– మండల స్థాయిలో వినూత్న కార్యక్రమాలు
– శతాధిక కవిసమ్మేళనంతో ప్రపంచ రికార్డు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండల విద్యాశాఖ చేపడుతున్న వినూత్న విద్యా,సాహిత్య కార్యక్రమాలు తెలుగు ప్రపంచానికి గర్వకారణంగా నిలిచాయి.మండల స్థాయిలో విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిర్వహించిన శతాధిక కవిసమ్మేళనం కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి అశ్వారావుపేటకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. మండల విద్యాధికారి ప్రసాదరావు పర్యవేక్షణలో, అశ్వారావుపేట సి.ఆర్.పి, సాహితీ మిత్ర సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించబడింది.మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు స్వయంగా రచించిన కవితలను ఒకే వేదికపై ప్రదర్శించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది.విద్యార్థుల కవితా ప్రతిభ, భావవ్యక్తీకరణ, భాషా పటిమ సభకు హాజరైన ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ చింతపట్ల వెంకటాచారి దీన్ని అరుదైన, అపూర్వమైన సాహిత్య విద్యా కార్యక్రమంగా గుర్తించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు.అనంతరం ఈ ఘనతకు సంబంధించిన “ధృవీకరణ పత్రాన్ని” అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అశ్వారావుపేట పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన మండల విద్యాశాఖ కృషి అభినందనీయమైనది. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి” అని అన్నారు.
శతాధిక కవిసమ్మేళనంలో విద్యార్థులు చదివిన కవితలను “కలికలు” పేరుతో సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సంపాదకత్వంలో గ్రంథరూపంలో ముద్రించడం మరో విశేషం.ఈ పుస్తకానికి అంతర్జాతీయ ప్రామాణిక గ్రంథ సూచిని (ఐఎస్బీఎన్) లభించడం అశ్వారావుపేట విద్యాశాఖకు మరొక గౌరవప్రదమైన గుర్తింపుగా నిలిచింది.
మండలంలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీ.ఆర్.పీలు, ఉపాధ్యాయుల సమన్వయంతోనే ఇలాంటి వినూత్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని మండల విద్యాధికారి ప్రసాదరావు తెలిపారు. విద్యార్థులలో సాహిత్యాశక్తిని పెంపొందించడం, భాషా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సృజనాత్మక ఆలోచనలకు వేదిక కల్పించడం వంటి లక్ష్యాలతో అశ్వారావుపేట విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అశ్వారావుపేట విద్యాశాఖ సాధించిన ఈ ఘనత స్థానికులకు గర్వకారణంగా మారింది.



