దమ్ముంటే మీ పదేండ్లు, మా రెండేండ్ల పాలనపై కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలి
ఐదేండ్లు ఎంపీగా ఉన్నా
ఐదు సార్లు కూడా పాలమూరు రాలే..
ప్రదర్శనలు కాదు.. పొర్లు దండాలు పెట్టినా బీఆర్‌ఎస్ నేతల పాపాలు పోవు
జడ్చర్ల ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-మహబూబ్నగర్
ప్రాంతీయ ప్రతినిధి/జడ్చర్ల
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ శుక్రవారం జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనపైనా, రెండున్నర సంవత్సరాలపైనా (30 నెలలు) చర్చకు సిద్ధమా అని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మీ పాలమూరు బిడ్డగా రెండ్రోజులుగా జిల్లా రైతులకోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించానని, సాంకేతిక సమస్యలను అధిగమించి ఆరు నెలల్లో పాలమూరు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. వలసల కష్టాలు, ఆత్మహత్య నష్టాలు మనకు తెలుసు, వాటికేం భయపడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నామని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎంపీగా గెలిపిస్తే ఈ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమం.. యువత ఆత్మహత్యలను గమనించి ఒక తల్లిగా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ మేకవన్నె పులి అని గుర్తించక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేండ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని అన్నారు. ”దొంగలకు సద్దులు మోసెటోళ్లు నిన్నమొన్న పాదయాత్ర చేస్తామని మాట్లాడుతున్నారు.. పాదయాత్ర కాదు.. కాశీ దాక పొర్లు దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు తొలిగిపోవు” అని అన్నారు. జడ్పీటీసీగా మీరు నాటిన ఈ మొక్క ముఖ్యమంత్రిగా వృక్షమై తిరిగి మీ ముందుకు వచ్చాడని, పాలమూరులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్‌లో పోటీ చేసిన కేసీఆర్ పాలమూరు ద్రోహినా? నేను పాల మూరు ద్రోహినా? ఒకసారి పరిశీలన చేసుకోవాలన్నారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామ న్నారు. ”మేం వస్తాం.. మేం నడుస్తామని కొందరు వస్తు న్నారు. పంచ కట్టుకుని ఊర్ల్లకు వస్తే ఇక్కడి ప్రజలు ఉరికించి కొడతారు” అని హెచ్చరించారు. పదేండ్లలో కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చుచేసిన కేసీఆర్.. ఉదండపూర్ మునిగితే రూ.800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు.
ఇవ్వకపోగా నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టిం చిన చరిత్ర కెేసీఆర్‌ది అన్నారు. అందుకే మట్టికి పోయినా మనోడే పోవాలని పెద్దలు చెప్పారన్నారు. పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఈ 30నెలల్లో రూ.8వేలకోట్లు ఖర్చు చేశానని,జైళ్లు కట్టా లని వాళ్లు అనుకుంటే స్కూళ్లు కట్టాలని మనం అనుకు న్నాం.. ఇది తెలంగాణ రాష్ట్ర పారదర్శకతకు నిదర్శనం అని చెప్పారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామన్నారు. చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.. పిల్లల్ని చదివించండి.. చదువుకుంటేనే బతుకులు బాగుపడతా యన్నారు. జిల్లాల్లో వలసలు ఆగాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావాలని చెప్పారు, హనుమాండ్ల గుడిలేని తండా, గూడెం లేదేమో కానీ ఇందిరమ్మ ఇల్లు లేని గూడేలు లేవు.. ఈ విషయమై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. పాలమూరు ప్రజలు మట్టి తీసుడే కాదు… మట్టితో కప్పడం కూడా తెలుసు అని హెచ్చరించారు కేసీఆర్ రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాల్లో మీ పార్టీని బొంద పెడతాం.. జిల్లాలో మీ పార్టీకి చెందిన వారిని ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనీయం అన్నారు.
రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు.. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం.. పది వేల కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు చేశాం.. ఇలా మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం అంత ఉంటుందన్నారు. మీ పదేండ్ల పాలనపై, మా రెండున్నరేండ్ల పాలనపై చర్చిద్దాం.. కేసీఆర్ అసెంబ్లీకి రా.. మాది తప్పైతే నేను క్షమాపణ చెబుతా.. అని అన్నారు. గోదావరి జలాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలాడుతున్నారని, బీజేపీ నాయకులు తప్పిం చుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారు? ఎవరు దాగుడు మూతలాడినా, తప్పించుకు తిరిగినా.. అడుగుతాం.. కడుగుతాం.. తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం. మీరు బురద చల్లినా, తలకిందులుగా తపస్సు చేసినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకి 90 టీఎంసీలకు ఒప్పించే బాధ్యత నాది.. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు. పాలమూరు బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి.. దొంగలు వస్తారు.. దోపిడీదారులు వస్తారు. దొంగలకు సద్దులు మోసెటోళ్లతో జాగ్రతగా ఉండండి.. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. 2029లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచిపూడి దామోదర్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మేఘ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయకులు సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



