Thursday, August 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎరువుల విక్రయాలు యాప్‌‌లోనే

ఎరువుల విక్రయాలు యాప్‌‌లోనే

- Advertisement -

ఫ్రేంవర్క్ ఫర్‌ ఫర్టిలైజర్ సేల్ యాప్
నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలు ఎరువుల కొనుగోలు, పంపిణీ, విక్రయాల పర్యవేక్షణ

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
దేశ వ్యాప్తంగా ఎరువుల విక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఫ్రేంవర్క్ ఫర్‌ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌‌ను అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి రైతులు తమకు కావలసిన అన్ని రకాల ఎరువులను కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అన్ని రకాల ఎరువులను ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారానే విక్రయాలు చేపడతామని ప్రకటించింది. ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్‌కు కాలం చెల్లినట్లేనని చెప్పవచ్చు. ఎరువులు కొనుగోలు చేయడానికి మొబైల్ ఫోన్ యాప్ ఆధారిత కొనుగోలు వ్యవస్థను కేంద్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ఎరువుల పంపిణీ, అమ్మకాలను సజావుగా నిర్వహించేందుకు ఈ యాప్ రూపొందించబడిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. యూరియా కోసం రైతులు నూతనంగా తీసుకువచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న యూరియా బుకింగ్ యాప్ ద్వారా ప్రధానంగా యూరియా విక్రయాలు మాత్రమే నమోదు చేయబడేవి. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్ఎస్‌ యాప్ ద్వారా యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్పీకే, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయి. ఈనెల 6వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారానే అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు జరుపుతారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్ఎస్‌ యాప్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఎరువుల కొనుగోలు, పంపిణీ, నిల్వలు, సబ్సిడీ, విక్రయాల పర్యవేక్షణ తదితర ప్రక్రియలన్నీ ఒకే వేదికపై నిర్వహించబడనున్నాయి,

​గ్రామీణ ప్రాంత రైతులకు తప్పని తిప్పలు
కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్న ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ గురించి రైతులకు ఎలాంటి అవగాహన కల్పించలేదు. ఇది వరకు ఉన్న యూరియా యాప్ వల్లనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు నూతన యాప్‌తో మరింత ఇబ్బందుల పాలుకానున్నారు. గ్రామీణ ప్రాంతాల నిరక్షరాస్యులైన రైతులు ఈ యాప్‌ను వినియోగించడం ఎలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికే యారియా యాప్ ద్వారా ఇబ్బంది పడ్డ రైతులకు ఈ కొత్త విధానంతో కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఎరువుల కోసం యాప్‌లో బుకింగ్ చేయడానికి మరొకరిని బతిమాలుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​యాప్ ద్వారానే ఎరువుల్ని బుక్ చేసుకోవాలి
ఇక నుంచి కేంద్రం తెచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ‌యాప్‌‌ ద్వారానే ఎరువుల్ని బుక్‌ ‌చేసుకోవాలి. అందు కోసం ప్రతి రైతు తమ ఫోన్ లేక తెలిసిన వారి ఫోన్‌‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందులో అడిగే వివరాలను నమోదు చేయాలి. రైతులు ముందుగా తమ మొబైల్ నంబర్ అవసరమైన వివరాలతో యాప్లో నమోదు చేసుకోవాలి. అనంతరం సాగు పంట, విస్తీర్ణం, అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసి సమీపంలోని ఎరువుల డీలరును ఎంపిక చేసుకోవాలి. అనంతరం యాప్ రైతుకు ప్రత్యేక క్యూ ఆర్ కోడును రూపొందిస్తుంది. రైతు ఎంపిక చేసిన డీలర్ వద్దకు వెళ్లి ఆ క్యూఆర్ కోడును చూపించాలి. డీలర్ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ లేదా పీఓఎస్ పరికరం ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత రైతు వివరాలు, ఎరువుల వివరాలు ధ్రువీకరించబడతాయి. అనంతరం రైతుకు ఎరువులు అందజేస్తారు. విక్రయం పూర్తయిన వెంటనే ఆ సమాచారం కేంద్రం, రాష్ట్ర సర్వర్లో నమోదు అవుతుంది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎరువుల పంపిణీని పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది.

​రైతులకు నాణ్యమైన ఎరువులు అందుతాయి వ్యవసాయశాఖ జేడీఏ శివప్రసాద్
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారానే అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు నిర్వహించబడతాయి. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో, పారదర్శకంగా అందించబడతాయి. ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌ను ఏర్పాటు చేసింది. రైతులు ఎలాంటి అపోహలు లేదా సందేహాలకు గురికాకుండా, వ్యవస్థకు సహకరించి ఎరువులు కొనుగోలు చేయాలి.

​పాత పద్దతిలోనే ఎరువులు సరఫరా చేయాలి జి.జయరాజ్ -రైతు సంఘం రాష్ట్ర నాయకులు
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ గురించి ‌రైతులకు కనీస అవగాహన కల్పించకుండా ఎలా తీసుకువస్తారు. పాత పద్దతిలోనే ఎరువులు సరఫరా చేయాలి. రాష్ట్రంలో యూరియా యాప్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూరియా కోసం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరిగారు. గ్రామీణ ప్రాంత రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. వారి పరిస్థితి ఏమిటీ.?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -