Sunday, April 26, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీమేడే స్ఫూర్తి - నేటి వాస్తవాలు

మేడే స్ఫూర్తి – నేటి వాస్తవాలు

- Advertisement -

సరిగ్గా 140 ఏళ్ల క్రితం, అమెరికాలోని చికాగో నగరంలో ఏ హక్కుల కోసమైతే కార్మిక పోరాటాలు జరిగి కొందరి ప్రాణాల బలి దానాలు జరిగాయో అవే హక్కుల కోసం మళ్ళీ అదే వర్కర్లు రోడ్డెక్కి నినాదాలు చేయడం,నిలువెత్తు ప్రాణాలను పణంగా పెట్టడం నేడు జరుగుతుంది. ఇది యాదచ్చికం కాదు. కార్మికులు తమ పోరాట పంథాను కొనసాగించలేక పోయారని చెప్పలేం కానీ బలవంతులు అతి బలవంతులుగా ఎదిగిన పెట్టుబడిదారులు 140 ఏళ్ల క్రితం కన్నా ఎక్కువ ఆర్థిక, అధికారబలంతో స్థిరపడుతున్నారు. అందుకే కార్మికవర్గం మేలుకోకపోతే ఇప్పుడున్న ఈ మాత్రం స్థితిగతుల నుండి మరింత బలహీనపడి ఒక రకమైన బానిసత్వంలోకి వెళ్లే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను జరుపుకోవడానికి కార్మికులంతా సిద్ధమవుతున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పతాకాన్ని ఎగురవేసినప్పుడు ఆ పతాకపు నీడలో, ఆ పతాకం సాధించిపెట్టిన హక్కులు ఉన్నాయా లేవా అని ప్రశ్నించుకుంటే, సుస్పష్టంగా లేవు అనేదే సమాధానం.

ఏప్రిల్‌ 11 తారీకు నుండి దేశ రాజధాని సమీపంలో గల గురుగామ్‌, నోయిడా ప్రాంతాలలో వివిధ రకాల పరిశ్రమలకు సంబంధించిన వర్కర్లు రోడ్లపైకి వచ్చి పోరాటాలు సాగిస్తున్నారు. యూనియన్లకు అతీతంగా సాగుతోంది ఇది. వారి ప్రధాన డిమాండ్లు చూస్తే, కనీస వేతనం 18,000 గా ఉండాలని, పని గంటలు రోజుకు ఎనిమిది గంటలే ఉండాలని కోరుతున్నారు. సుస్పష్టంగా ఈ ఎనిమిది గంటల పనిదినం కోసమే కదా 1885 వ సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో తమ రక్తాన్ని ధారపోసి పాలకుల, పెట్టుబడిదారుల గుండెల్లో ఎర్ర జెండా పాతింది. ఆ రోజుల్లో నిరక్షరాస్యత ఎక్కువ ప్రశ్నించే తత్వం తక్కువ అనేక రాజ్యాల రాజరిక వ్యవస్థలు ఉండేవి. అందుచేతనే రాజు దైవాంశ సంభూతుడిగా భావించే వారు. అలా నాగరికత అంతంత మాత్రమే అభివద్ధి చెంది కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏ మాత్రం అందుబాటులో లేక వైద్య సదుపాయాలు ఏ మాత్రం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలంతా మూఢనమ్మకాలతో తమ ఆరోగ్య స్థితి గతులపై ఆశలు పెట్టుకోవడం, ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపై తమ కుటుంబాన్ని పోషించుకోవడం, వంటి పరిస్థితులు ఉండేవి. అందుచేతనే ప్రజలను బానిసలుగా భావించి ఇష్టారీతిన వారి నుండి పని పొందే పరిస్థితులు ఉండేవి. అందుచేతనే తిరగబడడానికి ప్రజలకు చాలా సమయం పట్టింది. అదే సమయంలో అప్పటి ప్రభుత్వాలు కూడా కాస్త ఆలస్యమైనా, పునరాలోచనలో పడి కార్మికుల హక్కులకు తలొగ్గక తప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితులను మళ్ళీ పునరావతం చేస్తున్నారు. సమాధానం చాలా సులభం. లాభాలు రావాలంటే వర్కర్లకు తక్కువ చెల్లించాలి. వర్కర్ల నుండి నిరసనలు వెల్లువెత్తుతే ప్రభుత్వాల అండ తీసుకోవాలి. అదే సందర్భంలో మానవ వనరులు అధికంగా ఉన్నచోట వర్కర్లను విభజించి పాలించవచ్చు. అన్న సూత్రాన్ని అమలుపరచాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు కాబట్టే పెట్టుబడిదారులు కార్మికులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు అందుచేతనే దేశంలో ని 10 మంది చేతుల్లో 21% సంపద 1% జనాభా చేతిలో 58% దేశ సంపద పొగౌతూ క్రింది 50% ప్రజల దగ్గర కేవలం 12% సంపద మాత్రమే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటప్పుడు మేడే స్ఫూర్తి ప్రశ్నార్థకం కాక ఏమవుతుంది?



