మన జీవితంలో కొన్ని విషయాలలో అవి నిజమని తెలిసినా సరే ఒక్కోసారి వాటిని అంగీకరించలేం. మన పొరపాట్లు ఉన్నా ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లోనూ ఇలాంటి వాస్తవాలు కొన్నుంటాయి. వాటిని అంగీకరించినప్పుడే కెరీర్‌లో రాణించడం సాధ్యమవుతుంది. కష్టేఫలి అన్నారు కదా పెద్దలు. అంటే ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఫలితం ఉంటుందని దీని అర్థం. అయితే కొన్ని సార్లు వృత్తి ఉద్యోగాల్లో మనం శక్తి వంచన లేకుండా పని చేసినా ఆశించనిన ఫలితం దక్కకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎంతగా రియలైజైతే అంత మంచిది. అప్పుడే పని మన దృష్టి మరలకుండా జాగ్రత్తపడవచ్చు.
దానికి ఫలితం ఇప్పుడు దక్కకపోయినా కొంతకాలం తర్వాతైనా మీ పనితీరును సంస్థ గుర్తిస్తుంది. ఏ ఉద్యోగమూ శాశ్వతం కాదు. మన పనితీరు ఉత్తమంగా ఉన్నా కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల ఉద్యోగం కోల్పోవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ముందు నుంచే సిద్ధంగా ఉండాలి. అలాగే మీ నెట్‌వర్క్‌ను పెంచుకోవడంతో పాటు నైపుణ్యాలూ మెరుగుపరచుకోవడం వల్ల కెరీర్‌లో మంచి అవకాశాల్ని పొందవచ్చు.
కొంత మంది తమ ఉన్నత చదువులు, తాము పొందిన డిగ్రీలు చూసుకొని మురిసిపోతుంటారు. అవే తమకు మంచి ఉద్యోగం సంపాదించి పెడతాయనుకుంటారు. కానీ ఈ ఏఐ యుగంలో డిగ్రీల కంటే ప్రతిభ, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తోన్న రోజులివి. ఉన్నత చదువులు చదవకపోయినా కొంతమంది కొన్ని సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉండడం.. అదే పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వాళ్లు తక్కువ స్థాయి ఉద్యోగాల్లో కొనసాగడం చూస్తుంటాం. అలాగని ఉన్నత చదువులు చదవకూడదని కాదు.. వాటితో పాటు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆయా నైపుణ్యాలు కూడా మెరుగుపరచుకున్నప్పుడే మనం ఎంచుకున్న కెరీర్‌లో ముందుకు సాగగలం.
నచ్చిన ఉద్యోగం, చేసే పనిలో సౌకర్యం, హ్యాపీగా పని చేసుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అయితే అన్ని వేళలా పనిని ప్రేమించడం, అంతిమంగా చక్కటి ఉత్పాదకతను సంస్థకు అందించడం కుదరకపోవచ్చు. ఈ విషయాన్ని అంగీకరించలేకపోవడం వల్ల కూడా కొంతమంది ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ ఇలాంటి ఒత్తిడి వల్ల అటు ఆరోగ్యానికి నష్టం.. ఇటు పనిపైనా దృష్టి పెట్టలేం. కాబట్టి పని చేయడం కష్టంగా ఉందనిపించినప్పుడు విరామం తీసుకోవడమే మంచిది. పై అధికారుల అనుమతితో కొన్ని రోజుల పాటు సెలవు తీసుకుని నచ్చిన ప్రదేశానికి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. తద్వారా ఒత్తిడిని దూరం చేసుకొని రీఛార్జ్ అవ్వచ్చు. ఆపై తిరిగి పనిపై పూర్తి దృష్టి పెట్టచ్చు. కెరీర్ అభివృద్ధికి ఇదీ సోపానమే.
ప్రతిభ, నైపుణ్యాలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. వీటిని ఎవరు అందిపుచ్చుకుంటే వారే అభివృద్ధి సాధిస్తారు. అయితే ఈ వాస్తవాన్ని కొందరు జీర్ణించుకోలేరు. ‘మాలాగా ఎవరూ పని చేయలేరు. సంస్థకు మా అవసరం చాలా ఉంది’ అంటూ గొప్పలకు పోతుంటారు. పని ప్రదేశంలో ఈ అహంభావం పనికి రాదు. మీకు తగిన ఉద్యోగం మీరెలా వెతుక్కోగలుగుతారో.. అలాగే సంస్థ కూడా తమ అవసరాలకు తగిన ఉద్యోగిని నియమించుకోగలదు. కాబట్టి ఇలాంటి అనవసర విషయాలు పక్కన పెట్టి మీ నైపుణ్యాల్ని పెంచుకోండి. కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకోండి. అప్పుడే కెరీర్‌లో మీకు తిరుగుండదు.
కష్టేఫలి
- Advertisement -
- Advertisement -



