ఉస్మానియాలో ఒకేసారి ఐదు అవయవాల
మార్పిడి శస్ర్తచికిత్స
వైద్యుల టీమ్‌కు ప్రధాని మోడీ, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఉస్మానియా ప్రభుత్వాస్పత్రి వైద్యులు చరిత్ర సృష్టించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఉస్మానియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో వైద్యులు, నర్సులు, ఆస్పత్రి సిబ్బంది 36 గంటల పాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా ఐదు అవయవాలను ఒకేసారి మార్పిడి చేశారు. ఒకేసారి, ఒకే రోగికి ఐదు అవయవాలను (మల్టీ-విసెరల్) విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. డాక్టర్ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్లకు చెందిన 30 ఏండ్ల యువ ఇంజినీర్ అరుదైన జన్యుపరమైన ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్ కోలై వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. గతంలోనే ఓ ప్రయివేటు ఆస్పత్రిలో అతని పెద్దపేగుకు క్యాన్సర్ గడ్డలు ఏర్పడి పాడవ్వడంతో దానిని తొలగించారు. ఆ తర్వాత చిన్నపేగుకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకడంతో దాదాపు 60 శాతానికిపైగా తీసేశారు. పెద్దపేగు, చిన్నపేగు తీసేయడంతో అతను ఏమి తిన్నా ఉపయోగం లేకుండా పోయింది. రోజురోజుకీ వెయిట్ లాస్ అవుతూనే ఉన్నాడు. గతంలో ఉస్మానియా ఆస్పత్రిలో ఇంటర్ స్ర్టయినల్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన విషయాన్ని తెలుసుకుని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఎండో స్కోపీ చేయగా అతని చాలా భాగాల్లో కూడా ట్యూమర్లు ఉన్నట్టు తేలింది. ఆయన మల్టీ విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని ఉస్మానియా వైద్యులు గుర్తించారు.
అయితే, ఇండియాలో ఇప్పటి వరకూ మల్టీ విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన అనుభవం ఎవ్వరికీ లేదు. దాంట్లో కాస్త అనుభవం ఉన్న డాక్టర్ అనిల్ బైద్యను సంప్రదించి పలు సలహాలు తీసుకున్నారు. ఆ యువకుడు ఎనిమిది నెలల కిందనే జీవన్‌దాన్‌లో అవయ మార్పిడి కోసం పేరును నమోదు చేయించుకున్నాడు. మూడు నెలల కింద బ్రెయిన్ డెడ్ అయిన డోనర్ నుంచి అవయవాలను తీసి ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు యత్నించగా పెద్దపేగుకు రక్తసరఫరా లేకపోవడంతో అతనికి జత కాలేదు. మూడు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో 35 ఏండ్ల గర్భిణి ప్రసవం సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరిగి రక్తనాళాలు చిట్లడంతో బ్రెయిన్ డెడ్ అయింది. ఉస్మానియా వైద్యులు కౌన్సింగ్ చేయడంతో ఆ యువతి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. మల్టీ విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ అత్యంత క్లిష్టమైనది కావడంతో రెండు బాడీలను పక్కపక్కనే బెట్టి అనస్తీసియా డాక్టర్ మాధవి సహకారంతో డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో సీనియర్, పీజీ డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రి సిబ్బంది 36 గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తిచేశారు. కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేశారు. అత్యంత క్లిష్టమైన మల్టీవిసెరల్ శస్ర్తచికిత్స చేసిన ఉస్మానియా ప్రభుత్వాస్పత్రి వైద్యులను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా అభినందించారు.
ప్రపంచ వైద్యసేవలకు నిదర్శనం : మంత్రి రాజనర్సింహ
ఉస్మానియా వైద్య బృందం సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అత్యంత క్లిష్టతరమైన అవమార్పిడి శస్ర్తచికిత్సను విజయవంతంగా పూర్తిచేయడంతో తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్టను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఉస్మానియా వైద్య బృందానికి ఎన్‌ఓటీటీఓ అభినందనలు దేశంలోనే తొలిసారిగా.. ఒక పేషెంట్‌కు ఒకేసారి ఐదు అవయవాలు మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని నేషనల్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్(ఎన్‌ఓటీటీఓ) ఎక్స్ వేదికగా అభినందించింది.