సంఘటితమైన పని పద్ధతులు ఉండాలని మేడే స్ఫూర్తి సూచిస్తుంటే దేశంలో ఇప్పటికే దాదాపు 77% కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నది. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్లకు లభించే వేతనాలు 30 శాతానికి పైగా మధ్యవర్తిత్వ కాంట్రాక్టర్లు ఏజెన్సీలు దండుకుంటున్నాయి. 2025 సంవత్సరంలో 58.2% కాంట్రాక్టు వర్కర్లకు రాత పూర్వక నియామక పత్రాలు లేవు. 51.7% మందికి సాంఘిక భద్రతకి అర్హతనే లేదని చెప్పారు. అంతే కాకుండా 47.3% మందికి వేతనంతో కూడిన సెలవు కూడా ఇవ్వలేదు. అంతే కాకుండా, నిరసనలు జరుగుతున్న గౌతమ బుద్ధా నగరంగా పిలవబడు నోయిడా ప్రాంతంలో 67.8% మందికి రాత పూర్వక కాంట్రాక్టు పత్రాలు లేవు. 62.4% మందిని వేతనంతో కూడిన సెలవుకి అనర్హులుగా ప్రకటించారు. సగటున బీహార్‌, ఛత్తీస్‌ఘర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 46.3% మందికి పైన తెలిపిన ఏ రక్షణలూ లేవు.

ప్రభుత్వం తమ బాధ్యతల నుండి తప్పుకుని యాజమాన్యాలకు ఫ్రీ హ్యాండ్‌ కల్పించడంతో కాంటాక్ట్‌లతో యాజమాన్యాలు వర్కర్లకు అన్యాయం చేస్తున్నాయి. యాజమాన్యాలు మరింత భారం తగ్గించుకోవడానికి సులువుగా ఉండటం కోసం గత 100 సంవత్సరాలలో కార్మికులందరూ ఐక్యంగా పోరాడి సాధించుకున్న 29 కేంద్ర కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తయారుచేసి ఐదారు సంవత్సరాలు వేచి చూసి ఓక్కసారిగా దొంగ దెబ్బకొడుతూ గత సంవత్సరం నవంబర్‌ 22 న లేబర్‌ కోడ్‌లను నోటిఫై చేస్తూ ఈ ఏప్రిల్‌ 1 నుండి అమలుకు పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే అదునుగా యాజమాన్యాలు తమ ఇష్టారీతిన పని గంటలను పెంచేసుకున్నాయి. నియామకాలను ఇష్టారీతిన తక్కువ కాలానికి లేదా అవసరమున్న సందర్భానికి నియమించుకొని వర్కర్ల భవిష్యత్తు పై ఎలాంటి హామీలు ఇవ్వకుండా పబ్బం గడుపుకుంటున్నాయి. ఇలాంటివి మేడే స్ఫూర్తికి కచ్చితంగా వ్యతిరేకమైనవి.


మేడే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగి కార్మికులకు చాలా వరకు విముక్తి కలిగించాయి అయితే రష్యా విప్లవ నాయకుడు లెనిన్‌ ఆధ్వర్యంలో జరిగిన రష్యా విప్లవం విజయం సాధించిన అనంతరం కార్మిక హక్కులకు కార్మిక సంఘాల ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయి అందుచేతనే 1926 నుండి అనేక దేశాలు, భారతదేశంలో కూడా కార్మిక హక్కులకు సంబంధించిన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఆ చట్టాలన్నీ మటు మాయం అయిపోయి లేబర్‌ కోడ్‌లలో కలిసిపోయి కార్మికులకు రక్షణ లేకుండా తయారయ్యాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన పరిపాలన వ్యవస్థపై రాజకీయాలు పూర్తి ఆధిపత్యాన్ని తెచ్చుకోవడమే. అలాంటి ఆధిపత్యం లభించడానికి పెట్టుబడిదారులు బూర్జువా రాజకీయ నాయకులను ప్రోత్సహించి తమ అనుకూల ప్రభుత్వాలను అన్నిచోట్ల నెలకొల్పుకోవడం జరుగుతుంది. ప్రజలను యాజమాన్యాల అండతో డబ్బు ఇతరత్రా ప్రలోబాలు పెట్టో ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన తర్వాత యాజమాన్యాలకు మరింత లాభాలు వచ్చే నిర్ణయాలను రాజకీయాలు నెరపుతున్నాయి ఈ క్రమంలో హక్కులమాట భూస్థాపితమై పోతున్నది.
హక్కులపై ఏ మేరకు దాష్టీకం జరుగుతుందో గత సంవత్సరం శాంసంగ్‌ ఇండిస్టీలో కాలకత్యాలు తీర్చుకోవడానికి కూడా వర్కర్లకు నిర్ణీత సమయాన్ని విధించిన సంఘటన మనకు తెలుస్తున్నది. ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు కాలకత్యాలకు సమయం కేటాయిస్తే జీతంలో కోతలు విధించాలని యాజమాన్యం షరతు పెట్టింది. ఈ రోజుల్లో స్ట్రక్చర్డ్‌ ఎంప్లాయ్మెంట్‌ నిర్ధారిత పని నిర్దేశిత ప్రాంతాల్లో చేసి పద్దతులు తగ్గిపోతున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకొని అకస్మాత్తుగా తొలగించడం యజమాన్యాల ఇష్టానుసారంగా వేతన చెల్లింపులు చేయడం ఏ ఉద్యోగికి ఎంత వేతనం ఏ పనికి చెల్లించబడుతుందో కనీసం పక్కవాడికి కూడా తెలియనంత రహస్య మంతనాలు చేయడం పరిపాటిగా మారింది. 1929లో ఆర్థిక వేత్తకిన్స్‌ ‘పీస్‌రేట్‌ సిస్టమ్‌’ నిర్దేశిత పనికి నిర్ణయించిన ధర లేదా వేతనం చెల్లించే పద్ధతిని సూచిస్తే అది తిరస్కారానికి గురైంది. కానీ ఇప్పుడు అది విరివిగా అమల్లోకి వస్తున్నది. అంతే కాకుండా ఫలానా పనికి ఫలానా వేతనం అనగా వేతనాలు జాబ్‌ స్పెసిఫిక్‌గా చెల్లించబడుతున్నాయి. దీనిద్వారా వర్కర్లందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి ఏ పనులు చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. అందుచేతనే యాజమాన్యాలు మరింత దోపిడి చేయడానికి ఇది అవకాశంగా మారింది. దీన్ని వ్యతిరేకించడానికి వర్కర్లకు అవకాశాలు సన్నగిల్లాయి. మరో అంశం ఏమంటే సంఘటిత రంగాలు రాను రాను కుచించుకుపోతున్నాయి సంఘటిత రంగాలలో ప్రధాన భూమిక పోషించిన ప్రభుత్వ రంగాలు మెల్ల మెల్లగా అంతరించిపోతున్నాయి. అందుచేతనే సంఘటిత ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇలాంటప్పుడు ఉద్యోగులను సంఘటితపరచడం కూడా అసాధ్యంగా మారిపోతున్నది. దీంతో సంఘటిత రంగాలలో కూడా సమగ్రమైన పోరాటాలు జరగడానికి అవకాశాలు లేకుండా పోయాయి. లేబర్‌ కోడ్‌ల అమలు తర్వాత ప్రభుత్వ పాత్ర కేవలం ఫెసిలిటేటర్‌ స్థాయికి తగ్గించుకున్న అందువల్ల యజమాన్యాలు వర్కర్ల సమస్యల పట్ల ఇష్టారీతిగా ప్రవర్తించే అవకాశం దొరకడంతో వర్కర్లు పోరాటాలకు దిగే అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

అయితే కార్మిక హక్కులను చిన్నచూపు చూడటం భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ప్రపంచీకరణ అనంతరం పెట్టుబడి ప్రపంచ వ్యాప్తమైపోయిన తర్వాత దాని విధానాలు కూడా అన్నిచోట్ల ఒకేలా వర్కర్లను సాధించేవిగా ఉన్నవి. అందుచేతనే గతంలో కంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్త వలసల్లో సానుకూల పరిస్థితులు లేవు. గత 10 సంవత్సరాల్లో వలసల సంఖ్య తగ్గింది. దీనికి ప్రధాన కారణం వలసలు వెళ్లే ప్రదేశాల్లోనూ ఇదే తరహా దోపిడీ కొనసాగుతుండడం. అనేక దేశాలలో సమ్మెలు నిషేధించబడ్డాయి. మొన్నీమధ్య ఫ్రాన్స్‌లో జరిగిన వర్కర్ల సమ్మెపై విరుచుకుపడి కాల్పుల్లో అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు కూడా. గల్ఫ్‌ దేశాలలో సమ్మెకు అవకాశమే లేదు. కొన్ని యూరప్‌ దేశాల్లో అమెరికా ఇంగ్లాండ్‌ వంటి ప్రాంతాల్లో అప్పుడప్పుడు సమ్మెలు జరిగిన వాటి పరిష్కారాని కన్నా అణచివేతకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి. అలాంటి ధోరణియె ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నది. వినిమయ సంస్కతి పెరిగిపోవడం, జాబ్‌ సెక్యూరిటీ లేకపోవడం, నిరంతర ఉపాధి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం వల్ల ఉద్యోగులు పోరాటాల వైపు కదలడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అనగా ఉద్యోగులు గుక్క తిప్పుకొనే అవకాశాన్ని కూడా ఇవ్వనంత కఠినమైన పరిస్థితులను పెట్టుబడి సష్టించింది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా మతతత్వ పోకడలు, ఆధిపత్య భావజాలం, అతి జాతీయవాదం పెరిగిపోయాయి. వీటిని ప్రత్యక్షంగా చాలా రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. చాలా దేశాల్లో మితవాద పార్టీలు అధికారాన్ని చేపట్టాయి. దురదష్టవశాత్తు ఇలాంటి పోకడలకు సామాన్య ప్రజానీకంలో ఎక్కువ భాగం ఆకర్షితులై తమ గోతిని తామే తవ్వుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి మితవాద భావనలను ప్రోత్సహిస్తూ పోరాటాలకు మూలమైన అభ్యుదయ ఆలోచనల నుండి వర్కర్లు కూడా దూరమవుతున్నారు. ఫలితంగా మితవాద రాజకీయ అండతో పెట్రేగి పెట్టుబడిదారులను ఎదుర్కునే అవకాశం జారవిడుచుకుంటున్నారు. ప్రపంచ పోకడలకు అదనంగా భారతదేశంలో కులతత్వం ప్రాంతీయతత్వ ఎమోషనల్‌ అంశాలకు లోనై స్వార్థ రాజకీయాలకు అనుకూలంగా మారడంతో కార్మికవర్గ పోరాటాలకు ఆటంకాలు కలుగుతున్నాయి అందుచేతనే మేడే స్ఫూర్తి దెబ్బతింటుంది.

