– కలిసి పనిచేసేందుకు సిద్దమన్న జిన్‌పింగ్ పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాలన్న ద్రౌపది ముర్ము
బీజింగ్ : చైనా, భారత్‌ల మధ్య దౌత్య బంధానికి 75ఏండ్లు పూర్తయ్యాయి. ఈ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం అభినందన సందేశాలు పరస్పరం పంపుకున్నారు. చైనా, భారత్‌లు రెండూ ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని, ప్రధాన వర్ధమాన దేశాలని, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్య దేశాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు వాటి ఆధునీకరణ ప్రయత్నాల్లో కీలకమైన దశలో వున్నాయని వ్యాఖ్యానించారు. పరస్పర లక్ష్య సాధనల్లో భాగస్వా ములుగా వుండేందుకు, డ్రాగన్-ఏనుగు బంధాన్ని సాకారం చేయడానికి చైనా, భారత్‌లకు ఇది సరైన ఎంపిక అని ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధితో స్పష్టమవుతోందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు, ప్రజల ప్రాధమిక ప్రయోజనాలను పూర్తిగా నెరవేర్చడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో ద్వైపాక్షిక సంబంధాలను చూడాలని, నిర్వహించాలని ఆయన ఇరు పక్షాలను కోరారు. శాంతియుత సహజీవనం, పరస్పర విశ్వాసం, పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి అభివృద్ధితో కూడిన పంథాను అనుసరించాల్సి వుందన్నారు. ఇరుగు పొరుగున గల ప్రధాన దేశాలు పరస్పరం సహరించుకుంటూ బహుళ ధృవ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలని కోరారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా వున్నానని చెప్పారు. పరస్పరం వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంపొం దించు కునేందుకు, పరస్పర మార్పిడులను బలోపేతం చేసుకునేందుకు, వివిధ రంగాల్లో సహకారానికి, అంతర్జాతీయ వ్యవహారాల్లో కమ్యూనికేషన్‌ను, సమన్వయాన్ని మరింత విస్తరించుకునేందుకు కృషి చేయాలని పిలుపిచ్చారు. చైనా-భారత్ సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలను ఉమ్మడిగా పరిరక్షించాలన్నారు. ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ప్రపంచ జనాభాల్లో మూడో వంతు జనాభా భారత్, చైనాల్లోనే వున్నారని అన్నారు. సుస్థిరమైన, విశ్వసనీయమైన, స్నేహంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి లబ్ది చేకూరుస్తాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత స్థిరంగా ముందుకు తీసుకెళ్ళడానికి కలిసి కృషి చేయాలని అందుకు ఈ 75ఏళ్ళ వార్షికోత్సవాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని కోరారు. చైనా, ప్రధాని లీ కియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీలు కూడా పరస్పరం అభినందన సందేశాలు పంపు కున్నారు. మానవ చరిత్ర గమనానికి ఒక రూపునివ్వ డంలో ఇరు దేశాలు కీలక పాత్ర పోషిం చాయని మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు శాంతి, అభివృద్దిలను కూడా పెంపొం దించే బృహత్తర బాధ్య తలను భుజానకెత్తు కోవాల్సి ఉంద న్నారు. ఇరు దేశాల ప్రజలకు మరింత ఉపయోగ పడేలా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్ళాలని లీ కియాంగ్ కోరారు.