పెండ్లయ్యాక అమ్మాయిల జీవితంలో చాలా మార్పులొస్తా యంటారు. భర్త అత్తింటి వాళ్ల ఒత్తిడితో కొన్ని, గొడవ లెందుకన్న ఉద్దేశంతో తమకు తామే కొన్ని త్యాగాలు చేయడం… ఇలాంటి వాటి వల్ల కొంత మంది మహిళలు తమ సొంత గుర్తింపును కోల్పో తుంటారు. అయితే ఇలా ప్రతి విషయంలో సర్దుకుపోవడం, మార్పులు చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం తగ్గే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు. దీనివల్ల శారీరకంగా, మానసికంగా పలు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే పెండ్లయ్యాక కూడా అమ్మాయిలు కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోకపోవడమే మేలంటున్నారు.
సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఇచ్చే అంశాల్లో వృత్తి ఉద్యోగాలది కూడా కీలక పాత్ర ఉంటుంది. అయితే పెండ్లయ్యాక అత్తింటి వారి ఒత్తిడితో, ఇతర కారణాల రీత్యా కొంతమంది అమ్మాయిలు తమకు ఇష్టం లేకపోయినా ఉద్యోగాలకు దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు ఇతరుల ఇష్టాలకు విలువిచ్చి, మన ఇష్టాలను త్యాగం చేయడం ఎంత వరకు సమంజసం అనేది ఆలోచించమంటున్నారు నిపుణులు. అందుకే ఈ విషయంలో మిమ్మల్ని మీరు బాధపెట్టుకునే బదులు… ఉద్యోగం కొనసాగించే విషయంలో మీ భర్త, అత్తింటి వారి అభిప్రాయం పెండ్లికి ముందే తెలుసుకోండి. ఒకవేళ వాళ్లు ఒప్పుకోకపోతే ఆ సంబంధం విషయంలో పునరాలోచన చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వృత్తి ఉద్యోగాల విషయంలోనే మీ ఇష్టాలకు విలువివ్వని వారు ఆ తర్వాత ప్రతి విషయంలోనూ మిమ్మల్ని, మీ అభిప్రాయాల్ని గౌరవిస్తారన్న గ్యారంటీ లేదు.
డ్రెస్సింగ్
తమకు నచ్చిన, నచ్చకపోయినా పెండ్లయ్యాక కొన్ని అభిరుచుల్ని మార్చుకుంటారు. డ్రెస్సింగ్‌తో పాటు ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకుంటుంటారు. నిజానికి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామేమోనన్న భావనే మనల్ని ఎక్కువగా వేధిస్తుంటుంది. కాబట్టి అసభ్యంగా లేనంత వరకు అది ట్రెడిషనల్ అయినా, మోడ్రన్ అయినా చక్కటి డ్రెస్సింగ్ సెన్స్‌ను కొనసాగించడం మంచిదంటున్నారు నిపుణులు. అంతగా అవసరమనిపిస్తే మీ అభిప్రాయాన్ని మీ భాగస్వామితో పంచుకొని వారిని ఒప్పించవచ్చు. అలాగే ఆయా విషయాల్లో మీ భాగస్వామి అభిప్రాయాలకు కూడా విలువనివ్వడం వల్ల… ఇద్దరి మధ్య అరమరికల్లేకుండా ముందుకెళ్లచ్చు.
స్నేహితులతో…
పెండ్లికి ముందు మనకంటూ ఓ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా వారితో సమయం గడుపుతూ బోలెడన్ని మధుర జ్ఞాపకాల్ని మూటగట్టుకుంటాం. అయితే పెండ్లి తర్వాత ఒక్కసారిగా దీన్ని మార్చుకోవాలని చెప్పే హక్కు గానీ, అవతలి వారి కోసం మనకు మనమే మన స్నేహాన్ని త్యాగం చేసే అవసరం గానీ లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికైనా, శారీరక మానసిక ఉల్లాసానికైనా మనకంటూ కొంత సమయం కేటాయించుకోవడం, నచ్చిన వారితో గడపడం ముఖ్యమంటున్నారు.
బాధ్యత మారదు
పెండ్లయ్యాక అమ్మాయి పుట్టింటి వారి గురించి పట్టించుకోవక్కర్లేదనే భావన ఇప్పటికీ కొంత మందిలో చూస్తుంటాం. నిజానికి ఇలాంటి ఆంక్షల వల్ల కొడుకులు లేని తల్లిదండ్రుల బాగోగులు చూసే వారే కరువవుతుంటారు. కానీ ఇలా ఆలోచించే సమాజాన్ని పక్కన పెట్టి పెండ్లయినా అమ్మాయిలు తమ పూర్వ బాధ్యతల్ని కొనసాగించడమే మంచిదంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవడం, వృద్ధాప్యంలో వారిని చేరదీయడం, ఆర్ధికంగా మీకున్న బాధ్యతల్ని కొనసాగించడం మొదలైన విషయాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ విషయాల్లో పెండ్లయ్యాక తగాదాలు రాకుండా ఉండాలంటే మీ భాగస్వామితో ముందే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ఇంటి పేరు విషయంలోనూ…
పెండ్లయ్యాక చాలా మంది అమ్మాయిలకు ఇంటి పేరు మారుతుంటుంది. ఇది చాలా ఏండ్లుగా కొనసాగుతున్న పద్ధతి. అయితే ఇప్పుడు కొంతమంది పెళ్లైనా తమ తల్లిదండ్రుల ఇంటి పేరునే ప్రతి చోటా ఉపయోగిస్తున్నారు. ఇక మరికొందరు తమ పూర్తి పేరు వెనక తమ భర్త పేరు లేదంటే అత్తింటి వారి ఇంటి పేరును చేర్చుకుంటున్నారు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగించడం చూస్తూనే ఉన్నాం.