నిజానికి కార్మిక హక్కులను మరింతగా అభివద్ధి పరిచి కొనసాగిస్తే ఉత్పత్తి పెరుగుతోంది. సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గిపోతేనే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పరుగులు పెడుతోంది. ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారతదేశ స్థితి ఇప్పుడు ప్రపంచ ఆరవ ఆర్థిక వ్యవస్థ స్థాయికి పడిపోవడానికి కారణం కూడా సమాజంలో పనిచేసే వారందరికీ సరైన పారితోషికాలు ఇవ్వకపోవడమే. వర్కర్ల ఆర్థికస్థితికి దేశ ఆర్థిక వ్యవస్థకు సరాసరి ముడి ఉన్నదన్న సంగతి పాలకులు మరిచిపోయేంతలా పెట్టుబడిదారులు ప్రభావితం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాయీ. ఈ అంశాలపై కార్మికులు కార్మిక సంఘాలు అనేక సందర్భాల్లో గళమెత్తుతున్నా ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. నిరసనలు సమ్మెలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా అణచివేస్తున్నాయి తప్ప సరిగ్గా వాటిని పరిష్కరిస్తే సకల కుశలమన్న సంగతిని పెడచెవిన పెడుతున్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడిదారుల పక్షపాతి, కార్మిక సంఘాలపై వ్యతిరేకతతో కార్మికులకు అన్యాయం చేస్తోంది. లక్షలు కోట్లమంది నిరసనలు, సమ్మెలు చేపట్టినా మీడియాలో ఏమాత్రం కనపడకుండా ప్రభుత్వమే తమ అజమాయిషీతో ప్రజా బాహుళ్యంలోకి కార్మికుల సమస్యలు వెళ్ళకుండా అడ్డుపడుతోంది. ఇలాంటప్పుడు మరిన్ని పోరాటాలు వాటంతటవే ప్రబలే అవకాశం లేకుండా పోతున్నది. సోషల్‌ మీడియాలో నిరసనల కార్యక్రమాలను పోస్టు చేసినప్పుడు నిర్ద్వందంగా వాటిని తొలగించడమో లేక కక్ష పూరితంగా సంఘాలపై వ్యక్తులపై చట్టపర చర్యలకు పూనుకోవడం జరుగుతుంది. ఇలాంటి బెదిరింపు ధోరణుల మధ్య సాధారణ వర్కర్లు ప్రజానీకం పోరాటాల వైపు కదిలే పరిస్థితులు సన్నగిల్లుతున్నాయి. అయినప్పటికీ కూడా చాలా రంగాల్లో సంఘాల ప్రభావం తగ్గలేదు. చాలా మంది తెగించి సమ్మెలు కడుతున్నారు. ఆశించినంత మేర కాకపోయినా చాలా వరకు పరిశ్రమలో సంఘటితమై వేతన ఒప్పందాలు, సెలవులు తదితర అంశాలపై క్రమం తప్పని విజయాలు కార్మికులకు లభిస్తూనే ఉన్నవి.
చరిత్రను ఒకసారి గమనిస్తే నిరంకుశ ప్రభుత్వాలు చాలా దేశాలలో ఎక్కువ రోజులు కొనసాగలేదు. అయితే కొనసాగినన్ని రోజులు తమ ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు కానీ ఏదో ఒకరోజు వాటి పతనం ఖాయం. మితిమీరిన దోపిడీకి పాల్పడినప్పుడు ప్రజా తిరస్కారం కూడా అదే స్థాయిలో ఉంటుంది. చెంఘీజ్‌ ఖాన్‌ తామరలేను ఘజనీ ఘోరి వంటి వారందరూ చరిత్రలో మట్టికరిచిన వారే. హిట్లర్‌ నుండి నేటి డోనాల్డ్‌ ట్రంప్‌ వరకు అనేకమంది నియంతలు తిరస్కరించబడింది కార్మికవర్గం చేత మాత్రమే. ప్రస్తుతం జరుగుతున్న మధ్య ఆసియా యుద్ధంలో కూడా నష్టపోతున్నది కార్మికులే అదే సందర్భంలో భారతదేశంలోని ప్రభుత్వం ఎంత ఉదాసీన వైఖరితో ఉన్నప్పటికీ కూడా నిరసనలను ఏ మాత్రం వెనకాడకుండా వ్యక్తపరుస్తుంది కూడా కార్మికులే. అయితే రాజకీయాల ప్రభావం కార్మికులపై చాలా ఎక్కువగా ఉండడం వల్ల కార్మికులను విభజించే అవకాశం రాజకీయ పార్టీలకు సులువైంది. ఈ క్రమంలో పోరాటాల కన్నా సర్దుకుపోయే సంస్కతి కూడా చాలా చోట్ల కార్మికుల్లో పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. నిజానికి కార్మికులను సంఘటితపరచడం ఈ రోజుల్లో కత్తిమీద సాము లాంటిది. అభ్యుదయ భావజాలం కొరవడిన కారణంగా అసంఘటిత రంగంలో కార్మిక సంఘాలను నెలకొల్పి వాటికి నాయకత్వం వహించి జరుగుతున్న దోపిడీని అరికట్టి అక్కడ వర్కర్లకి న్యాయం జరిగేలా కషి చేయాలన్న స్పహ కలిగినవారు తగ్గిపోతున్నారు. అందుచేత మేడే 2026 సందర్భంగా కార్మిక వర్గం ముందున్న ప్రధాన సవాళ్లు మతతత్వ అస్తిత్వ రాజకీయాలను నిశితంగా పరిశీలించి కార్మికవర్గ ఐక్యతకు కారణమవుతున్న అంశా లను విశ్లేషించుకుని రక్తం ఏరులై పారిన సందర్భంలో అవతరించిన కార్మికుల హక్కులు పూర్తిగా హరించుకుపోకుండా ఉండే విధంగా పోరాటాలకు సిద్ధం కావడమే. కాస్తంత స్వార్ధాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని కొంతకాలం పక్కన పెట్టి దోపిడీ వర్గాలను ధీటుగా ఎదుర్కునే గుణాత్మక పోరాటాలను నిర్మించడానికి నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ కదిలిన రోజే మేడే కేవలం ఒక హాలిడే కాదు త్యాగాల ఫలితంగా లభించిన ఒక పండుగగా నిలబడగలదు.

జి. తిరుపతయ్య
9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -