శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు పని చేస్తాం
సైబర్‌క్రైమ్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
శాఖలో అవినీతి పెరగడం తెలుసు.. దానిని కట్టడి చేస్తాం
ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరింది
ఒకరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించే మాటలపై నా స్టైల్‌లో చర్యలు తీసుకుంటా…అనుభవంతో పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరుస్తా
ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తాం
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బ్యూరో
రాష్ట్ర ప్రజలకు కొత్త పోలీస్ బాస్ ఆనంద్ భరోసా
బాధ్యతలు స్వీకరించిన డీజీపీ ఆనంద్
కుటుంబసభ్యులతో కలిసి కార్యాలయానికి
ఘనంగా స్వాగతం పలికిన అధికారులు
రాష్ట్ర నూతన డీజీపీ సి.వి ఆనంద్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఉదయం 10:15 గంటలకు తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి డీజీపీ కార్యాలయం మెయిన్‌గేట్ వరకు వచ్చిన ఆనంద్‌కు సాయుధ పోలీసు బలగాలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సాయుధ పోలీసు బలగాలు చేసిన సెల్యూట్‌ను స్వీకరించిన ఆనంద్.. వారికి నవ్వుతూ కృతజ్ఞతలు చెప్పి డీజీపీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ వేచి ఉన్న వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికి డీజీపీ చాంబర్‌లోకి గౌరవంగా తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే వేచి ఉన్న ఐపీఎస్ అధికారులందరికీ నమస్కారం, కరచాలనం చేస్తూ తన ఆసనం వద్దకు ఆయన చేరుకున్నారు. అక్కడ వేద మంత్రోచ్ఛారణల మధ్య నూతన డీజీపీగా బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు అఫీషియల్ ఫైల్‌లో ఆయన సంతకం చేశారు. దాంతో కరతాళ ధ్వనులతో అక్కడ వేచి ఉన్న అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది ఆనంద్‌కు అభినందనలు తెలియజేశారు.
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీస్‌శాఖ దేశంలోనే నెంబర్ 1గా పేరు గడించిందనీ, ఇంకా దీని పనితీరును మెరుగుపర్చడానికి ఈ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరిస్తామని రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి ఆనంద్ ప్రకటించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నూతన బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మీడియాకు తన భవిష్యత్ ప్రణాళికపై పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై నమ్మకంతో ఈ కీలక పదవిని అప్పగించారనీ, దానిని వమ్ము చేయనని ఆయన అన్నారు. కొందరు అధికారులు స్పందించాల్సిన సమయంలో నిర్లక్ష్యం వహించడం వలన కొన్ని సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయనీ, ఇకపై ఆ విధానం చెల్లదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చెలరేగిపోతున్నారనీ, వారిని కానిస్టేబుల్ మొదలుకొని ఉన్నతస్థాయి అధికారి వరకు సమిష్టి కృషితో అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. కూర్చున్న చోటనే సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారనీ, దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాల పైన ఉక్కుపాదం మోపుతామనీ, ఇది సమాజంలో అత్యంత హేయమైన చర్యగా చెప్పారు.
ట్రాఫిక్ సమస్య కూడా విషమ రూపం దాల్చుతున్నదనీ, రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాదీ రాష్ట్రంలో 7500 మంది మరణిస్తుండగా, జాతీయస్థాయిలో గతేడాది 1,72,000 మంది విగతజీవులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రత కోసం ప్రత్యేకంగా రాష్ట్రస్థాయిలో బ్యూరోను ఏర్పాటు చేస్తామని నూతన డీజీపీ తెలిపారు. పోలీస్‌శాఖలో అవినీతి పెరిగిందనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. తాను ఏసీబీలో ఉండగానే ఆ విషయం తన దృష్టికి వచ్చిందనీ, దీనిని అరికట్టడానికి చర్చించి, ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తామని అన్నారు. పోలీసులు తమను వేధింపులకు గురి చేస్తున్నారనీ, అలాంటి వారిపై రెడ్‌బుక్‌లో రాస్తున్నామని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… అలాంటివాటిపై తనదైన శైలిలో స్పందిస్తాననీ, ఒకరి స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించే రీతిలో ఎవరి మాటలైనా ఉంటే వాటికి తగిన సమాధానం చెప్తామని ఆనంద్ స్పష్టం చేశారు.
మావోయిస్టుల చరిత్ర రాష్ట్రంలో అంతమైందనీ, ఆ వ్యవస్థ తిరిగి వేళ్లూనుకోకుండా తమ చర్యలు సాగుతాయనీ, మిగిలిన ఐదుగురు మావోయిస్టు నేతలు వెంటనే లొంగిపోవాలనీ, వారికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేయూతనందిస్తుందని డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టు సమస్య లేనందున దానికి వ్యతిరేకంగా పని చేసే గ్రేహౌండ్స్, ఎక్సైజ్ విభాగాల పని కూడా తగ్గుతుందనీ, ఇందులో ఉన్న అధికారులు, సిబ్బందిని పోలీసు శాఖలో ఇతర విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19వేల పోలీసు ఖాళీలు ఉన్నాయనీ, అందులో 5వేల వరకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగల్ ఇచ్చిందని ఆయన తెలిపారు. అలాగే పోలీసు శాఖ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి తమకు ప్రతిపాదన ఇవ్వాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు తనకు సూచించారనీ, ఆ దిశగా త్వరలోనే సమావేశమై చర్చిస్తామని చెప్పారు.
గోవుల అక్రమ రవాణాపై ఆయన స్పందిస్తూ… బక్రీద్ వస్తున్న నేపథ్యంలో ఈ సమస్య ఉంటుందనీ, అయితే ఎవరన్నా గోవులను అక్రమంగా తరలిస్తుంటే వాటిని పట్టుకునే బాధ్యత కేవలం పోలీసులదేననీ, గోరక్షణ సంస్థలు కేవలం సమాచారం ఇవ్వాలని ఆనంద్ స్పష్టం చేశారు.ఫోన్‌ట్యాపింగ్ కేసులో తాను నగర పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు దానిని పర్యవేక్షించాననీ, ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు పూర్తైందనేది అధికారులతో సమీక్ష జరుపుతాననీ, తనకు తెలిసినంత వరకు ఈ కేసు దర్యాప్తు పూర్తయిందనీ, రెండో చార్జిషీటు వేయాల్సి ఉందని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. సైబర్ నేరస్థులు, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికర్స్ భరతం పట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారాన్ని తీసుకుంటామనీ, టెక్నాలజీతో హద్దూ, అదుపూ లేకుండా మోసాలకు పాల్పడుతున్న నేరస్థులను కట్టడి చేయడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆధునిక సాంకేతికతపై నిశితంగా దృష్టిని సారించి అనుభవాన్ని గడించాల్సిన అవసరం ఉందనీ, అప్పుడే ఈ విధమైన హేయమైన నేరాలకు చెక్ పెట్టగలమని అన్నారు. పోలీసు శాఖలో తన 35 ఏండ్ల సర్వీసులో అనేక అనుభవాలను గడించాననీ, ఆ అనుభవాన్ని రంగరించి రాష్ట్ర పోలీసు శాఖ కీర్తి, ప్రతిష్టలను పెంచడమేగాక ముఖ్యమంత్రి ఆశిస్తున్న ఫలితాలను సాధిస్తామని ఆయన భరోసాను వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేశ్ భగవత్, సీఐడీ డీజీపీ చారుసిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



