– గెలుపు ఓటములను నిర్ణయించేది వీరే.. ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల పాట్లు
నవతెలంగాణ- మిర్యాలగూడ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో మహిళ, యువకుల ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవిత వీరిపైనే ఆధారపడి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మహిళలు, యువకుల ఓట్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. వీరిని ఆకర్షించేందుకు నేతలు పడరాని పాటుపడుతున్నారు. ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో మహిళా ఓట్లు అధికంగా ఉండగా, అన్ని నియోజకవర్గాల్లోనూ 18 నుంచి 39 ఏండ్ల వయస్సు గల యువకుల ఓట్లు అధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానూ మహిళలు, యువకులనే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలు ప్రకటించాయి.
అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ప్రతినెలా 3వేలు జీవనభృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాల సమైక్యలన్నింటికీ సొంత భవనాల నిర్మాణం వంటి హామీలు బీఆర్‌ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకూ ప్రతినెలా రూ.2500 ఇస్తామని, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగాలు లేక.. వచ్చిన నోటిఫికేషన్ వాయిదా పడి తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ అడుగులు వేస్తుండగా.. అధికార బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నిత్యం వారితో మాట్లాడుతూ అందుబాటులో ఉండేందుకు 100 ఓట్లకు ఒక ఇన్‌చార్జీని నియమించింది. వారు కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టిసారించి ఆకర్షించే యత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ యువకులు ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. నల్లగొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, భువనగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా హుజూర్‌నగర్‌లో లక్షా 24 వేల 30 ఓట్లు మహిళలవి ఉన్నాయి. అత్యల్పంగా మిర్యాలగూడలో 1,14,434 ఓట్లు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ యువకుల ఓట్లు అధికంగా ఉండగా.. ఇందులో ప్రధానంగా దేవరకొండలో 1,31,108 ఓట్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో 1,27,021 ఓట్లతో కోదాడ ఉన్నది. అత్యల్పంగా భువనగిరి నియోజవర్గంలో 1,09,619 యువకుల ఓట్లు ఉన్నాయి.