Sunday, April 26, 2026
E-PAPER
Homeఆటలు264 ఉఫ్‌

264 ఉఫ్‌

- Advertisement -

– ఆల్‌టైమ్‌ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్‌ కింగ్స్‌
– ఛేదనలో శ్రేయస్‌, ప్రభుసిమ్రన్‌ విధ్వంసం
– కెఎల్‌ రాహుల్‌ భారీ సెంచరీ వృథా
– ఢిల్లీ 264/2, పంజాబ్‌ 265/4
న్యూఢిల్లీ :
టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర. పంజాబ్‌ కింగ్స్‌ 264 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఊదేసింది. ఫిరోజ్‌షా కోట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లను ఊచకోత కోసిన పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లు.. మరో 7 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. ఛేదనలో ఓపెనర్‌ ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (76, 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌, 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో దంచికొట్టగా.. ప్రియాన్షు ఆర్య (43, 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) శివమెత్తాడు. బ్యాటర్లు అందరూ కలిసికట్టుగా ఆకాశమే హద్దుగా చెలరేగారు. 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 265 పరుగులు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య, ప్రభుసిమ్రన్‌ సింగ్‌లు పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. 6 ఓవర్లలో 116 పరుగులు సాధించి ఛేదనను సుసాధ్యం చేశారు. ఓపెనర్లు నిష్క్రమించినా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 26 బంతుల్లో అర్థ సెంచరీతో పంజాబ్‌ కింగ్స్‌ను గెలుపు బాటలో నడిపించాడు. కూపర్‌ (17), నెహల్‌ వదేరా (25), శశాంక్‌ సింగ్‌ (19 నాటౌట్‌) ఛేదనలో తమదైన పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (2/46) రాణించాడు.
కెఎల్‌ రాహుల్‌ శతకం
కెఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌, 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలగరేటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ నిశాంక (11) నిరాశపరిచినా.. కెఎల్‌ రాహుల్‌, నితీశ్‌ రానా (91, 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు రెండో వికెట్‌కు రికార్డు 220 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. పవర్‌ప్లేలో క్యాపిటల్స్‌ 68/1తో నిలిచినా.. మిడిల్‌ ఓవర్లలో కెఎల్‌ రాహుల్‌ అసమాన ఇన్నింగ్స్‌ ఆడాడు. 16 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగాడు. 47 బంతుల్లోనే సెంచరీ బాదిన రాహుల్‌.. క్యాపిటల్స్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. నితీశ్‌ రానా సైతం సెంచరీ దిశగా సాగినా.. మూడంకెల స్కోరు మార్క్‌కు 9 పరుగుల దూరంలో వికెట్‌ కోల్పోయాడు. డెవిడ్‌ మిల్లర్‌ (3 నాటౌట్‌) జతగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు రికార్డు స్కోరు అందించాడు కెఎల్‌ రాహుల్‌. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (1/49), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (1/69) వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్‌ : 264/2 (కెఎల్‌ రాహుల్‌ 152, నితీశ్‌ రానా 91, అర్ష్‌దీప్‌ సింగ్‌ 1/49, బార్ట్‌లెట్‌ 1/69)
పంజాబ్‌ కింగ్స్‌ : 265/4 (ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 76, శ్రేయస్‌ అయ్యర్‌ 71, ప్రియాన్షు ఆర్య 43, కుల్‌దీప్‌ యాదవ్‌ 2/46)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -