Saturday, June 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

- Advertisement -

మాటలతో
కాలం వెళ్లదీస్తున్న ప్రభుత్వం
భద్రాద్రి జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల్లో పార్టీ శ్రేణులకు పిలుపు : ​సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ


నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పేరుకుపోతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ(ఎం) చేపట్టిన “పోరుబాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో అవన్నీ నీటిమీద రాతలుగా మారాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక రాజకీయ జోక్యంతో సాగుతుండటంతో అసలైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, ఆదివాసీలు సాగుచేస్తున్న భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్, పోలీసు అధికారుల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వలస ఆదివాసీ గ్రామాల పిల్లలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, వారి విద్యా, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకూడ దన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని, హిందుత్వ భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ హక్కులు, గిరిజన చట్టాల పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్పొరేట్ల కోసమే గిరిజన చట్టాల మార్పులు
కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు విమర్శిం చారు. గిరిజనులను భూములు, అటవీ ప్రాంతాల నుంచి దూరం చేయడానికే కొత్త అటవీ విధానాలను అమలు చేస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపద, నీటి వనరులు, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, దేశ సంపద రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్న వరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, ఎం.బి.నర్సారెడ్డి, కె.బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
భద్రాచలం మాజీ ఎంపీ
డాక్టర్ మిడియం బాబూరావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -