ఈ వారం జరిగిన రెండు పరిణామాలు దేశ రాజకీయాలు ఎంత ఏకపక్షంగా నడుస్తున్నాయో వెల్లడిస్తున్నాయి. ఈ రెండింటికి ప్రత్యక్ష సంబంధం లేదు. వీటిలో ఒకటి రాజకీయంగా బీజేపీ అంతర్గత వ్యవహారం కూడా. మరొకటి నేరుగా బయటికి కనిపించని రాజకీయం. వీటిలో ఉమ్మడి అంశం మాత్రం ఒకటే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పట్టు ఎంత బలంగా ఉందో, అదే సమయంలో రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడానికి వ్యూహాత్మకమైన పట్టువిడుపులు కూడా ఎలా ప్రదర్శిస్తుందో ఈ పరిణామాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలం ముగిసి పదమూడు మాసాలు కావస్తోంది. ఎవరైనా సరే రెండు పర్యాయాలు మొత్తం ఆరేండ్లు కొనసాగువచ్చునని వారి నిబంధనావళి చెబుతుంది. అయినప్పటికీ ఎన్నికల పోరాటం కారణంగా చెబుతూ ఆయన్ను కొనసాగించారు.
నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇంకా అనేక పేర్లు వినిపించాయి. మోడీ ప్రధానమంత్రి అయ్యాక అమిత్‌షాను అధ్యక్షునిగా ఎంపిక చేశారు. అప్పటికి ఆ పదవి చేపట్టిన వారిలో ఆయనే చిన్నవారు. మధ్యలో నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తీసుకొచ్చారు. 2019లో మోడీ రెండోసారి గెలిచాక అమిత్‌షాను హోంమంత్రి చేశారు. మోడీ-షాల ద్వయం సర్వం శాసిస్తుందని దేశమంతటికీ తెలుసు. అయితే వారు కూడా సంఘ్‌పరివార్ ఆదేశాలకు లోబడి మెలగాల్సిందే. సంఘ్ పెద్దలు రకరకాలుగా మాట్లాడుతుంటారు కానీ అంతిమంగా ఆరెస్సెస్‌కు కావాల్సింది దేశాధిపత్యం, అన్ని రంగాలను శాసించటం మాత్రమే. మతతత్వ భజనతో పాటు, విశృంఖలమైన కార్పొరేట్ ప్రయివేటీకరణ దోపిడీని సాగిస్తుంటారు. కనుక విధాన నిర్ణయాలైనా, వ్యక్తుల ఎంపికైనా వీటి విధేయులకే లోబడి జరుగుతుంటాయి. అంతర్గత కలహాలు, వ్యక్తిగత తగాదాలు ఆ పరిధిలోనే సర్దుకుంటూ ఉంటారు.
గతంలోనూ ఉదాహరణలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీల హయాంలోనే విభేదాలు చాలా ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాజపేయిని వికాస్ పురుష్, అద్వానీని లోహ పురుష్ అని పొగిడినప్పుడు ఆయన అలగడం కలకలం రేపింది. వాజపేయిని రాష్ట్రపతిని చేసి, అద్వానీని ప్రధానిగా కూచోబెట్టేందుకు పరివార్ ప్రయత్నించిందని ఆయన సలహాదారుడుగా పనిచేసిన అశోక్‌కుమార్ ఇటీవలే తన జ్ఞాపకాల్లో రాశారు. అందుకు ఆయన ఒప్పుకోలేదట. అప్పటి ఎన్డీయే మనుగడకు వాజపేయి నిగ్రహం అవసరం కనుక ఆరెస్సెస్ పట్టు పట్టలేదు. ఆయన్ను తమ ముసుగు అని వ్యాఖ్యానించింది కూడా. వీరిద్దరికీ మధ్య మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి వంటి తలలు మారిపోయాయి. కానీ వారి పట్టు తగ్గలేదు.
నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే ఆరెస్సెస్ ప్రచారక్‌గా పనిచేశారు. కార్పొరేట్ ఇండియా తరఫున రిలయన్స్ అంబానీలు నేరుగా గుజరాత్ గడ్డమీదనే ఆయన్ను ప్రతిపాదించారు. ఎప్పుడూ ఏ ప్రధాని అభ్యర్థికి జరగని స్థాయిలో మోడీని త్రీడీలో చూపించటం కార్పొరేట్ మద్దతు వల్లనే సాధ్యమైంది. అంతర్జాతీయంగా అమెరికా కూటమి కూడా ఈ పని చేయడం గమనించదగింది. బీజేపీ నిర్ణయాలను, దాని నాయకత్వంలోని కేంద్రం విధానాలను అర్థం చేసుకోవాలంటే ఈ రెండు ప్రాథమిక వాస్తవాలు గమనంలో ఉంచుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌కు మధ్యలో వ్యక్తిగత విభేదాలు వచ్చాయని, 75 ఏండ్లు దాటిన తర్వాత దిగిపోవడం గురించి మోహన్ భగవత్ బహిరంగంగానే చేసిన వ్యాఖ్యానాలు నిరూపించాయి. అనూహ్యమైన వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎంపిక చేసినా ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదని ఆరెస్సెస్ ముందే సిద్ధం చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతూ వచ్చాయి.
ఇప్పుడు అక్షరాలా అదే జరిగింది. కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన ఐదుసార్లు శాసనసభ్యుడు అదే సమయంలో 45 ఏండ్ల పిన్న వయస్కుడు నితిన్ నబీన్ నియమితులయ్యారు. ఈయన నాన్న నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా చాలా పర్యాయాలు శాసనసభ్యుడిగా పని చేసిన వ్యక్తి కావడం గమనించదగింది. ఆ విధంగా వారి కుటుంబం సంఘపరివార్‌కు అత్యంత విధేయగా ఉంటుంది. కనుక సంఘ్ పరివార్‌లో ఎవరూ దీనికి ఆశ్చర్యపోవడం లేదు. కానీ బయట ప్రపంచానికి అలాంటి భావం కలిగించేందుకు చాలా ప్రయత్నం జరిగింది. కానీ ఆంతరంగిక వర్గాలు మటుకు మోడీ-షాలకు ఎదురు లేకుండా ఉండేందుకే నవీన్‌ను ఎంపిక చేశారని బాహాటంగానే చెబుతున్నారు. ఆయన నియామకం కూడా పార్టీ కార్యదర్శి ఒకరు సాదాసీదాగా ప్రకటించారు. ఆ వెంటనే మోడీ ట్విట్టర్‌లో తనను అభినందిస్తూ ప్రకటనలు చేశారు. బాధ్యతల స్వీకారం కోసం ఢిల్లీ వచ్చిన నబీన్‌ను నడ్డా, అమిత్‌షాలు స్వాగతించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ యువకుడైన నబీన్ ప్రధాన మంత్రి మోడీ మార్గదర్శ కత్వంలో పనిచేస్తూ ఆయన విధానాలను ప్రజలకు చేరువ చేస్తారని ప్రశంసించారు.
కుల సమీకరణలు కూడా..
హిందూత్వ జపం చేస్తున్నప్పటికీ బీజేపీ కుల సమీకరణాలు కూడా తప్పక పాటిస్తుంది. కాయస్త నేపథ్యం కలిగిన నబీన్ ఎంపిక బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఉపయోగకరమని కూడా లెక్కలు వేస్తున్నట్టు సీనియర్ నాయకులు తెలియజేశారు. ఏప్రిల్ నాటికి నడ్డా పదవీకాలం ముగిస్తే నబీన్ పూర్తిస్థాయి అధ్యక్షుడు అవుతారు. మొదట అమిత్ షా తర్వాత ఇపుడు నవీన్ అధ్యక్షులు కావడం సంఘ్ కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి అన్నిచోట్ల బాగా చిన్నవారిని కొత్తవారిని మాత్రమే ముఖ్యమంత్రులు చేశారు. 2029 కూడా మోడీనే ప్రధానిగా ఉంటారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ వంటి వారు చెబుతున్నారు.
ఆ ఎన్నికల్లో మోడీ నాయకత్వం వహించి తర్వాత అమిత్‌షా వస్తారని మరో అంచనా. షా కు ఇబ్బంది లేకుండానే నబీన్ ఎంపిక జరిగిందని చెబుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరిని నియమించారు .రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని స్థానానికి ఒక పోటీదారు అయిన యోగి ఆదిత్యనాధ్‌ను తగ్గించడంలో ఇది ఒక వ్మూహమని కొన్ని కథనాలు ఉన్నాయి. 2023లో పంకజ్ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే ప్రధాని హోదాలో మోడీ వారి ఇంటికి వెళ్లడం ద్వారా తన సంకేతాలిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో యూపీ, బీహార్ కీలకం అవుతాయని తెలుసు కనుకనే రాష్ట్ర పార్టీల అధ్యక్షులు ఎవరన్నది నిర్ణయించడానికి చాలా కసరత్తు జరిగింది. బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా సంజయ్ సరోగి నియమితులవ్వడం ఇలాంటి పరిణామమే.
మిత్రపక్షాల వంత
విశేషమేమంటే వీరందరూ ఉన్నత వర్గాలకు చెందినవారు. హిందూత్వ రాజకీయాలను కాపాడుకోవాలంటే సంప్రదాయకంగా పై వర్గాలతో ఉన్న పట్టును అనుబంధాన్ని నిలబెట్టుకోవాలని సంఘపరివార్ ఇప్పుడు భావిస్తున్నది. మోడీ బీసీ నేతగా ప్రచారం అందుకుంటున్నా కొత్త సోషల్ ఇంజనీరింగ్ చేస్తారని తొలుత చెప్పుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అది ఎదురు దెబ్బతిన్న తర్వాత మళ్లీ మూలాలకు వెళ్లడం ఇక్కడ గమనించదగింది. సంఫ్‌ు పరివార్‌ను సంతృప్తి పరచడానికి మోడీ నాగపూర్‌కు పర్యటన దీన్నే ప్రతిబింబించింది. అయోధ్య రామ మందిరంపై ధ్వజాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి కూడా భగవత్‌ను ఆహ్వానించారు. మోడీ స్వయంగా ఆరెస్సెస్ స్వయం సేవకుడనని, తను కూడా అక్కడినుంచే వచ్చానని అమిత్ షా పార్లమెంట్‌లో విధేయత చాటుకున్నారు. ఆరెస్సెస్ అయితే పదవులు తీసుకోరాదని ఎక్కడైనా ఆంక్షలు ఉన్నాయా? అని ఎదురుదాడి చేశారు.
మరో విశేషం ఏమంటే కొత్త నేతను బీజేపీతో పాటు ఎన్డీయే భాగస్వాములు కూడా వెనువెంటనే కలుసుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆయన్ను కలుసుకోవటమే కాక దేశ అభివృద్ధి కోసం మోడీని , బీజేపీని బలపరుస్తామని ప్రకటించారు. మరో పదిహేనేండ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుందని అటు పవన్, ఇటు చంద్రబాబు, లోకేష్ ప్రతిసారీ ప్రకటిస్తున్నారు. ప్రస్తుత పాలకవ్యవస్థ మొత్తం ఏ విధంగా ఆరెస్సెస్ వలయంలో చిక్కుకున్నది దీన్నిబట్టి తేలిగ్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ వంటి వారు నిరంతరం సనాతన జపం చేయడంలోనూ ఇదే గోచరిస్తుంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నియామక ఉత్తర్వుల కోసం వచ్చిన ఒక ముస్లిం యువతి ముఖంపై బురఖా లాగి వేయడం కూడా ఇలాంటిదే. ఆయన నుంచి ఆయన క్షమాపణలు చెప్పాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతుంటే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆయనేమీ తప్పు చేయలేదని, కావాలంటే ఉద్యోగం మానేయవచ్చునని బెదిరిస్తున్నారు!
అవార్డులకు అవమానం
రెండవ పరిణామానికి వస్తే కేంద్ర సాహిత్య అకాడమీ 2025కుగాను అవార్డులు ప్రకటించడానికి మీడియాను ఆహ్వానించి వెనక్కు తగ్గింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బహిరంగంగానే అడ్డు పడింది.సాహిత్య, సంగీత, లలిత కళ అకాడమీలు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలు తమ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, మొత్తం పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు అవార్డులు ప్రకటించరాదని వెల్లడించింది. ఆ వెంటనే అకాడమీ మీడియా సమావేశం కూడా రద్దు చేసుకుంది. అంతర్గతంగా చర్చించుకోవచ్చు, లేదంటే మరేదైనా చెప్పి మీడియా గోష్టి ముగించవచ్చు. కానీ ఈ సందర్భంలో బుద్ధిజీవులు, సృజనశీలులు అయిన రచయితలు, కవులకు రాజకీయ సంకేతం అందాలని కేంద్రం వ్యూహం. గతంలో మతోన్మాదులు కొన్ని హత్యలు, దాడులకు పాల్పడిన తర్వాత అనేకమంది అవార్డు గ్రహీతలు వెనక్కు ఇచ్చేశారు. దాన్ని అవార్డు వాపసి అన్నారు.
అలా చేయడం ఆ పురస్కారాలను అవమానించడమేనని అప్పట్లో కేంద్రం, బీజేపీ దాడి చేశాయి. కానీ ఇప్పుడు తామే బహిరంగంగా అకాడమీలను అవమానించాయి. ఇంత బాహాటంగా కేంద్రం పెత్తనానికి అకాడమీలు లోబడి పోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. రాజకీయ ఆధిపత్యంతో పాటు సాంస్కృతిక పరంగా ఆధిపత్యం, మతఛాందసం రుద్దడానికి బరితెగించి చేసిన దాడి ఇది. అందుకే ఆలోచన పరులు ఈ పరిణామాల పట్ల అప్రమత్తత వహించాల్సి ఉంటుంది. వీటి వెనక ఉన్న నిరంకుశత్వాన్ని నిరసించాల్సి ఉంటుంది. రాబోయే శాసనసభ ఎన్నికల కోసం ఆరెస్సెస్, బీజేపీలు మరెన్ని విపరీతాలకు పాల్పడతాయో, వాటిపై స్వారీ చేస్తున్న కార్పొరేట్ శక్తులు మరెంత పట్టు బిగిస్తాయో ఊహించుకోవాల్సిందే.
తెలకపల్లి రవి



