ఇన్ఫోసిస్‌లో తగ్గిన 26వేల మంది ఉద్యోగులు

– క్యూ4లో రూ.7,969 కోట్ల లాభాలు
బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 30 శాతం వృద్థితో రూ.7,969 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.6,128 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.37,441 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో 1.3 శాతం పెరిగి రూ.37,923 కోట్లకు చేరింది.
రెవెన్యూ, లాభాలు భారీగా పెరిగినప్పటికీ.. వరుసగా ఐదో త్రైమాసికంలోనూ నియామకాలు పడిపోవడం గమనార్హం. 2023 మార్చి ముగింపు నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,43,234గా ఉండగా.. క్రితం ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం లేదా నికరంగా 25,994 మంది తగ్గడంతో మొత్తం మానవ వనరుల సంఖ్య 3,17,240కి పరిమితమయ్యింది. గడిచిన 23 ఏళ్లలో ఇంత భారీగా ఉద్యోగాలు తగ్గడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ రెవెన్యూలో ఒక శాతం నుంచి మూడు శాతం వరకూ వృద్థి ఉండొచ్చని ఆ కంపెనీ అంచనా వేసింది.

Spread the love