Saturday, May 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవంద రోజుల్లో

వంద రోజుల్లో

- Advertisement -

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
45 డిమాండ్లు పరిష్కరించాలి సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని హామీ
ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోవాలన్న డిప్యూటీ సీఎం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీజీఈజేఏసీ చైర్మెన్‌ వి లచ్చిరెడ్డి, సెక్రెటరీ జనరల్‌ వోడ్నాల రాజశేఖర్‌, నాయకులు కె రామకృష్ణ, ఎస్‌ రాములు, బాణాల రాంరెడ్డి, పెంటయ్య, రమేష్‌పాక, నిర్మల, ఎండీ హబీబ్‌మియా, కె మహిపాల్‌రెడ్డి, దర్శన్‌గౌడ్‌, వి బిక్షం, ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 45 డిమాండ్లను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి దృష్టికి తీసుకెళ్లామని టీజీఈజేఏసీ చైర్మెన్‌ వి లచ్చిరెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం, ఆర్థికభారంపై ఉద్యోగ సంఘాలతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి వంద రోజుల్లోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతినెల ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని భట్టి సూచించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై తీపికబురు అందిస్తామని అన్నారు. ఉప ముఖ్యమంత్రితో జరిగిన చర్చల పట్ల టీజీఈజేఏసీ చైర్మెన్‌ లచ్చిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల ఐదో తేదీన ఉద్యమ కార్యాచరణపై టీజీఈజేఏసీ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, కాంటిజెంట్‌ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్‌ రెండు నాటికి పీఆర్సీని అమలు చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -