4 నుంచి 8కి..

– రాష్ట్రంలో బీజేపీకి పెరిగిన ఎంపీ సీట్లు
– సిట్టింగ్‌ స్థానాలన్నింటిలోనూ గెలుపు
– కొత్తగా నాలుగు స్థానాల్లో పాగా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో బీజేపీ ఎంపీల సంఖ్య 4 నుంచి 8కి చేరింది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఇతర ముఖ్యనేతలు ప్రతి నియోజకవర్గాన్ని టచ్‌చేస్తూ డబుల్‌ డిజిట్‌ అంటూ ప్రచారం చేశారు. ప్రధాని మోడీ దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్‌ చేసేలా ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయనే ముందస్తు అంచనాతో తెలంగాణ, కర్నాటక, ఏపీ రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్‌ పెట్టింది. పార్లమెంట్‌లో అవసరమున్న అన్ని సందర్భాల్లో ఆదుకున్న మిత్రుడు జగన్‌ ఓవైపు ఉన్నా..
బీజేపీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అదే కారణమనే చర్చ సాగిన విషయం విదితమే. తెలంగాణలో ఆ పార్టీ కీలక నేతల మధ్య ఎన్ని విబేధాలున్నప్పటికీ జాతీయ నాయకత్వం ఫోకస్‌తో కేంద్రీకరించి పనిచేశారు. అదే సమయంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం, పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ క్రాస్‌ఓటింగ్‌తో పాటు అధికారంలో ఉన్నాం ఎవరిని నిలబెట్టినా గెలుస్తామనే కాంగ్రెస్‌ పార్టీ ఉదాసీనత బీజేపీకి సానుకులాంశాలుగా మారాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. దీంతో ఆశించిన మేరకు కాకపోయినా గతం కంటే ఆ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. నాలుగు సిట్టింగ్‌ స్థానాలతో పాటు అదనంగా మరో నాలుగు సీట్లలో పాగా వేసింది.
మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి ఈటల రాజేందర్‌ 3,87,375 ఓట్ల భారీ తేడాతో ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్థుల్లో ఇదే అత్యధిక మెజార్టీ. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరు కూడా 2,25,209 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆయన మెజార్టీ రెట్టింపు అయ్యింది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానంలో చివరి రౌండ్‌ వరకూ విజయం దోబూచులాడినప్పటికీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ 4,500 ఓట్ల బోటాబోటి మెజార్టీతో అతికష్టం మీద గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ తగ్గినప్పటికీ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై ఆయన 49,944 ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌కుమార్‌ 1,09,241 ఓట్ల తేడాతో గెలిచి మరోమారు పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్నారు. గతం కంటే ఆయన మెజార్టీ పెరిగింది. గత ఎన్నికల్లో చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో అతి స్వల్ప తేడాతో ఓడిపోయిన కొండా విశ్వేశ్వర్‌రెడి ఈ సారి గెలుపుబాట పట్టారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన అదే రంజిత్‌రెడ్డిపై 1,66,037 ఓట్ల భారీ తేడాతో ఘనవిజయం సాధించారు. ఆదిలాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీ బాపూరావుపై వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ నగేశ్‌ను పార్టీలో చేర్చుకుని బీజేపీ సక్సెస్‌ అయ్యింది. మంత్రి సీతక్క అక్కడే తిష్టవేసి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అక్కడ అంతిమంగా బీజేపీ అభ్యర్థి నగేశ్‌ 90,652 ఓట్లతో గెలిచి మరోమారు లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. వకీల్‌సాబ్‌ రఘునందన్‌రావు తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నాడు. ఆయన మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్లతో గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌, బండి సంజరు, ధర్మపురి అర్వింద్‌, రఘునందన్‌రావు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నలుగురూ ఇప్పుడు గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు.

Spread the love