Saturday, June 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపోచంపల్లి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం

పోచంపల్లి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం

- Advertisement -

చేనేత దేశ సంస్కృతీ సంప్రదాయాలను
విశ్వ వ్యాప్తం చేసింది : 
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
థ్రెడ్‌ పోచంపల్లి చేనేత ఎగ్జిబిషన్‌ ప్రారంభం

నవతెలంగాణ- భువనగిరి
పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని వ్యవసాయ, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత చేనేత రంగానిదని చెప్పారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లోని తెలంగాణ రేసింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జూన్‌ 5, 6, 7వ తేదీల్లో నిర్వహిస్తున్న థ్రెడ్‌ పోచంపల్లి హ్యాండ్లూమ్‌ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్‌ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) ట్యాగ్‌ ఇక్కడి కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని తెలిపారు. పోచంపల్లి రుమాళ్ల్లు, ఇక్కత్‌ చీరలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రెండున్నరేండ్ల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సుమారు రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు.

గ్లోబలైజేషన్‌ పోటీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్థ ద్వారా చేనేత కుటుంబాల పిల్లలకు ఆధునిక డిజైన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్‌ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించి అంత ర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దు తున్నామని చెప్పారు. డూప్లికేట్‌ ఉత్పత్తుల వల్ల చేనేత బ్రాండ్‌ నష్టం రాకుండా నివారించడంలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుం దన్నారు. ఈ ప్రదర్శనను విజయవం తంగా నిర్వహించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కత్‌ డిజైన్లతో పాటు ఆధునిక సాంకేతికను జోడించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్కిల్‌ రేసింగ్‌లో భాగంగా ప్రత్యేకమైన కోర్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. థ్రెడ్‌ పోచంపల్లి ఎగ్జిబిషన్‌ ద్వారా నేతన్నల ప్రతిభకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల శ్రమకు తగిన గౌరవం, ఆదాయం దక్కాలని కోరారు.

పోచంపల్లి సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా ఖ్యాతి గడించిం దన్నారు. నిజాం కాలం నుంచే పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. పోచంపల్లి చేనేత పరిశ్రమను పరిశీలిం చడానికి, వస్త్రాలను కొనుగోలు చేయడాని కి విదేశీ వనితలు వస్తున్నారని తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా చేనేత కార్మికులకు మరిన్ని మార్కెటింగ్‌ అవకాశాలు లభించా లన్నారు. పోచంపల్లి ఇక్కత్‌ డిజైన్‌ నకిలీ నమూనా రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తు న్నాయని తెలిపారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు మరిన్ని మార్కె టింగ్‌ అవకాశాలు కల్పించాలని, పోచంపల్లి చేనేత వైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు.పోచంపల్లి పట్టుచీర ఎలా తయారవుతుందో మగ్గాలతో నేరుగా అల్లికలు చేస్తున్న దృశ్యాలు, పట్టు చీరలు, కాటన్‌ చీరలు ఇతర డిజైన్లతో ఆధునీకరణతో ఉన్న పోచంపల్లి వస్త్రాలతో ఏర్పాటు చేసిన 100 స్టాళ్లుఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ తడక వెంకటేశం, జిల్లా ఏడీ చేనేత అధికారి శ్రీనివాస్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్‌, గజం అంజయ్య, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -