Tuesday, April 28, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఓ న‌ర్సు సాహ‌సం..

ఓ న‌ర్సు సాహ‌సం..

- Advertisement -

అమెరికా-ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధంతో ఇరాన్‌ అల్లాడిపోతోంది. అగ్రరాజ్యంపై తన శక్తిమేరకు పోరుడుతోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బాంబు పేలుళ్లు, తుపాకుల శబ్దాల నడుమ ఆ దేశం అట్టుడికిపోతుంది. ఇంకా కండ్లు కూడా తెరవని పసిప్రాణాలను కూడా ఆ యుద్ధం వదల్లేదు. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి గంట కూడా పూర్తికాక ముందే వారి ప్రాణాలను హరించాలనుకున్నారు. కానీ ఓ నర్సు ఎంతో ధైర్యంతో ఆ పసికందులను కాపాడింది. తన ప్రాణాలకు తెగించి ఆ బిడ్డలను తల్లుల ఒడిలోకి చేర్చింది.

అది మార్చి 1వ తేదీ.. ఉదయం 11:40 గంటలు అవుతుంది. అయితే టెహ్రాన్‌లోని ఖతమ్‌-అల్‌-అన్బియా ఆసుపత్రి నవజాత శిశు విభాగంలో కాలం విభిన్నంగా గడుస్తోంది. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి గంట కూడా పూర్తికాని నవజాత శిశువులు అందులో ఉన్నారు. పేలుళ్ల శబ్దాలు.. యుద్ధ పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ పసిమనసులు ఆ వార్డులో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఓ పక్క యుద్ధ సంఘర్షణల నడుమ తమ బిడ్డలకు ప్రాణదానం చేసేందుకు అసమాన పోరాటం చేసి అలసిపోయిన వారి తల్లులు.. ఇంకా ఆపరేటింగ్‌ గదులలో, ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నారు.

జీవిత కొనసాగింపు
యుద్ధ బీభత్సం నడుమ ఇరాన్‌లో తల్లి కావడం అనేది తుఫాను మధ్యలో జరిగే ఓ అద్భుతం లాంటిది. ఎర్రటి సైరన్‌లు, విదేశీ ముప్పుల నీడ నగరంపై కమ్ముకుని ఉన్నప్పుడు, తొమ్మిది నెలల గర్భాన్ని భరించడం మానవ శక్తికి అందని భారం. ఈ మహిళలకు ఈ పిల్లలు కేవలం పసికందులు కాదు. దాడుల ఒత్తిడిని తట్టుకుని నిలబడటమే ఏకైక నేరంగా పరిగణించబడిన ఒక దేశంలో వారు ‘జీవిత కొనసాగింపు’కు ప్రతీకలుగా నిలిచారు. వార్డులో నర్సుగా పనిచేస్తున్న నేడా సలీమీ.. తన సంరక్షణలో ఉన్న చిన్నారుల ప్రాణ సంకేతాలను తనిఖీ చేయడంలో నిమగమై ఉండగా అకస్మాత్తుగా ఆమె పాదాల కింద నేల కంపించింది. మానవతా ఒప్పందాల ప్రకారం ‘సురక్షిత ప్రాంతం’గా ఉండవలసిన ఆ ఆసుపత్రిలోని నిశ్శబ్దాన్ని ఒక పేలుడు బద్దలుకొట్టింది. ఒక్క క్షణంలో పైకప్పు నుండి వర్షం కురవడం మొదలైంది. అయితే అది నీరు కాదు.. కాంక్రీటు ముక్కలు, పగిలిన గాజు పెంకులు. దట్టమైన దుమ్ము గాలిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కూలిపోతున్న ఈ గోడల శబ్దంలో అరుపులూ కలిసిపోయాయి.

ప్రాణ నష్టం మాత్రమే కాదు
భవనం తీవ్రంగా కంపిస్తున్న ఆ సమయంలో నేడా ఒక కఠోర పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆశ్రయం పొంది ఉండవచ్చు. కానీ ఆమె చూపులు ఇప్పుడు మృత్యు ఛాయలో ఉన్న ఉయ్యాలలపైనే నిలిచిపోయాయి. ఈ పసికందుకు హాని జరిగితే అది కేవలం ఒక ప్రాణ నష్టం మాత్రమే కాదని, నెలల తరబడి బాంబుల శబ్దాల మధ్య భయంతో బతుకుతూ కూడా ఎంతో ఓర్పుతో తమ బిడ్డలకు జన్మనిచ్చిన తల్లుల చివరి ఆశ కూడా తెగిపోతుందని ఆమెకు తెలుసు. భూమి మీద అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఉండాల్సిన చోట ఈ పిల్లలను కోల్పోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తాము ఎన్నడూ కోరుకోని యుద్ధానికి ఇప్పటికే భారీ మూల్యం చెల్లించిన కుటుంబాల హృదయాలపై చెరగని గాయాన్ని మిగులుస్తుంది.

స్వచ్ఛమైన మానత్వానికి నిదర్శనం
వార్డు పైకప్పు కూలిపోతుండగా నేడా ఆ నవజాత శిశువుల వైపు పరుగెత్తింది. ఓ పక్క భయంతో చేతులు వణుకుతున్నా ఉక్కు సంకల్పంతో ఆమె ఒక్కొక్క పసికందును తన చేతుల్లోకి తీసుకుంది. ముగ్గురు నవజాత శిశువులను తన ఛాతీకి హత్తుకుని పొగ, శిథిలాలతో నిండిన కారిడార్ల గుండా ముందుకు సాగింది. అయితే ఆమె ఆశ్రయం వైపు వెళ్ళలేదు. ఆ క్షణాల్లో పసికందులు తమ తల్లి చేతుల్లో ఉండాలని, ఒక తల్లి తన ఆత్మలో కొంత భాగం ఇంకా బతికే ఉందనే నమ్మకంతో ఉండాలని ఆమెకు తెలుసు. హాలులోని గందరగోళం నడుమ ఏడుపులు, దుమ్మును సైతం లెక్కచేయకుండా నేడా ఆ తల్లుల పేర్లను బిగ్గరగా పిలిచింది. ఆ పున:కలయిక క్షణం స్వచ్ఛమైన మానవత్వానికి ఒక అద్భుత దృశ్యం.

మరణ భయంతో కాదు..
తమ చివరి ఆశ అయిన పసికందును కూడా ఆ యుద్ధం దోచుకుందేమోనని భయపడుతూ, సగం ప్రాణంతో ఆపరేషన్‌ గది నుండి బయటకు వచ్చిన తల్లులు, అకస్మాత్తుగా దుమ్ముతో నిండిన ఒక దేవదూత తమ పసికందులను క్షేమంగా, సురక్షితంగా తమకు తిరిగి అప్పగించడాన్ని చూశారు. ఆ క్షణంలో నేడా సలీమీ కన్నీళ్లు కూడా ఆ తల్లులతో పాటే ప్రవహించాయి. అది మరణ భయంతో కాదు.. బూడిద కుప్పగా మారాల్సిన ఆ ప్రదేశంలో మరోసారి జీవస్పర్శను పొందినందుకు. అప్పుడు ఆమె వారితో ‘నేను కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాను’ అని చెప్పింది. కానీ ఆ తల్లులకు ఆమె క్రూరమైన దాడిని ఎదుర్కొంటూ, తన ఆలింగనంతో ఒక కొత్త భద్రతా కప్పును నిర్మించిన మహిళగా నిలిచిపోయింది.

వేల సంఖ్యలో మరణాలు
ఫిబ్రవరి 28, 2026న అమెరికా – ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై దాడి చేసి పలువురు సీనియర్‌ కమాండర్లను, ఇరాన్‌ సర్వోన్నత నాయకుడైన అయతొల్లా సయ్యద్‌ అలీ ఖమేనీని హత్య చేశాయి. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌ ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ 4’లో భాగంగా 100 విడతలలో ప్రతీకార దాడులు చేసింది. ఈ దాడులు ఏ దేశాల నుండి జరిగాయో, ఆ దేశాలలో ఉన్న ఇజ్రాయెల్‌-అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడి చేసింది. ఇరాన్‌ లీగల్‌ మెడిసిన్‌ ఆర్గనైజేషన్‌ అధిపతి ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్‌ 10 వరకు జరిగిన ఘర్షణలలో మొత్తం 3,375 మంది మరణించారు. వీరిలో 2,875 మంది పురుషులు, 496 మంది మహిళలు ఉన్నారు. ఇక ఇరాన్‌ అత్యవసర వైద్య సేవల అధిపతి ప్రకారం ఇటీవలి యుద్ధంలో 118 మంది వైద్య సిబ్బంది గాయపడగా, 26 మంది మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -