Saturday, May 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుధాన్యం కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ ట్రక్‌ షీట్‌

ధాన్యం కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ ట్రక్‌ షీట్‌

- Advertisement -

రైతుల నుంచి భిన్న స్వరాలు
సాంకేతిక సమస్యలొస్తే…?
పారదర్శకత కోసమేనంటున్న అధికారులు

నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్‌లైన్‌ ట్రక్‌ షీట్‌’ విధానంపై రైతుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనితో లాభనష్టాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కొందరు అంటుండగా, కొత్త విధానమే పారదర్శకంగా ఉంటుందని మరికొందరంటున్నారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేం దుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్‌ చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిగ్గా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది. మాన్యువల్‌ మిల్లుల కేటాయింపు విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది.

అక్రమాలకు చెక్‌
కొత్త విధానం ప్రకారం లారీలో ధాన్యం లోడ్‌ చేసే సమయంలో ముందుగా మిల్లు వివరాలు తెలియవు. ట్రక్‌ షీట్‌ ఆన్‌లైన్‌లో జనరేట్‌ చేసిన తర్వాతే సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా ఏ మిల్లుకు రవాణా చేయాలో సూచిస్తుంది. ట్రక్‌ షీట్లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తప్పనిసరిగా తరలించాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీని పరిగణలోకి తీసుకుని కేటాయిం పులు జరుగుతాయి. దీనివల్ల ఇప్పటి వరకు మిల్లర్లు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు చేస్తున్న అక్రమాలకు చెక్‌ పడనుంది. జీపీఎస్‌ విధానం కట్టుదిట్టమైన పర్యవేక్షణతోపాటు వడ్ల రవాణాలో అవకతవకల నివారణకు దోహదప డుతుంది. లారీలు, డీసీఎం వాహనాల్లో జీపీఎస్‌ పరికరా లు అమర్చడం తప్పనిసరి. జీపీఎస్‌ సరిగా పని చేస్తున్న వాహనాలను మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తారు. వాహ నాల కదలికలను రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించి, ధాన్యం ఎక్కడికి వెళ్తుందన్న దానిపై స్పష్టత ఉంటుంది.

రియల్‌ టైమ్‌ డేటా ఎంట్రీ
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే రైతుల వివరాలు, ధాన్యం పరిమాణం వంటి సమాచారాన్ని ట్యాబ్‌ల ద్వారా వెంటనే ఆన్‌లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రియల్‌ టైమ్‌ డేటా నమోదు ద్వారా పారదర్శకత పెరగడం తోపాటు రైతులకు చెల్లింపులు వేగంగా జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నాణ్యతా ప్రమాణా లకు అనుగుణం గా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు.

రైతులకు లాభం
సివిల్‌ సఫ్లరు శాఖ తీసుకొచ్చిన ఈ సంస్కరణలతో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పెరిగి, రైతులకు న్యాయమైన ధర లభించడంతోపాటు చెల్లింపులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ విధానం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు.

ఇబ్బంది లేకుండా చర్యలు
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సాంకేతిక సదుపాయాల వినియోగంతో కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూడాలని సూచించింది. ఇన్నాళ్లు ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. తూకాల్లో మోసాలు, నాణ్యత లేదనే పేరుతో కోతలు, ట్రక్‌ షీట్లలో అవకతవకలు వంటి సమస్యలు నమోదయ్యాయి.

సర్వర్‌ సమస్యలొస్తే..
ఆన్‌లైన్‌ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఒక్కోసారి సర్వర్‌ సమస్యల వల్ల ట్రక్‌ షీట్ల జనరేషన్‌ గంటల తరబడి నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం తక్కువగా ఉండటంతో ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. ఒకవైపు వర్షాల భయం, మరోవైపు ఆన్‌లైన్‌ ప్రక్రియలో జాప్యంతో ధాన్యం లారీలు ఎక్కవేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -