Saturday, August 15, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వ్యవసాయ కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: వ్యవసాయ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థులు, బోధనా, బోధనేతర సిబ్బంది కలిపి సుమారు 200 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ దేశ నిర్మాణంలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక వంటిదని, ఆహార భద్రతతో పాటు రైతుల ఆదాయం పెంపు, సహజ వనరుల పరిరక్షణ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సుస్థిర వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, కృత్రిమ మేధస్సు, నీటి సంరక్షణ వంటి అంశాలను రైతులకు చేరువ చేయడంలో వ్యవసాయ విద్యార్థులు, యువ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వ్యవసాయ ఆధారిత పారిశ్రామికత, విలువ ఆధారిత ఉత్పత్తులు, స్టార్టప్‌లు, ఆధునిక ఉద్యానవన పద్ధతులు, సాంకేతిక ఆధారిత వ్యవసాయంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కాగా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు తదితర సాంస్కృతిక, మేధోపరమైన కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

దేశ సమగ్రత, ఐక్యత, సుస్థిర అభివృద్ధి, వ్యవసాయ ప్రగతి కోసం కృషి చేస్తామని విద్యార్థులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ఓఎస్ఏ , ఎన్ఎస్ఎస్ సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా జ్ఞానం, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -