Sunday, April 26, 2026
E-PAPER
Homeచౌరస్తాతప్పెవరిది?

తప్పెవరిది?

- Advertisement -

అలారం కెవ్వు కెవ్వుమనడంతో నిద్ర లేవక తప్పింది కాదు రవికి. లేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకుని మంచం దిగాడు. అప్పుడే డ్యూటీ టైం అయింది. ఇంకేం పడుకుంటాం, అనుకుంటూ గది బయటికి వచ్చేశాడు. అప్పటికే బెటర్‌ ఆఫ్‌ సంధ్య లేచి మొగుడు డ్యూటీకి వెళ్లూ తీసుకెళ్లాల్సి సరంజామా తయారు చేసింది.
రాత్రి నిద్ర సరిగా పట్టలేదా? ముఖం ఎర్రగా వుంది అంది సంధ్య నవ్వుతూ.
రోజు వుండే ముఖమే ఇది. ఇది ఇలాగే ఎర్రగా వుంటుంది. కొత్తేం కాదు కదా అన్నాడు రవి నవ్వకుండా.
అవునులే. ఈ టయంలో ఎర్రగా వుండే ముఖం కాసేపటికి తెల్లబడుతుంది. నాకు తెలీని ముఖమా ఇది అంది సంధ్య మళ్లీ నవ్వుతూ.
నీకేంటి హౌజ్‌వైఫ్‌వి కదా! డ్యూటీ చెయ్యాల్సింది హబ్బీనైనందున నేనే కదా! అన్నాడు రవి మళ్లీ మళ్లీ నవ్వకుండా.
సరే, ఇది రోజూ వున్న సంసారంలో సరిగమనే కదా! టైం అయ్యింది వస్తా అంటూ బ్యాగు భుజానికి తగిలించుకున్నాడు రవి.
అన్నీ కరెక్టుగానే వున్నాయి కదా! చూస్కోండి, తర్వాత నన్నంటే పడేది లేదు అంది సంధ్య.
ఈ రోజుల్లో మొగుడు అనడం పెళ్లాం పడడం ఎక్కడిదిలే. ఆ రోజులు పోయినయి అంటూ బయటుదేరాడు ఈసారి రవి నవ్వుతూ.
ఊరికే అనడమే కాని అనేవాళ్లు, పడేవాళ్లు లేకపోలేదు అంది సంధ్య ఈసారి నవ్వకుండా.
రవి ఇంట్లోంచి బయటికి అడుగు పెడుతుంటే బై… పతీ పరమేశ్వర్‌, డ్యూటీ మరీ స్ట్రిక్టుగా చేసి చెడ్డ పేరు తెచ్చుకోండి. మీకు బ్యాడ్‌నేమ్‌ వస్తే సగం నేనూ మోయాల్సి వస్తుంది అంది సంధ్య ఈసారి పెద్దగా నవ్వేస్తూ.
డ్యూటీ అన్నాక డ్యూటీయే కదా! ఎప్పటిలాగే డ్యూటీ చేసుకుంటూ పోతా, కానీ ఎందుకో జనం అర్థం చేసుకోరు అన్నాడు రవి రెండోసారి నవ్వుతూ.
ఏమో బాబూ మీ డ్యూటీ మీరు చేస్తున్నారంటారు. ఎప్పటిలాగే వున్నానంటారు కాన జనం మాత్రం ఆడిపోసుకుంటున్నారు. వాళ్లు అనరాని మాటలు అంటున్నారు. ఏను వినరాని మాటలు వింటున్నాను అంది సంధ్య సీరియస్‌గా.
ఎవరేమనుకుంటేనేం? మన డ్యూటీ మనం చేయక తప్పదు కదా! మన తప్పేం లేదు కదా! అన్నాడు రవి నాన్‌ సీరియస్‌గా.
రవి అలాగడపదాటి, వీధిలోకి అడుగు పెట్టేడో లేదో ‘తెల్లారకముందే వచ్చి కాల్చి కొరకటం మొదలెట్టేడు’ అన్నారెవరో. ఇలాగ గుమ్మం దగ్గర ఉంచుంటే చురచురమంటున్నాడని, భగభగమంటున్నాడని, వేపుకు తింటున్నాడని, రకరకాలుగా ఆయన్ని జనం నానామాటలు అంటుంటే వినాల్సివస్తుంది అంటూ ఇంట్లోకి వెళ్లి ధడాలున తలుపేసుకుంది సంధ్య ఆ మాటలు వినకూడదని.
