ఎల్‌నినో ప్రభావం వల్ల మొన్నటిదాకా ముఖం చాటేసిన వానలు.. ఇప్పుడు రాష్ట్రాన్ని తడిసి ముద్ద చేస్దున్నాయి. రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాధినేతలు మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలో వర్షాలు కురవకుండా ఉండాలి.. తద్వారా సర్కారు బదనాం కావాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కోరుకున్నట్టు, అందుకోసం తమిళనాడు వెళ్లి మళ్లీ తాంత్రిక, క్షుద్రపూజలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. ఈ అంశం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. సరే… ఈ అంశాన్ని కాసేపు పక్కనబెడితే, ఇప్పుడు తెలంగాణలో ముమ్మరంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతుల సమస్యలు పూర్తిగా తీరినట్టేనా? సాగు పరిస్థితి బాగైనట్టేనా? అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదంటున్నారు వ్యవసాయ నిపుణలు, రైతు నేతలు. వాస్తవ పరిస్థితులు, గణాంకాలు ఇదే విషయా న్ని తేటతెల్లం చేస్తున్నాయి. ప్రకృతి కరుణిం చక పోవటంతోపాటు కల్తీ విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరలు లేకపోవటం, మధ్య దళారీలు రాజ్యమేలటం తదితరాం శాలు అన్నదాతను కుదేలు చేస్తున్నాయి. ఎల్‌నినో కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు 9.46 మీటర్లకు పడిపోయాయి. చెరువులు, కుంటలలోకి తగినంత నీరు రాలేదు.
ప్రధాన ప్రాజెక్టు శ్రీరాంసాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, కడెం ప్రాజెక్టుతోపాటు 38 మధ్య తరహా ప్రాజెక్టులకు నీరు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో కారణంగా మెట్ట పంటలు వేయాలని ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటిని ఎత్తిపోయాలని ప్రతిపక్షపార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వ లేనందున (94మీటర్లు) కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపులు పనిచేయవని ప్రభుత్వం చెబుతోంది. అవకాశం ఉన్న మేరకు కాళేశ్వరం నీటిని వాడుకోవాలి. 2015 నుండి 2018 వరకు కరువుల వల్ల యేటా ఆరు వేలకోట్ల రూపాయల పంటనష్టం వాటిల్లిం దన్నని నిపుణుల అంచనా. వాస్తవానికి 2018 నుండి 2025 వరకు అతివర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పటికీ వరి పంట విస్తారంగా పడింది. యాసంగి వానాకాలం కలిపి వరి పంట 140 లక్షల ఎకరాలు సాగుచేయగా 2.85 కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయ్యింది. కానీ, 2026 ఎల్‌నినో కారణం గా వరి పంటలకు తగినంత నీరు లేదని వాతావరణ శాఖ చెబుతున్నది. మహా రాష్ట్రలో కురిసిన వర్షాలకు శ్రీశైలం లోకి, శ్రీరాం సాగర్‌లోకి కొంత నీరు వచ్చిన మాట నిజమే అయినా వర్షాల కోసం ఇంకా రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాగా ప్రభుత్వం మాత్రం ముతకధాన్యాలు, చిరుధాన్యాలు వేయాలంటూ చెప్పటం గమనార్హం.
మరోవైపు వానాకాలం తొలకరి సాగు కాకముందే కొన్ని విత్తన కంపెనీలు తప్పుడు బ్రాండ్‌లతో విత్తనాలను విస్తృత ప్రచారం చేసి అమ్మకాలు సాగిస్తున్నాయి. విత్తనాలపై ధృవీకరణ సర్టిఫికెట్ లేకుండానే విత్తనాలను అమ్మారు. ధరలు పెంచారు. వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేదు. వ్యవసాయ కమిషనరేట్ గత దశాబ్ధకాలంగా విత్తనాల అమ్మకంలో జరుగుతున్న లోపాలపై చర్యలు తీసుకోవడం లేదు. వందల క్వింటాళ్లు కల్తీ విత్తనాలు పట్టుబడ్డా కమిషనరేట్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం శోచనీయం. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు తమ సిబ్బందితో మంచి విత్తనాలను సరఫరా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. కాగా కేంద్ర ప్రభుత్వం జూన్ చివరి వారంలో మద్ధతు ధరలు ప్రకటించింది. కానీ, అవి 2026 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. అందువల్ల, ప్రస్తుతం పాత ధరలకే పంటలను కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవనే సాకుతో మద్య దళారులు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
ఐకెపి, సహకార సంఘాలు, మిల్లర్లు, సివిల్ సప్లైశాఖ, మార్క్‌ఫెడ్ శాఖలు రైతుల నుండి కొనుగోలు చేసే సందర్భంలో మోసాలకు పాల్పడుతున్నాయి. మరో వైపు నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంతో అన్నదాతకు నష్టం చేకూర్చటం పరిపాటిగా మారింది. వాస్తవానికి మధ్య దళారీలను తొలగించి కనీస మద్ధతు ధరలకు కొనుగోలు చేయడానికి విధి విధానాలను రూపొం దించాల్సిన సర్కారు అందుకు భిన్నంగా మిన్నకుండి పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రాజెక్టులు నిండాయని చెప్పి, సంబరపడిపోతే సరిపోతుందా? అనే ప్రశ్న ఉదయించకమానదు. అందువల్ల అన్నదాతను అన్ని రకాలుగా ఆదుకునేందుకు సర్కారు సన్నద్ధం కావాలి.
ప్రాజెక్టులు నిండగానే పండగకాదు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



