Sunday, April 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎరజ్రెండా ముద్దుబిడ్డ ఏలూరి

ఎరజ్రెండా ముద్దుబిడ్డ ఏలూరి

- Advertisement -

ఒక కమ్యూనిస్టు జీవితాన్ని కాగితం పైకి ఎక్కించడం అంటే ఆయన జీవించిన కాలాన్ని, ఆ కాలం నడిపిన వర్గ పోరాట చరిత్రను వర్తమానానికి అందించడమే. ఇప్పుడు ఆ పనిని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ పి.సోమయ్య చేశారు. ”ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏలూరి” అంటూ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కామ్రేడ్‌ ఏలూరి లక్ష్మీనారాయణ జీవిత చరిత్ర పుస్తకాన్ని రచించి మనకు అందిస్తున్నారు. కేవలం ఆయన మాత్రమే రాయడం కాకుండా కామ్రేడ్‌ ఏలూరు ఉద్యమ సహచరులతో, ఆయన చేత ప్రేరణ పొందిన నాయకులతో రాయించారు. కేంద్ర, రాష్ట్ర నాయకుల సందేశాలను సేకరించారు. వీటన్నింటినీ సంకలనం చేసి నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్‌ వారి సహకారంతో పుస్తక రూపంలోకి తెచ్చారు.

ఈ పుస్తకంలో ఏముంది?
పేజీల నిండా అక్షరాలు, పదాలు, వాక్యాలు. పుస్తకం అంటే ఇదే కదా, ఇంతే కదా, ఇంకేముంటుంది? అనే సందేహం మనకు వస్తుంది. నిజమే ఈ పుస్తకంలో అన్ని పుస్తకాల మాదిరిగానే పేజీల నిండా అక్షరాలు పదాలు వాక్యాలు ఉన్నాయి. అయితే అక్షరాలు పదాలు వాక్యాలు నాటి కరుడుగట్టిన భూస్వామ్య వర్గ దోపిడీని, దుర్మార్గ సామాజిక అణిచివేతల తీవ్రతను మన కళ్లముందు ఆరబోస్తాయి.వాటికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పార్టీ మార్గ దర్శకత్వంలో,శ్రామికవర్గ ప్రజల భాగస్వామ్యంతో కామ్రేడ్‌ ఏలూరి నాయకత్వంలో సాగిన వీరోచిత వర్గ పోరాట వెల్లువను మనకు చేరవేస్తాయి.

ఏం తెలుసుకోవచ్చు?
1933వ సంవత్సరంలో నేలకొండపల్లి మండలంలోని ముఠాపురం గ్రామంలో జన్మించిన కామ్రేడ్‌ ఏలూరి ఎలా? ఎందుకు? కారేపల్లి మండలంలోని గాంధీనగరం గ్రామానికి చేరాడో, బీహార్‌లోని సమిస్తిపూర్‌లో జరిగిన మూడో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలకు హాజరై తిరుగు ప్రయాణంలో 1992 ఏప్రిల్‌ 25న ఎలా అమరుడైనాడో, 59 సంవత్సరాల కామ్రేడ్‌ ఏలూరి జీవనకాలంలోని వ్యక్తిగత ఉద్యమ జీవిత అనుభవాల సారాంశాన్ని ఈ పుస్తక అధ్యయనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తల్లి అత్త గారి ఇంటి ఆవరణలు ఏలూరుని ఎలా రణానికి పురిగొల్పాయో తెలుస్తుంది. 1950-51లలో ముఠాపురం కారేపల్లి తదితర గ్రామాలలో బాల సంఘాలను నిర్మించిన తీరును, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దళాలకు గెరిల్లాలకు సాయం చేసిన తీరును అవగాహన చేసుకోవచ్చు. ప్రజలను చైతన్యం చేసేందుకు సాయుధ పోరాట గాథలను బుర్రకథలుగా మలిచి గ్రామ గ్రామాన ప్రచారం చేసిన ఏలూరి కళాత్మక ఉద్యమస్ఫూర్తిని అందిపుచ్చుకోవచ్చు. బుర్రకథను మహా ప్రచార ఆయుధంగా మలిచి 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టుల గెలుపుకోసం ఏలూరి పడిన తపనను అర్థం చేసుకోవచ్చు.

వర్గ పోరాటాల ప్రతిబింబం
కామ్రేడ్‌ ఏలూరు లక్ష్మీనారాయణ తన జీవితకాలంలో నిర్వహించిన వర్గ పోరాటాల వెల్లువను ఈ పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. 1950- 60 సంవత్సరాల మధ్య గాదెపాడు గ్రామంలోని బడా భూస్వామి జనార్దన్‌ రెడ్డికి వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని, కామేపల్లి ఊట్కూరు తదితర గ్రామలలోని భూస్వామ్య దోపిడీకి, సామాజిక అణిచివేతలకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్ని ఈ పుస్తకం మన ముందుంచుతుంది. గార్ల, బయ్యారం, ఇల్లందు, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో జరిగిన ప్రజా ఉద్యమాల హోరును మనకు వివరిస్తుంది.టేకులపల్లి ఎన్నికల ప్రచారంలో నాటి కాంగ్రెస్‌ భూస్వామ్య గుండాలు కామ్రేడ్‌ ఏలూరుని చెట్టుకు కట్టేసి కర్రలతో కొడుతున్నప్పుడు తలపగిలి రక్తం కారుతున్నా గుండాల దాడిని విరోచితంగా తిప్పికొట్టిన తీరును, అలాగే అక్కడి ప్రజలు ఆయన్ను కాపాడుకున్న అరుదైన ఘటనను ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది.1964-68 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు ఉద్యమం అతివాద, మితవాద దాడులకు గురైనప్పుడు ఏలూరి సుందరయ్య బాటలో నడిచి సీపీఐ(ఎం)ను కంటికి రెప్పలా కాపాడుతూ, నికార్సైన నిర్మాణయోధుడిగా మారిన క్రమాన్ని ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.

వ్యక్తి సిద్ధాంతాల గతితార్కిక సంబంధ చర్చ
కమ్యునిస్టు ఉద్యమంలో, సామాజిక వ్యవస్థ మార్పు పోరాటాలలో సిద్ధాంత ప్రాధాన్యత, వ్యక్తి ప్రాధాన్యతల చర్చ ఎప్పుడూ ఉంటుంది. ఈ గతితార్కిక చర్చ కామ్రేడ్‌ ఏలూరి జీవితానుభవంలోనూ మనకు కనపడుతుంది. ఈ చర్చ ఈ పుస్తకంలో అంతర్లీన ప్రవాహంలా సాగుతుంది. కొత్తగూడెం సీపీఐ(ఎం) పార్టీ డివిజన్‌ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా కామ్రేడ్‌ ఏలూరి పార్టీని బలంగా నిర్మించాడు. మరోవైపు వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అఖిల భారత జాతీయ కౌన్సిల్‌ సభ్యులుగా కొనసాగుతూ భూమి, తునికాకు, పోడు భూముల హక్కులు, కూలి, సామాజిక పోరాటాలను నిర్వహించాడు. ఈ మొత్తం వర్గ పోరాటాల స్పూర్తిని ఈ పుస్తకం మనకు అందిస్తుంది. కామ్రేడ్‌ ఏలూరి అలాగే ఆయన జీవిత ఉద్యమ సహచరి కామ్రేడ్‌ జయమ్మ కమ్యూనిస్టు కార్యకర్తల పట్ల, వారి కుటుంబాల పట్ల చూపించిన అమితమైన ప్రేమ, ఆప్యాయతలు ఈ పుస్తకం నిండా మనకు కనిపిస్తాయి. కామ్రేడ్‌ ఏలూరి చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి రాజకీయ చైతన్యాన్ని అందించి వారిని కరుడుగట్టిన కమ్యూనిస్టులుగా మార్చిన క్రమాన్ని ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. మార్క్సిజం-లెనినిజం ఒక మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో, ఒక కమ్యూనిస్టు నాయకుడు తన శ్రామికవర్గ ప్రజలపైన, కార్యకర్తల పైన చూపించే ప్రేమ, ఆప్యాయత గౌరవాలు విప్లవ నమ్రత అంతే ప్రభావితం చేస్తుందనే విప్లవ సత్యాన్ని కామ్రేడ్‌ ఏలూరు జీవిత అనుభవం ఎలా నిరూపించిందో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది.

మార్క్సిజం లెనినిజం మాత్రమే సమాజాన్ని సరిగా విశ్లేషించగలదని, తరతరాల దోపిడీ నిర్మూలించగలదని, మనుషులంతా సంతోషంగా జీవించగల సోషలిజాన్ని నిర్మించగలదని కామ్రేడ్‌ ఏలూరి బలంగా నమ్మాడు. ఆ నమ్మకంతోనే చివరికంటా వర్గ పోరాట బాటసారిగా నడిచాడు. ఆ బాటసారి వర్గ పోరాట నడకను కామ్రేడ్‌ పి.సోమయ్య ‘ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏలూరు లక్ష్మీనారాయణ’ అనే పేరుమీద పుస్తకాన్ని రచించాడు. ఈ విశిష్టకృషి చేసిన కామ్రేడ్‌ పి.సోమయ్యకు విప్లవాభినందనలు తెలియజేద్దాం.
(కామ్రేడ్‌ ఏలూరి 34వ వర్ధంతి సందర్భంగా
నేడు ఖమ్మంలో పుస్తక ఆవిష్కరణ)

బండారు రమేష్‌
9490098251

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -