– ఆదివారం ఒకే బంక్ లో పరిమితంగా పెట్రోల్
– ఎగబడ్డ వినియోగదారులు
– పోలీసుల సమక్షంలో పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గ కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో గత రెండు రోజులుగా చమురు కొరత తీవ్రరూపం దాల్చింది. రోజువారీ అవసరాలకు సరిపడా డీజిల్, పెట్రోల్ సరఫరా లేకపోవడంతో వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన రత్నం ఆయిల్ బంక్‌లో ఒక ట్యాంకర్ ద్వారా మాత్రమే పెట్రోల్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఒక్కసారిగా బంక్ వద్దకు పోటెత్తారు.వాహనాలతో పాటు సీసాలు, డబ్బాలు, అందుబాటులో ఉన్న పాత్రలతో ఇంధనం కోసం బంక్‌పై ఎగబడ్డారు.
అనూహ్యంగా పెరిగిన రద్దీతో పరిస్థితి అదుపు తప్పడంతో బంక్ నిర్వాహకులు చేతులెత్తేశారు.దీంతో ఎస్‌ఐ అఖిల, మరో ఇద్దరు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, వారి సమక్షంలో ఇంధన పంపిణీ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో మొత్తం 8 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో పట్టణ పరిధిలో 6, గ్రామీణ ప్రాంతమైన వినాయకపురంలో 2 బంకులు ఉన్నాయి. వీటిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందినవి 2, హిందుస్తాన్ పెట్రోలియంకు చెందినవి 3, భారత్ పెట్రోలియంకు చెందినవి 2, నయారా ఎనర్జీకి చెందినది 1 బంక్ ఉన్నాయి.
ప్రతిరోజు మండలంలో సుమారు 20 వేల లీటర్ల డీజిల్, 8 వేల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. అయితే ఇటీవల సరఫరా నిలిచిపోవడంతో బంకుల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. కొన్నిచోట్ల పూర్తిగా నిల్వలు ఖాళీ కావడంతో వాహనదారులు బంక్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అత్యవసర అవసరాల కోసం కూడా ఇంధనం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉండగా, సరఫరా సంస్థల నుంచి ఇంధనం అందడం లేదని, తాము ఏమీ చేయలేమని బంక్ నిర్వాహకులు చెబుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించి, సాధారణ సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