వచ్చావా రవీ! ఆ ముఖం ఏమిటలా ముటముటలాడిస్తున్నావ్‌? ఆ నుదురు ఏమిటి అలా చించేసుకుంటున్నావ్‌? అంది భూమి రవి ముఖంలోకి చూస్తూ.
అవును రవినే! నా డ్యూటీ నేను చేసుకోవడానికి వచ్చాను. ముఖం అంటావా ఆ ముఖం నా ఇష్టం. నేనెలా పెట్టినా, ఆ ముఖం నీకు నచ్చదుగాక నచ్చదు అన్నాడు రవి.
డ్యూటీకి వచ్చీ రావడమే చిరాకెందుకు బాస్‌! కొంచెం ఫ్రెండ్లీగా వుండవచ్చు గదా అంది భూమి.
నేనెప్పుడూ ఫ్రెండ్లీగానే వుంటాను. ఎప్పటిలాగే డ్యూటీ చేస్తుంటాను. అయినా నేనే ఏదో తప్పు చేశానన్నట్టు నిందిస్తావేం? అన్నాడు రవి. తన బ్యాగులోనుంచి కిరణాల బండిల్‌ను బయటకు తీస్తూ.
అది కాదు రవీ. రోజురోజుకీ నీ మూడ్‌లో ఏదో తేడా కొడ్తున్నది. ఇది వరకులా లేవు నువ్వు అంది భూమి.
అనాలి అంటున్నావు కానీ నాలో ఏ తేడా లేదు అంటూ మండిపడ్డాడు రవి.
చూశావా! చూశావా! మండిపడ్డం మొదలుపెట్టావు. మండుతున్న గ్యాస్‌ పొయ్యిలా మారావు చూడు! కాసేపట్లో ఆకాశం బోర్లించిన వేడి మూకుడులా మారిపోతుంది. నా ఒళ్లంతా సెగలూ పొగలూ అవుతుంది. నాలుకలు చాచే నీ మంటల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతాను. షాపుల్లో డబ్బు వసూలు చేయడానికి వచ్చే వీధి రౌడీలా మీదపడి ఆననా హింసలు పెడ్తున్నావని జనం చెమటలు కక్కుతూ నిన్ను నిందిస్తుంటే ఏమీ అనిపించదా నీకు? మీ ఆవిడైనా నిన్ను మార్చే ప్రయత్నం చెయ్యడం లేదు అని విసుక్కుంది భూమి.
అనీ తెల్సిన నువ్వే ఇలా మాట్లాడితే నేనేం చెయ్యాలి? జనం… జనం.. అంటావు. వీళ్ల వల్లే కదా నేను మంటలు అంటుకున్న చమురు బావిలా కనిపిస్తున్నాను. నా తప్పేమీ లేకపోయినా అపనిందలు మొయ్యాలా? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో భూమీ. మైళ్ల దూరం వరకు ఒక్క చెట్టన్నా వుందా? వేలాది చెట్లతో నిండుగా వుండే అడవులు ఏమైపోయినాయి? ఇటు చూడు ఈ నగరం మునుపు వున్నట్టే వుందా? ఇన్ని అంతస్తుల భవనాలు వుండేవా? ఆ భవనాలమీద లెక్కకు మించినన్ని ‘ఎసి’ పెట్టెలు కనిపించడం లేదా. ఇది నగరమా, కాంక్రీటు క్లోరోఫోరోకార్బన్‌ అరణ్యమా? మనుషులు తమ సౌకర్యాల కోసం చేసిన ఏర్పాట్ల వల్ల కదా నేను మండే మంటనయ్యాను. నిజానికి నేను ఎప్పటిలానే నా డ్యూటీ చేసుకుంటున్నాను. తప్పంతా మనుషులదే! వాళ్లకి వంతపాడే నీదే భూమీ! అన్నాడు రవి.
రవి అన్నమాటల్లో సత్యం వుండడం వల్ల మారు మాట్లాడలేదు భూమి.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -