– సీటివ్వకపోయినా రెబల్‌గా నిలుస్తామంటున్న ఆశావహులు
– కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే రేఖా నాయక్
– భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి తనయుడి అలక
– పటాన్‌చెరులో పోటి చేస్తానంటున్న నీలం మధు
– జహీరాబాద్‌లో ‘గులాబీ’కి షాకిచ్చిన ఢిల్లీ వసంత్
బి.వి.యన్.పద్మరాజు
ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల పట్ల ఇన్నాళ్లూ ‘ధిక్కారమును సైతునా…’ అన్నట్టు వ్యవహరించిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు సొంత పార్టీ నుంచే ‘ధిక్కార స్వరాలు’ వినబడుతున్నాయి. పార్టీ నుంచి సీటిచ్చినా, ఇవ్వకపోయినా కచ్చితంగా పోటీ చేసి తీరతామంటూ పలువురు నేతలు, ఆశావహులు తేల్చి చెబుతున్నారు. అభ్యర్థుల మీద వ్యతిరేకత, కర్నాటక ఫలితాల ప్రభావం, కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణంతో ఇప్పటికే కొంతలో కొంత ఇబ్బందికి గురవుతున్న గులాబీ పార్టీకి ఇప్పుడు ‘రెబల్స్’ బెడద మరిన్ని చిక్కులు తెచ్చే ప్రమాదం పొంచి ఉంది. తొలి జాబితాలోనే 115 మంది అభ్యర్థులను ప్రకటించటం, వారిలో వంద మందికి బీ-ఫామ్‌లు అందజేసిన నేపథ్యంలో తమకు ఇక అధికార పార్టీ నుంచి సీటు వచ్చే అవకాశం లేదని తెలిసిన నేతల్లో కొందరు పార్టీ మారుతుండగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించు కున్నారు. వీరిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా, మరికొందరు యువ నాయకులు ఉన్నారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి(కాంగ్రెస్‌లో గెలిచి, ఆ తర్వాత కారెక్కారు)కే ఈసారి కూడా బీఆర్‌ఎస్ టిక్కెటిచ్చింది. అక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఇప్పుడు ఆయన తనయుడు ప్రశాంత్ రూపంలో బీఆర్‌ఎస్‌కు గండం ఎదురవుతున్నది. నియోజకవర్గంలో గండ్ర కుమారుడి వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ మాజీ స్పీకర్ తనయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అందువల్ల తాను కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ ప్రశాంత్ చెబుతూవస్తున్నారు. ఆసిఫాబాద్‌లో సీటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే అజ్మీరారేఖా నాయక్… కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇక ఇప్పటి వరకూ టిక్కెట్ ఎవరికిచ్చినా కచ్చితంగా మద్దతిస్తాననీ, సీఎం కేసీఆర్ మాటే వేదవాక్కంటూ చెప్పినబోథ్ ఎమ్మెల్యే బాపూరావు… ఇప్పుడు నిరసన గళం విప్పుతున్నారు. తాను కూడా పోటీలో ఉండి తీరతానంటూ బీఆర్‌ఎస్ అధిష్టానానికి హెచ్చరికలు పంపారు.
కారుకు ‘ముదిరాజ్’ల ముప్పు…
మరోవైపు రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గమైన ముదిరాజ్‌లు ఈసారి బీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రకటించిన 115 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా తమ సామాజిక తరగతికి ఇవ్వలేదంటూ వారు వాపోతున్నారు. అందువల్ల బీఆర్‌ఎస్‌కు కచ్చితంగా తమ సత్తా చూపుతామంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఆ సామాజిక తరగతి నుంచి పటాన్‌చెరు నియోజకవర్గంలో మొదటి నుంచి టిక్కెట్ ఆశిస్తూ వచ్చిన నీలం మధుకు గులాబీ పార్టీ మొండి చేయి చూపింది. దీంతో ఆయన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ తమ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందంటూ ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల రూపంలో బీఆర్‌ఎస్‌కు వార్నింగ్ పంపారు. అయినా ప్రగతి భవన్ నుంచి పిలుపు రాకపోవటంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. హస్తం పార్టీ టిక్కెట్ ఇస్తే ఓకే..లేదంటే ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందని మధు సన్నిహితులు చెబుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘ముదిరాజ్’ల ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కచ్చితంగా పడే అవకాశముంది. ముఖ్యంగా మెదక్, సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌తోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను అది ప్రభావం చేయనుంది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేయనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇది సానుకూలాంశంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం. సీఎం కేసీఆర్ ఈ పరిణామాలన్నింటినీ గమనించే అదే సామాజిక తరగతికి చెందిన మామిళ్ల రాజేందర్ (టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షులు) చేత వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయించి, ఆ వెంటనే పార్టీలో చేర్చుకున్నారు. ఆయన చేరిక బీఆర్‌ఎస్‌కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
ఊహించని షాక్…
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఢిల్లీ వసంత్ కుమార్… బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌నిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు మరోసారి టిక్కెట్ ఇవ్వటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తనకు టిక్కెట్ ఇస్తారనే ఆశతో చివరి దాకా ఎదురు చూసిన వసంత్… ఇటీవల బీజేపీలో చేరారు. ‘ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకుని పని చేసిన నాకు టిక్కెట్ ఇవ్వలేదు, అందువల్ల ఈసారి నా సత్తా ఏంటో చూపుతా…’ అంటూ ఆయన బీఆర్‌ఎస్‌కు హెచ్చరికలు పంపారు.
అబ్రహం ఏం చేస్తారో…?
ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు చివరి నిమిషంలో ఎదురు దెబ్బ తగలనున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ తొలి జాబితాలో ఆయన పేరున్నప్పటికీ… బీ-ఫామ్ మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ విషయమై చర్చించేందుకు గురువారం తెలంగాణ భవన్‌కు వచ్చిన అబ్రహంకు మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అనుయాయుడు విజయుడుకు టిక్కెట్ దక్కనున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ మొత్తంలో వెంకటరామిరెడ్డి చక్రం తిప్పినట్టు వినికిడి. సీఎం కేసీఆర్ కచ్చితంగా ఆయనకే బీ-ఫామ్ ఇస్తారని తెలిసింది. మరి ఇదే జరిగితే ఇతర నేతల మాదిరిగా అబ్రహం కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? లేక పార్టీకి విధేయుడిగా ఉంటారా..? అనేది చూడాలి.