Wednesday, August 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజెన్‌-‌జీ రాసిన కొత్త రాజకీయ పాఠం

జెన్‌-‌జీ రాసిన కొత్త రాజకీయ పాఠం

- Advertisement -

ఈ ఏడాది మే 15న నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆవిర్భ వించి ఉండవచ్చు. అయితే కొద్ది నెలల్లోనే అది ఊహించని రీతిలో జాతీయ రాజకీయాల్లోచర్చనీయాంశంగా మారింది. ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై అభిజిత్ దీప్కే మరుసటి రోజే ‘‘బొద్దింకలన్నీ ఒక్కటైతే ఏమవుతుంది?’’ అంటూ చేసిన చమత్కార వ్యాఖ్యకు విశేష స్పందన లభించింది. అనంతరం వ్యంగ్యాత్మక ‘కాక్రోచ్ జనతా పార్టీ’లో చేరదలిచిన వారి కోసం ఆయన ఒక ఆన్‌లైన్ ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. తొలి 24 గంటల్లోనే దానికి యాభైవేల మంది స్పందించగా, కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య లక్షలకు చేరింది. ఢిల్లీలో నిరసనలకు అనుమతి ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో జంతర్‌మంతర్ ఒకటి. ప్రారంభంలో సీజేపీ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నా, క్రమంగా అది పెరిగింది. అనంతరం సీజేపీతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 20న ‘పార్లమెంట్ మార్చ్’కు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు, పెల్లెట్ గన్స్ వినియోగంతో సహా తీవ్ర బలప్రయోగానికి దిగారు. జంతర్‌మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, మెట్రో సర్వీసులను నిలిపేయడం ద్వారా నిరసనకారులను ఒంటరి చేయవచ్చని వారు భావించారు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది.

సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు వెల్లువెత్తడంతో పోలీసుల చర్యలు దేశవ్యాప్తంగా క్షణాల్లో చేరాయి. నేమ్‌ప్లేట్లు కూడా లేని పోలీసులు యువ విద్యార్థులు, యువకులు, యువతు లపై ప్రయోగించిన హింసను ఆ పోస్టులు స్పష్టంగా చూపించాయి. యూనిఫాం లేని పోలీసులు లేదా పోలీసులతో కలిసి పనిచేస్తున్న వ్యక్తులు కూడా దాడుల్లో పాల్గొన్నట్లు కనిపించింది. ఎలాంటి రెచ్చగొట్టింపు లేకుండానే ఒక సీనియర్ పోలీసు అధికారి యువతిపై దాడి చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఉద్యమం జంతర్‌మంతర్‌కే పరిమితం కాకుండా, ఇంటర్నెట్‌లోని వర్చువల్ ప్రపంచంలోనూ ప్రత్యక్షంగా కొనసాగింది.పోలీసులు అధిక బలప్రయోగంతో విద్యార్థులను, యువతను చెదరగొట్టేందుకు ప్రయత్నించడం ప్రభుత్వాలకు కొత్త విషయం కాదు. కొన్ని సందర్భాల్లో అది ఫలిస్తుంది, మరికొన్ని సందర్భాల్లో విఫలమవుతుంది. ఈసారి మాత్రం అది పూర్తిగా బెడిసికొట్టింది. జంతర్‌మంతర్‌కు మరింత మంది తరలిరావడమే కాకుండా, దేశవ్యాప్తంగా నిరసనలకు ఊపు నిచ్చింది. త్వరలోనే బీహార్, ఉత్తరప్రదేశ్, ముంబై, కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసనలు వ్యక్తమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. దీంతో ఇది ఢిల్లీలోని కొద్దిమంది విద్యార్థుల డిమాండ్‌గా కాకుండా, దేశవ్యాప్తంగా యువత గొంతుకగా మారింది. ఫలితంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే విషయంలో మోడీ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని కోల్పోయింది.

వార్తలపై ఎవరి ఆధిపత్యం?
చాలావరకు పత్రికలు, టెలివిజన్ వార్తల అజెండాను ప్రభుత్వాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రభావితం చేయగలుగుతాయి. స్వాతంత్ర్యం తర్వాత వార్తాపత్రి కలను ‘జూట్ ప్రెస్’ అని పిలిచిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అప్పటి ప్రధాన పత్రికా సంస్థలు జూట్ వ్యాపారులైన బిర్లాలు, దాల్మియాలు, సాహు జైన్లు తదితర పారిశ్రామికవేత్తల పెట్టుబడులతో ఏర్పడ్డాయి. ఫలితంగా ఏది వార్త కావాలి, ముఖ్యంగా కార్మికుల సమ్మెల వంటి అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది వారు గణనీయంగా ప్రభావితం చేయగలిగారు. భారత్‌లో రేడియోపై ప్రభుత్వ నియంత్రణ ఉండటానికి మరో కారణం, ఇతర దేశాల మాదిరిగా అది పూర్తిగా వ్యాపారీకరణ చెందకపోవడమే. అరవై, డెబ్భయ్యవ దశకాలను గుర్తుంచు కున్న వారికి రేడియో సిలోన్ గుర్తుండే ఉంటుంది. హిందీ సినీ పాటలను ప్రసారం చేస్తూ అది విస్తృత శ్రోతలను సంపాదిం చడంతో పాటు ప్రకటనల ఆదాయంలోనూ పెద్ద వాటాను దక్కించు కుంది. అనంతరం 1980–90 దశకాల్లో ఆర్థిక ఉదారీకరణతో టెలివిజన్ వేగంగా వ్యాపారీకరణ చెందింది.

ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ చాలా వరకు వార్తల అజెండాను నియంత్రించగలిగారు. అయితే ఈసారి పరిస్థితి ఎందుకు మారింది? మొదటిది… దాదాపు అన్ని ప్రధాన ప్రవేశ, నియామక పరీక్షలను కేంద్రం పరిధిలోకి తీసుకు రావడంతో విద్యా వ్యవస్థలో ఒకే వైఫల్య కేంద్రం (సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్) ఏర్పడిందనే అసంతృప్తి పెరిగింది. రెండోది… నీట్ మాత్రమే కాకుండా అనేక ఇతర పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా వరుసగా లీక్ కావడం. అంచనాల ప్రకారం గత పదేండ్లలో నీట్, ఐఐటీ-జేఈఈ, వివిధ రాష్ట్ర నియామక పరీక్షలతో కలిపి దాదాపు 150 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దీన్ని మరింత తీవ్రమైన సమస్యగా మార్చింది ప్రభుత్వ జవాబుదారీతనం లేకపోవడమే. లీకేజీలపై బాధ్యులపై చర్యలు తీసుకోవడం బదులు, ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటకు రావడం వల్ల విద్యార్థులకు సిద్ధం కావడానికి ఎక్కువ సమయం దొరికిందని, అది వారికి ఉపయోగపడిందని ఒక కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టంచేసింది.ఈసారి నిరసనల్లో కనిపించిన మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ తరం విద్యార్థులు భౌతిక ప్రపంచంలోనే కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ సమర్థంగా సమీకృతమ య్యారు. యువతకు, విద్యార్థులకు నిరంతరం నీతులు చెప్పే ప్రభుత్వం, తన సొంత వైఫల్యాలకు మాత్రం బాధ్యత వహించకపోవడం పట్ల యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

మారుతున్న వార్తల స్వరూపం
‘జెన్ జీ’ లేదా మిల్లెనియల్స్ తర్వాతి తరం పూర్తిస్థాయి డిజిటల్ తరం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన మా తరం ‘బేబీ బూమర్స్’, ఆ తర్వాత వచ్చిన మిల్లెనియల్స్‌తో పోలిస్తే జెన్ జీ పూర్తిగా భిన్నమైన సమాచార ప్రపంచంలో పెరిగింది. బూమర్స్ వార్తల కోసం ప్రధానంగా వార్తాపత్రికలపై ఆధారపడే వారు. మిల్లెనియల్స్ టెలివిజన్‌ను ప్రధాన సమాచార వనరుగా మలుచుకున్నారు. ప్రధాన టీవీ ఛానళ్లలో రాత్రి తొమ్మిది గంటల వార్తల్లో ఏది ప్రధానంగా ప్రసారమైతే, అదే మరుసటి రోజు వార్తాపత్రికల ప్రధాన శీర్షికగా మారేది. మా బూమర్స్ తరానికి రోజు ప్రారంభం ప్రముఖ పత్రికల మొదటి పేజీ వార్తలతోనే అయ్యేది. భారతదేశంలో రేడియో ఇతర దేశాల్లో మాదిరిగా పెద్ద పాత్ర పోషించలేదు. ఎందుకంటే దానిని చాలామంది ప్రభుత్వ గొంతుకగానే భావించేవారు. అయినప్పటికీ అరవై, డెబ్బై దశకాల్లో ప్రతి సాయంత్రం తొమ్మిది గంటల రేడియో వార్తలను క్రమం తప్పకుండా వినడం మా తల్లిదండ్రుల తరం దైనందిన అలవాటుగా ఉండేది. నేడు వార్తలను పత్రికలు లేదా టెలివిజన్ మాత్రమే నిర్ణయించడం లేదు. సోషల్ మీడియానే వార్తల ప్రవాహాన్ని ఎక్కువగా నిర్దేశిస్తోంది. ఏది వైరల్ అవుతుందో అదే వార్తగా మారుతోంది. ఏ అంశానికి ప్రాధాన్యం దక్కాలనేది ప్లాట్‌ఫారమ్‌ల కంటే వాటిని ఉపయోగించే ప్రజలే ఎక్కువగా నిర్ణయిస్తున్నారు. అల్గారిథమ్‌ల ద్వారా ప్లాట్‌ఫారమ్‌లు కొంతవరకు నియంత్రించగలిగినా, వేలాది మంది ఒకే అంశంపై ఒకేసారి పోస్టులు, ట్వీట్లు, రీల్స్ చేస్తే వాటిని పూర్తిగా అడ్డుకోవడం కష్టం.

డిజిటల్ మీడియా కూడా ప్రధానంగా ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడుతుంది. అందువల్ల ఎక్కువ వీక్షణలు, ఎక్కువ స్పందన తెచ్చే కంటెంట్‌కే అల్గారిథమ్‌లు ప్రాధాన్యం ఇస్తాయి. ఫలితంగా వైరల్ అయ్యే అంశాలే ప్రజల ముందుకు ఎక్కువగా వస్తుంటాయి. సీజేపీ ఉద్యమం సాధించిన విజయం కేవలం తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించేలా చేయడమే కాదు. ప్రభుత్వం తన వైఫల్యాలకు బాధ్యత వహించే పరిస్థితి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమైన విజయం. కీలక అంశంలో విఫలమైతే సంబంధిత మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలనే ప్రజాస్వామ్య సంప్రదా యాన్ని మోడీ ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. గతంలో ఒక పెద్ద రైలు ప్రమాదం అనంతరం రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత స్వీకరించి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అలాంటి రాజకీయ నైతికత కనిపించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత స్వీకరించే బదులు వాటిని స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై నెట్టే ధోరణి కొనసాగుతోంది.

ఆశ నింపిన కొత్త తరం
గత కొన్ని వారాలుగా ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చిన ఈ తరం, భారత రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని కేంద్రస్థానానికి తీసుకొచ్చింది. ప్రస్తుత వాస్తవాలను తమ అనుభవాల ద్వారా అర్థం చేసుకున్న ఈ యువత, ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ పెద్ద సంఖ్యలో సమీకృతమై ‘తొలి పరీక్ష’లోనే తన సత్తా చాటింది. తమ వయస్సుకు మించిన పరిణతిని ప్రదర్శించింది. తీవ్రమైన రెచ్చగొట్టింపులు ఎదురైనా వారు సంయమనం కోల్పోలేదు. పోలీసులు ఎలాంటి బలప్రయోగానికి దిగినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ‘‘రాజకీయాలకు దూరమైన తరం’’గా చాలామంది కొట్టిపారేసిన యువతే వేలాదిమందిని ఉద్యమంలోకి ఆకర్షించింది. వారు సాంప్రదాయ రాజకీయ పరిభాషను ఉపయోగించక పోయినా, తమదైన భాషలో, తమదైన పద్ధతిలో రాజకీయ చైతన్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో యువతులు ముందువరుసలో నిలిచి, పోలీసు వాహనాలను అడ్డుకోవడమే కాకుండా లాఠీచార్జీలను కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. చివరిగా ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటు న్నాను. ఈ కాలాలలో నేను ఇంతకుముందే రాశాను. సత్యంతో పాటు వామపక్షాలకు ఉన్న ప్రధాన బలం సమాజంలో నిజంగా ఏమి జరుగుతుందో విశ్లేషించే సామర్థ్యం, గతాన్ని వర్తమానంతో అనుసంధానించి అర్థం చేసుకునే దృష్టి, అలాగే హాస్యచతురత. అయితే ఇవన్నీ ఆచరణ అనే గీటురాయిపై, మన జీవిత అనుభవాల ద్వారానే పరీక్షించబడాలి. జెన్‌ జీకి ఈ ఉద్యమం, అందులో వారు పొందిన అనుభవం రాజకీయ శాస్త్రంపై ఎన్ని ఉపన్యాసాలు విన్నా లభించని పాఠాలను నేర్పింది. నా తరం తరఫున చెప్పాలంటే, ఇప్పుడు కొత్త తరం ఈ బాధ్యతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతుండటం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.

ప్రబీర్‌ పురకాయస్త

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -