.11,952 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 26.4 శాతం పెరిగి రూ.29,837 కోట్లకు చేరింది. మొండి బాకీల కోసం కేటాయింపులు 9 శాతం తగ్గి రూ.2,602 కోట్లుగా నమోదయ్యాయి. 2024 జూన్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 9 బేసిస్ పాయింట్లు తగ్గి 1.33 శాతంగా, నికర ఎన్‌పీఏలు 6 బేసిస్ పాయింట్లు తగ్గి 0.39 శాతంగా చోటుచేసుకున్నాయి. ఏడాదికేడాదితో పోల్చితే బ్యాంక్ రుణాల జారీలో 52.6 శాతం వృద్ధి, డిపాజిట్లలో 24.4 శాతం పెరుగుదల నమోదయ్యాయి.